బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రి వర్గం
- రాజధాని మాస్టర్ డెవలపర్ ఎంపికపై కేబినెట్ నిర్ణయం
- అంతర్జాతీయ బిడ్డింగ్‌లు ఆహ్వానించేందుకు ఆమోదం
- రాజధానిలో మౌలిక సదుపాయాల క ల్పనకు సీసీడీఎంసీ
- పీపీపీ విధానంలో మౌలిక సదుపాయాలు: మంత్రి నారాయణ
సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణానికి మాస్టర్ డెవలపర్‌ను స్విస్ చాలెంజ్ పద్ధతిలో ఎంపిక చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన, భవన నిర్మాణాలకుగాను కేపిటల్ సిటీ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ కంపెనీ (సీసీడీఎంసీ)ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని తీర్మానించింది. సీఎం ఎన్.చంద్రబాబు అధ్యక్షతన బుధవారం ఇక్కడ సమావేశమైన కేబినెట్ దీనిపై చర్చించింది. స్విస్ చాలెంజ్ పద్ధతిలోనే మాస్టర్ డెవలపర్‌ను ఎంపిక చేయాలని నిర్ణయించింది. సింగపూర్‌కు చెందిన జురాంగ్, సుర్బానా ఇంటర్నేషనల్ సంస్థలు మాస్టర్ ప్లాన్ రూపొందించిన నేపథ్యంలో.. మాస్టర్ డెవలపర్‌ను స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో ఎంపిక చేయబోతున్నారని ‘సాక్షి’ (ఏప్రిల్ 8 వ తేదీ) ముందుగానే పాఠకులకు తెలియజేసింది. మంత్రిమండలి సమావేశం అనంతరం మంత్రి పి.నారాయణ మీడియాతో మాట్లాడారు.
స్విస్ చాలెంజ్ పద్ధతిలో మాస్టర్ డెవలపర్‌ను ఎంపిక చేసేందుకు గాను అంతర్జాతీయ బిడ్డింగ్‌లు ఆహ్వానించడానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు చెప్పారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి సింగపూర్ ఇప్పటికే మాస్టర్ ప్లాన్ అందించిందనీ, మే 15 నుంచి నెలాఖరులోగా కేపిటల్ సిటీ ప్లాన్, జూన్ మొదటి వారం నుంచి రెండో వారంలోగా సీడ్ కేపిటల్ (రాజ్‌భవన్, సచివాలయం, అసెంబ్లీ, ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించే ప్రాంతం) ప్లాన్ అందించనున్నట్లు మంత్రి తెలిపారు.
సీసీడీఎంసీ విధి విధానాలపై ప్రాథమికంగా చర్చించామన్నారు. వాయు, జల, రోడ్డు రవాణా మార్గాల ఏర్పాటు, విద్యుత్, నీరు, డ్రెయినేజీ తదితర సౌకర్యాలన్నీ సీసీడీఎంసీ కల్పిస్తుందని చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పనను పీపీపీ విధానంలో చేపట్టే అంశం పరిశీలనలో ఉందన్నారు. కేపిటల్ సిటీ పరిధిని 225 చ.కి.మీ. నుంచి 375 చ.కి.మీ. మేరకు పెంచాలని తీర్మానించామన్నారు.
పర్యాటకాభివృద్ధికి 10 వేల ఎకరాలు
కృష్ణా నదికి ఉత్తరం వైపున రాజధాని ప్రాంతంలో పర్యాటకాభివృద్ధికి అయిదు నుంచి పది వేల ఎకరాలను భూ సమీకరణ కింద సేకరించాలని నిర్ణయించినట్టు మంత్రి వెల్లడించారు.
విమానాశ్రయానికి 12 వేల ఎకరాలు: పల్లె
విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇందుకు భూ సమీకరణ పద్ధతిలో 12 వేల ఎకరాల భూమిని సమీకరిస్తామని సమాచారశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి విలేకరులకు తెలిపారు. కర్నూల్ జిల్లా జూపాడుబంగ్లా మండలం తంగడంచె గ్రామం సర్వే నంబరు 345లో 211 ఎకరాల భూమిని జొన్నల ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కోసం గుజరాత్‌కు చెందిన అంబుజా ఎక్స్‌పోర్ట్స్ సంస్థకు కేటాయిస్తూ కేబినెట్ తీర్మానించింది.
ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం
ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపడానికి ప్రభుత్వం నడుంకట్టింది. అటవీ చట్టానికి ప్రతిపాదించిన సవరణలకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
మే 1 నుంచి ఉద్యోగులకు కొత్త వేతనాలు
పదో వేతన సంఘం ప్రతిపాదనల మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌తో కూడిన నూతన వేతనాలను మే 1 నుంచి ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. అంగన్‌వాడీ ఉద్యోగులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు (సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, జెడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, మేయర్) వేతనాల పెంపుపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తారు.
జూన్ 2న రాజధానికి శంకుస్థాపన !
నూతన రాజధాని నగరం అమరావతి నిర్మాణానికి జూన్ 2న శంకుస్థాపన చేయాలని మంత్రివర్గ సమావేశం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఒకవేళ ఆ రోజు వీలుకాని పక్షంలో అదే నెల 12 లేదా 13 తేదీల్లో శంకుస్థాపన చేసే అవకాశం ఉంది.
మహిళల నైపుణ్యాభివృద్ధికి తోడ్పాటు
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఏపీలో స్వయం సహాయక బృందాల మహిళలకు నైపుణ్యాభివృద్ధిలో తోడ్పాటు అందిస్తామని బహుళజాతి సంస్థ వాల్‌మార్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ డేవిడ్ ఛీజ్ రైట్ బుధవారం తెలిపారు. సీఎంతో భేటీ అయ్యారు.
స్మార్ట్ కాకినాడకు జపాన్ సహకారం
కాకినాడను స్మార్ట్ సిటీగా రూపొందించడంలో ఏపీ ప్రభుత్వానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని జపాన్‌కు చెందిన యొకోహమా సిటీ కౌన్సిల్ అధికారులు ప్రకటించారు.