వైఎస్సార్ సీపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీతోపాటు ప్రత్యేక హోదా సాధన సమితి, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్, నవ్యాంధ్ర హక్కుల సాధన సమితి, వివిధ విద్యార్థి సంఘాలు, వ్యాపార సంఘాల ఆధ్వర్యంలో...
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : వైఎస్సార్ సీపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీతోపాటు ప్రత్యేక హోదా సాధన సమితి, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్, నవ్యాంధ్ర హక్కుల సాధన సమితి, వివిధ విద్యార్థి సంఘాలు, వ్యాపార సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన బంద్ విజయ వంతమైంది. అక్కడక్కడా లోక్‌సత్తా, జనసేన పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాస్తారోకోలు, మండలాల్లోని ప్రధాన కూడళ్లల్లో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. బంద్ కారణంగా ప్రభుత్వ కార్యాల యాలు, పాఠశాలలు, కళాశాలలు, దుకాణాలు, బ్యాంకులు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం వరకు నిలిచిపోయాయి. పెట్రోల్ బంక్‌లను సైతం వరకు మూసివేశారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలను మోసగించిన కేంద్ర ప్రభుత్వం, ఈ అంశాన్ని పట్టించుకోని ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మలను పలుచోట్ల దహనం చేశారు.
ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు మూతపడటంతో రూ.వెయ్యి కోట్ల మేర ఆర్థిక లావాదేవీలు స్తంభించాయి. బంద్ కారణంగా జిల్లాలోని సుమారు 140 బస్సులను ఆందోళనకారులు నిలిపివేశారు. దీంతో ఆర్టీసీకి రూ.20 లక్షల మేర ఆదాయ నష్టం వాటిల్లింది. ఏలూరు నగరంలో సీపీఎం ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను పార్టీ కార్యాలయం నుంచి శవయాత్రగా తీసుకెళ్లి ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో దహనం చేశారు. తెల్లవారుజామున 4.30 గంటలకే వివిధ పార్టీల నాయకులు ఆర్టీసీ డిపోలకు చేరుకుని బస్సులను బయటకు రానివ్వకుండా అడ్డగించారు. ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో అఖిలపఖ నాయకులు మానవహారం ఏర్పాటు చేశారు. విద్యార్థులు, ప్రజా సం ఘాల కార్యకర్తలు బైక్‌లపై నగరమంతా తిరుగుతూ తెరిచి ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పాఠశాలలు, కళాశాలలు, దుకాణాలను మూయించారు.
ఏలూరులో కార్యక్రమాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, పార్టీ నాయకులు గుడిదేశి శ్రీనివాస్, మున్నుల జాన్‌గురునాథ్, బండారు కిరణ్, సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్, సీపీఎం నాయకులు మంతెన సీతారాం, బి.బలరాం, ఏఐటీయూసీ నాయకుడు కె.కృష్ణామాచార్యులు, సీఐటీయూ నాయకుడు డీఎన్‌వీడీ ప్రసాద్ నేతృత్వం వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో బుట్టాయగూడెం, కొయ్యలగూడెంలో బంద్ విజయవంతంగా జరిగింది. తణుకు బస్టాండ్ సెంటర్‌లో అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నాలు చేశారు. ఈ సందర్భంగా 20 మంది నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి నిరసనగా ఆందోళనకారులు పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించారు. కొవ్వూరులో వైఎస్సార్ సీపీ కన్వీనర్ తానేటి వనిత ఆధ్వర్యంలో బంద్‌ను విజయవంతంగా నిర్వహించారు. సీపీఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఐ.పంగిడిలో డీసీసీ అధ్యక్షుడు రఫీయుల్లాబేగ్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. తాడేపల్లిగూడెంలో సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ ఆధ్వర్యంలో బంద్‌ను నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయగా, ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉంగుటూరు మండలం నారాయణపురంలో వైఎస్సార్ కాంగ్రెస్, ఇతర పార్టీల కార్యకర్తలు ఉమ్మడిగా బంద్ నిర్వహించారు. భీమవరంలో వైసీపీ నియోజకవర్గ కన్వీనర్ గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీపీఐ, సీపీఎం బంద్‌ను విజయవంతంగా నిర్వహిం చాయి. నరసాపురంలో వివిధ పార్టీల ఆధ్వర్యంలో కార్యకర్తలు బస్టాండ్ నుంచి శివాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి దుకాణాలను, ప్రభుత్వ కార్యాలయాలను, విద్యా సంస్థలను మూయించివేశారు. నిడదవోలులో సీపీఐ, కాంగ్రెస్ నాయకులు పట్టణమంతా తిరుగుతూ బంద్‌ను పర్యవేక్షించారు. సీపీఎం నాయకులు ఓవర్‌బ్రిడ్జి సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
పాలకొల్లులో వైసీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు చెల్లెం ఆనంద్‌ప్రకాష్, మునిసిపల్ ప్రతిపక్ష నాయకుడు యడ్ల తాతాజీ పాల్గొన్నారు. ఉండి మండలంలో ఆందోళనకారులు బైక్‌ర్యాలీ నిర్వహించి దుకాణాలు, పాఠశాలలను మూయించివేశారు. కాళ్ల మండలంలో రాష్ట్ర రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. జంగారెడ్డిగూడెంలో బస్టాండ్ వద్ద ఆందోళనకారులు ధర్నా నిర్వహించారు. చింతలపూడి బోసుబొమ్మ సెంటర్‌లో వివిధ పార్టీల నాయకులు రాస్తారోకో చేశారు. దేవరపల్లి రాష్ట్ర రహదారిపై రాస్తారోకో చేశారు. నల్లజర్లలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ నాయకులు, కార్యకర్తలు బంద్ నిర్వహించారు. పలుచోట్ల ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు జరిగాయి.