సీమాంధ్రలో మోగనున్న బడిగంట
సమ్మె విరమించిన సీమాంధ్ర టీచర్లు, అధ్యాపక జేఏసీలు
సీఎం సమక్షంలో చర్చలు సఫలం.. నేటి నుంచి విధుల్లోకి
వివరాలు వెల్లడించిన మంత్రి ఆనం
విరమణ తాత్కాలికమే, అవసరమైతే మళ్లీ సమ్మెకు సిద్ధం: జేఏసీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలన్న డిమాండ్‌తో 50 రోజులుగా సమ్మె చేస్తున్న సీమాంధ్ర ఉపాధ్యాయ, అధ్యాపకులు ఇక విధుల్లో చేరనున్నారు. గురువారం రాత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో టీచర్ల, అధ్యాపక జేఏసీలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. తాత్కాలికంగా సమ్మె విరమణకు జేఏసీలు అంగీకరించాయి. దీంతో సీమాంధ్రలోని 1,61,500 టీచర్లతో పాటు లెక్చరర్లు, అధ్యాపకులు శుక్రవారం విధుల్లో చేరతారని చర్చల అనంతరం ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మీడియాతో చెప్పారు. వారు వెంటనే విధుల్లో చేరడానికి అవకాశం ఉన్నందున ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు తెలియజేసినట్లు పేర్కొన్నారు. దసరా సెలవుల అనంతరం క్లాసులు ప్రారంభమవుతాయని తెలిపారు. సమ్మె కాలంలో వేతనాల చెల్లింపుపై కేబినెట్ సబ్ కమిటీ చర్చిస్తుందని, ఉద్యోగ భద్రతకు సీఎం హామీ ఇచ్చారని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తమ వంతుగా పూర్తి స్థాయి ప్రయత్నాలు చేస్తామని కూడా హామీ ఇచ్చినట్లు ఆనం తెలిపారు.రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆగస్టు 21 అర్ధరాత్రి నుంచి ఉపాధ్యాయులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్యా సంవత్సరం నష్టపోకుండా, పరీక్షల్లో వెనుకబడకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉపాధ్యాయ, అధ్యాపక జేఏసీల నేతలు వెల్లడించారు. సమ్మె తాత్కాలికంగానే విరమించామని, సమైక్యాంధ్ర విషయంలో అవసరమైతే మళ్లీ సమ్మెకు సిద్ధంగా ఉంటామని ఆ జేఏసీలు పేర్కొన్నాయి. ప్రస్తుతం విధుల్లో చేరినా తాము సమైక్యాంధ్ర నినాదాన్ని, ఆందోళనలను కొనసాగిస్తామని వెల్లడించారు. ఆందోళనల రూపం మార్చి రిలే నిరాహార దీక్షలు, గ్రామాల్లో చైతన్య కార్యక్రమాల్ని నిర్వహిస్తామన్నారు. సీఎం సమక్షంలో జరిగిన ఈ చర్చల్లో ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మాధ్యమిక విద్యా శాఖ మంత్రి పార్థసారథి, ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు గాదె శ్రీనివాసులు నాయుడు, సత్యనారాయణ రాజు, పుల్లయ్య, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో పాటు ఇతర అధికారులు రావత్, పూనం మాలకొండయ్య, వాణీమోహన్, ఉపాధ్యాయ, అధ్యాపక జేఏసీల ప్రతినిధులు కమలాకర్‌రావు, శివకుమార్, సుధాకర్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
సమ్మె కొనసాగిస్తాం: వైఎస్సార్ టీఎఫ్
కేంద్ర ప్రభుత్వం నుంచి సమైక్య ప్రకటన వచ్చే వరకు సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా సమ్మె కొనసాగిస్తామని వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ ప్రకటించింది. సమస్యకు పరిష్కారం లభించకముందే దాదాపు 50 రోజులుగా సాగుతున్న సమ్మె నుంచి ఉపాధ్యాయులు వెనక్కి తగ్గడం దురదృష్టకరమని పేర్కొంది. ఈ మేరకు వైఎస్సార్ టీఎఫ్ రాష్ట్ర కన్వీనర్ కె.ఓబుళపతి, స్టీరింగ్ కమిటీ సభ్యులు కే జాలిరెడ్డి, అశోక్‌కుమార్‌రెడ్డి, రియాజ్ ఉస్సేన్‌లు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.