రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వచ్చే నెల 2వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్టు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు ప్రకటించారు.
హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వచ్చే నెల 2వ తేదీ నుంచి సమ్మెకు దిగనున్నట్టు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు ప్రకటించారు. ఈ అంశంపై కేంద్రం పునరాలోచించాలని సచివాలయ ఉద్యోగులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని బుధవారం కలిసి సమ్మె నోటీసును అందజేశారు. యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని పునస్సమీక్షించుకునే వరకూ సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు మంగళవారమూ తమ ఆందోళన కొనసాగించారు. ఉద్యోగులందరూ నలుపురంగు దుస్తులు ధరించి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రేపు సచివాలయంలో రక్తదాని శిబిరం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. కేంద్రం ఇచ్చే ప్యాకేజీలపై నమ్మకం లేదని వారు తెలిపారు. ఒకవేళ విభజన జరిగితే తమ పిల్లల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.