చీకటి సమ్మెట | Seemandhra Electricity employees strike hit normal life | Sakshi
Sakshi News home page

చీకటి సమ్మెట

Published Fri, Sep 13 2013 2:38 AM | Last Updated on Fri, Sep 1 2017 10:39 PM

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఎన్‌టీటీపీఎస్ గేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్న ఉద్యోగులు, కార్మికులు

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఎన్‌టీటీపీఎస్ గేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్న ఉద్యోగులు, కార్మికులు

సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో నేటి నుంచి రాష్ట్రంలో చీకట్లు కమ్ముకోనున్నాయి. 11వ తేదీ అర్ధరాత్రి నుంచి వారు ప్రారంభించిన 72 గంటల సమ్మె కారణంగా ఇటు విద్యుదుత్పత్తి, అటు సరఫరా రెండూ ఇప్పటికే తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి.

* పలు ప్లాంట్లలో భారీగా తగ్గనున్న విద్యుదుత్పత్తి  
* పులి మీద పుట్రలా సాంకేతిక సమస్యలు
* ఇప్పటికే అంధకారంలోకి చాలా గ్రామాలు  
* నేటి నుంచి సమస్య మరింత తీవ్రతరం
* కనీసం 3,000 మెగావాట్ల ఉత్పత్తికి కోత!
* గృహావసరాలకు, పరిశ్రమలకు కరెంటు కట్!
* అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు  
* రేపు అర్ధరాత్రి దాకా కొనసాగనున్న సమ్మె
 
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో నేటి నుంచి రాష్ట్రంలో చీకట్లు కమ్ముకోనున్నాయి. 11వ తేదీ అర్ధరాత్రి నుంచి వారు ప్రారంభించిన 72 గంటల సమ్మె కారణంగా ఇటు విద్యుదుత్పత్తి, అటు సరఫరా రెండూ ఇప్పటికే తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. కరెంటు సరఫరాపై గురువారం పెద్దగా ప్రభావం పడకపోయినా శుక్రవారం నుంచి మాత్రం అది దారుణంగా ఉండనుంది. సమ్మెతో సీమాంధ్ర ప్రాంతంలోని పలు విద్యుత్ ప్లాంట్లల్లో గురువారం రాత్రి నుంచే విద్యుదుత్పత్తి దాదాపుగా నిలిచిపోయింది. సమ్మెకు తోడు ప్లాంట్లలో సాంకేతిక, ఇతరత్రా సమస్యలు పులి మీద పుట్రలా పరిణమించాయి.

ఎన్‌టీటీపీఎస్‌లో బొగ్గు సరఫరాకు ఆటంకం ఏర్పడగా శ్రీశైలం కుడిగట్టు ప్రాజెక్టులో మరమ్మతులు చేసేందుకు కార్మికులు కూడా ససేమిరా అంటున్నారు. భారీ వర్షాల వల్ల నీట మునిగిన ఆర్‌టీపీపీలో అసలు పనులే నడవడం లేదు. దాంతో శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్, సరఫరా మధ్య అంతరం భారీగా పెరిగే పరిస్థితి కన్పిస్తోంది. కనీసం 3,000 మెగావాట్ల విద్యుదుత్పత్తికి కోత పడవచ్చని అంచనా. సమ్మె 14వ తేదీ అర్ధరాత్రి దాకా కొనసాగనున్నందున సమస్య వెంటనే పరిష్కారమయ్యే పరిస్థితి కూడా లేదు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా కోతలు తప్పని పరిస్థితి ఏర్పడింది.

రైల్వేలు, ఆస్పత్రులు, తాగునీరు, సాగునీటికి విద్యుత్ సరఫరాలో ప్రాధాన్యతనిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినందున గృహావసరాలకు, పరిశ్రమలకు కొద్ది రోజుల పాటు భారీ కోతలు తప్పేలా లేవు. పలు జిల్లాలు ఇప్పటికే కరెంటు కోతల బారిన పడి అల్లాడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాల్లో 25 ఫీడర్ల పరిధిలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. 14 ఫీడర్లలో లోపాలను సవరించినా మరో 11 ఫీడర్ల పరిధిలో సమస్య ఇంకా కొనసాగుతుండటంతో ఏకంగా 85 గ్రామాల్లో చీకట్లు అలముకున్నాయి. పైగా శ్రీకాకుళం రిమ్స్‌తో పాటు పొందూరు ప్రభుత్వ ఆస్పత్రికి కూడా గురువారం మధ్యాహ్నం దాకా కరెంటు సరఫరా నిలిచిపోయింది.

విశాఖలోనూ గురువారం జిల్లావ్యాప్తంగా కోతలు కొనసాగాయి. ప్రకాశం జిల్లాలో కనిగిరి తదితర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి! పలుచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినా సిబ్బంది సమ్మె కారణంగా పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడు. ఉద్యోగులు తమ అధికారిక మొబైల్ నంబర్లను వెనక్కివ్వడంతో వినియోగదారులు తమ సమస్యలను ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. బాయిలర్, టర్బైన్, ఈఎస్‌పీ వంటి ప్లాంట్ల ప్రధాన విభాగాల షిఫ్టులకు మాత్రమే హాజరవుతామని సమైక్య ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ కమిటీ (సేవ్ జేఏసీ) ప్రకటించడంతో సాంకేతిక సమస్యలు తలెత్తినా మరమ్మతులకు కార్మికులు రావడం లేదు. దీనికి తోడు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల ఉద్యోగులు కూడా సమ్మెకు దిగడంతో విద్యుత్ పంపిణీలోనూ తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి.

విద్యుత్ సౌధలోని సీమాంధ్ర ఉద్యోగులు పెద్ద సంఖ్యలో సమ్మెకు దిగడంతో రోజువారీ కార్యక్రమాలు కూడా జరగని పరిస్థితి ఏర్పడింది. రిజర్వాయర్లలో నీరుండటం వల్ల జల విద్యుదుత్పత్తి సాయంతో గురువారం ఇబ్బంది లేకుండా సరఫరా సాధ్యపడిందని అధికారులంటున్నారు. మరోవైపు విద్యుత్ బిల్లులు చెల్లించొద్దన్న పిలుపుతో విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారనుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
 
ఇవీ ప్లాంట్ల తిప్పలు!
శ్రీశైలం కుడిగట్టు ఉత్పత్తి కేంద్రం
కర్నూలు జిల్లాలోని 770 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన ఈ ప్లాంటులో ఆయిల్ సరఫరా సమస్యతో ఇప్పటికే రెండు యూనిట్లలో ఉత్పత్తి ఆగింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కార్మికులెవరూ ముందుకు రావడం లేదు. దాంతో 5 యూనిట్లలో మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. పోలీసుల సాయంతో ఎడమ గట్టు నుంచి ఉద్యోగులను తీసుకెళ్లేందుకు యాజమాన్యం చర్యలు ప్రారంభించిందన్న వార్తలపై సీమాంధ్ర ఉద్యోగులు మండిపడుతున్నారు.
 
 శ్రీశైలం ఎడమగట్టు ఉత్పత్తి కేంద్రం
900 మెగావాట్ల సామర్థ్యమున్న ఈ ప్లాంటు మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో ఉన్నా ఇందులో సీమాంధ్ర ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో నీరు భారీగా ఉండటంతో పోలీసుల సాయంతో విద్యుదుత్పత్తి జరుగుతోంది.
 
ఆర్‌టీపీపీ పని అంతే!
భారీ వర్షాలతో నీట మునిగిన వైఎస్సార్ జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటు (ఆర్‌టీపీపీ)లో కోల్ హ్యాండ్లింగ్ మొత్తం నీట మునిగింది. పంప్‌హౌస్‌లో కూడా నీరు చేరింది. నీటిని తోడేందుకు కూడా కార్మికులెవరూ ముందుకు రావడం లేదు. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన కాంట్రాక్టు కంపెనీ కార్మికులు ప్లాంటుకు చేరుకున్నప్పటికీ లోనికి వెళ్లి పనులు చేసేందుకు ఉద్యోగులు అంగీకరించడం లేదు. దాంతో 1,050 మెగావాట్ల సామర్థ్యమున్న ఆర్‌టీపీపీకి మరమ్మతులు చేసి విద్యుదుత్పత్తి ప్రారంభించేందుకు మరో 10 రోజులైనా పడుతుందని జెన్‌కో వర్గాలు తెలిపాయి.
 
ఎన్‌టీటీపీఎస్‌లో ఫలించిన చర్చలు!
విజయవాడలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్‌టీటీపీఎస్)లో 210 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు యూనిట్లతో పాటు 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఒక యూనిట్ ఉన్నాయి. వీటిలో 1, 2, 3, 4 యూనిట్లకు బొగ్గు సరఫరాలో ఇబ్బందులు ఏర్పడ్డా, యాజమాన్యంతో ఉద్యోగుల చర్చలు ఫలించి, కోల్ హ్యాండ్లింగ్‌కు వారు అంగీకరించారు. కాబట్టి అక్కడ పరిస్థితి కాస్త మెరుగు పడవచ్చని సమాచారం. అయితే బాయిలర్ ట్యూబులకు రంధ్రాల కారణంగా ఐదో యూనిట్‌లో మొత్తం 210 మెగావాట్ల విద్యుదుత్పత్తి ఇప్పటికే నిలిచిపోయింది. మరమ్మతులు చేసేందుకు సిబ్బంది ససేమిరా అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement