
కొబ్బరికి తెగుళ్ల బెడద
వాతావరణ ప్రతికూల పరిణామాలు సీజన్ పంటలకే కాదు దీర్ఘకాలిక పంటలు, చెట్లపై కూడా ప్రభావం చూపుతున్నాయి. వివిధ మండలాల్లో కొబ్బరికి సోకుతున్న తెగుళ్లను ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు సీ.వీ రామారావు, ప్రదీప్‌లు గుర్తించారు.
- ఎస్.రాయవరం మండలంలో నల్లముట్టె
- పాయకరావు పేటలో గ్రెబ్లెయిట్
- నివారణ చర్యలు చేపట్టాలంటున్న ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు
అనకాపల్లి: వాతావరణ ప్రతికూల పరిణామాలు సీజన్ పంటలకే కాదు దీర్ఘకాలిక పంటలు, చెట్లపై కూడా ప్రభావం చూపుతున్నాయి. వివిధ మండలాల్లో కొబ్బరికి సోకుతున్న తెగుళ్లను ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు సీ.వీ రామారావు, ప్రదీప్‌లు గుర్తించారు. జిల్లాలోని ఎస్.రాయవరం, పాయకరావుపేట మండలాల కొబ్బరి రైతుల తెగుళ్ల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. లేకుంటే దిగుబడి తగ్గే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
గ్రే బ్లెయిట్ తెగులు...
పాయకరావుపేట మండలంలోని కొబ్బరి తోటల్లో గ్రే బ్లెయిట్ తెగులును గుర్తించినట్లు ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త సీ.వీ రామారావు తెలిపారు. దీని లక్షణం చెట్టు ఆకులపై ముందుగా పసుపు రంగు మచ్చలుగా ఏర్పడి నలుపు రంగుకు మారతాయి.
ఆకులు ఎండిపోయి మట్టలు రాలిపోతాయి. మట్టలు రాలిపోతే కాయ దిగుబడి తగ్గిపోతుంది. దీని నివారణకు తెగులు సోకిన మట్టలను కొట్టి తగులబెట్టాలి. లీటర్ నీటికి మూడు గ్రాముల కాఫర్ ఆక్సీక్లోరైడ్‌ను లేదా 100 మిల్లీలీటర్ల నీటికి రెండు మిల్లీలీటర్ల టెబుకొనజోల్ ప్రొఫికొనాజోల్‌ను కలిపి వేరు ద్వారా చెట్టుకు అందేటట్టు పిచికారీ చేయాలి.
నల్లముట్టె తెగులు...
ఎస్ రాయవరం మండలంలోని కొబ్బరి తోటల్లో నల్లముట్టెతెగులును ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని లక్షణాల మేరకు పురుగు సోకినపుడు పత్ర హరితం తినడం వల్ల ఆకుపై తెల్లని మచ్చలు ఏర్పడతాయి. ఉధృతి అధికంగా ఉంటే తోట మాడిపోతుంది. దీని నివారణకు గాను పురుగు సోకిన మట్టలు కొట్టివేయాలి. 10మిల్లీ లీటర్ల మోనోక్రోటపాస్‌ను 10 మిల్లీ లీటర్ల నీటికి కలిపి వేరు ద్వారా అందించాలి.