సమ్మెలోకి సీమాంధ్ర ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సీమాంధ్ర ఉద్యోగులు బుధవారం అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభించారు. ఉద్యోగుల సమ్మెతో సీమాంధ్ర జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలు నిలిచిపోనున్నాయి. ఏపీఎన్జీవోల నేతృత్వంలో దాదాపు 70 సంఘాలు సమ్మెకు సమాయత్తమవుతున్నాయి. రెవెన్యూ, ఎక్సైజ్, ట్రెజరీ, సహకార, వాణిజ్య పన్నులు, మెడికల్, విద్యుత్, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. ఫలితంగా సీమాంధ్రలో ప్రభుత్వ వ్యవస్థ పూర్తిగా స్తంభించనుంది.
గ్రామ రెవెన్యూ అధికారుల నుంచి తహశీల్దారు వరకు.. రెవెన్యూ ఉద్యోగులు కూడా సమ్మెలో ఉన్నందువల్ల గ్రామస్థాయిలోనూ సమ్మె ప్రభావం కనిపించనుంది. ఉపాధ్యాయులూ సమ్మెలో వెళ్లనున్న నేపథ్యంలో పాఠశాలలు మూతపడనున్నాయి. విశ్వవిద్యాలయ, కళాశాలల బోధన, బోధనేతర సిబ్బంది కూడా సమ్మె లో చేరనున్నారు. దాదాపు 3 లక్షల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారని అంచనా. సమ్మెలో అత్యవసర సేవలకు మినహాయింపు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు ఇప్పటికే నిర్ణయించాయి.
ఆర్టీసీ కార్మికులు సమ్మెలో లేనందువల్ల బస్సుల రాకపోకలు యథావిధిగా ఉంటాయి. సీఎం కిరణ్ ఢిల్లీలో చేపట్టిన ధర్నాకు తాము సంపూర్ణ మద్దతు పలుకుతున్నట్లు ఎన్జీవోలసంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు చెప్పారు. రాష్ట్ర విభజన బిల్లును దొడ్డిదారిన రాజ్యసభకు పంపుతుండడం కేంద్రం దిగ జారుడుతనానికి నిదర్శనమన్నారు. సమైక్యవాదులను హైదరాబాద్ నుంచి పంపిస్తామంటున్న విభజన వాదులకు ఆ మాటను తెలంగాణ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వద్ద చెప్పే దమ్ముందా? అని ప్రశ్నించారు.
ఈనెల 9న జరగనున్న టెట్ పరీక్షకు, ఇంటర్ పరీక్షలకు రెవెన్యూ ఉద్యోగులెవరూ హాజరు కావద్దని కోరామని రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. 10 నుంచి ప్రభుత్వం తలపెట్టిన రెవెన్యూ సదస్సులను బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. అప్రజాస్వామికంగా పార్లమెంట్‌లో ప్రవేశపెడుతున్న విభజన బిల్లును అడ్డుకోవాలన్న చిత్తశుద్ధి రాష్ట్ర ఎంపీలు, కేంద్ర మంత్రుల్లో కొరవడిందని దుయ్యబట్టారు.
సమ్మెలో తాము పాల్గొనడం లేదని పంచాయతీరాజ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బుచ్చిరాజు, ప్రధాన కార్యదర్శి శరత్‌చంద్ర, కార్యదర్శి రాఘవన్ తెలిపారు. తమతో సంప్రదించకుండా ఎన్జీవోల సంఘం నాయకులు సమ్మె నిర్ణయం ప్రకటించారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఏపీఎన్జీవోలు ఆకస్మికంగా సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారని, ఈనెల 8వ తేదీన విజయవాడలో జరగనున్న మున్సిపల్ జేఏసీ సమావేశంలో ఉద్యోగులతో చర్చించి తాము నిర్ణయం తీసుకుంటామని జేఏసీ కన్వీనర్ కృష్ణమోహన్ తెలిపారు.