ఫిరంగిపురం, న్యూస్‌లైన్: నీతివంతులైన సేవకులు విశ్వాసం వలన జీవించునని తాటిపత్రి జ్ఞానమ్మ నిరూపించారని గుంటూరు పీఠాధిపతి గాలిబాలి కొనియాడారు. బుధవారం స్థానిక అన్నమ్మ మఠ సంస్థల వ్యవస్థాపకురాలు తాటిపత్రి జ్ఞానమ్మను దైవసేకురాలిగా ప్రకటించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. నీతివంత మైన జీవితం గడిపిన వారు దేవుని బిడ్డలుగా గుర్తింపబడతారని, అందుకు నిదర్శనమే పునీత తాటిపత్రి జ్ఞానమ్మ అన్నారు. తాటిపత్రి జ్ఞానమ్మ స్థాపించిన సెయింట్ ఆన్స్ సంస్థలు చేస్తున్న సేవలను గుర్తించి వాటికన్‌లో ఉన్న పరిశుద్ధ పోప్ ఫ్రాన్సిస్ తమకు సందేశాన్ని పంపారన్నారు. ఆనాడు పాత నిబంధన గ్రంథంలో ఇస్సాకు తన విశ్వాసం అనే విత్తనం నాటి ఏవిధంగా ఒక మంచి పెద్ద వృక్షాన్ని తయారు చేశారో అదే విధంగా విశ్వాసం అనే సెయింట్ ఆన్స్ సంస్థల మొక్కని తాటిపత్రి జ్ఞానమ్మ నాటరాన్నారు.
జ్ఞానమ్మకు దేవుని ఆశీర్వాదాలు మెండుగా ఉన్నాయని, నాడు ఆమె నాటిన సెయింట్ ఆన్స్ అనే మొక్క జిల్లా రాష్ట్రం, దేశవ్యాప్తంగా విస్తరించినదన్నారు. ఒక సాధారణ గృహిణిగా ఉన్న ఆమె ఇలా దైవ సేవకురాలిగా ప్రకటించబడడం మహిళా లోకానికే వన్నె తెచ్చిందన్నారు. తాటిపత్రి జ్ఞానమ్మను దైవసేవకురాలిగా ప్రకటిస్తూ వాటికన్‌సిటీలోని పరిశుద్ధ పోప్ నుంచి లాటిన్, తెలుగు, ఇంగ్లీష్ భాషలలో అందిన సందేశాన్ని గుంటూరు పీఠాధిపతి గాలిబాలి, నెల్లూరు బిషప్ ఎం.డి.ప్రకాశం, చైన్నై విచారణ గురువు ఛార్లెస్ కుమార్ చదివి వినిపించారు. జ్ఞానమ్మ చిత్ర పటాన్ని ఆవిష్కరించారు.
తొలుత స్థానిక సెయింట్ ఆన్స్ ప్రోవిన్షిలేట్ నుంచి సెయింట్ ఆన్స్ సంస్థల మదర్ జనరల్ బోయపాటి ఫాతిమా ఆధ్వర్యంలో వే దిక వద్ద బిషప్ డా.గాలిబాలి, ఎం.డి.ప్రకాశంలను మేళతాళాల మధ్య స్వాగతం పలికారు. కార్యక్రమంలో సుపీరియర్ జనరల్ రోజిరియా , గుంటూరు డిజిఎం పూదోట ఇన్నయ్య, ఆలయ సహాయ విచారణ గురువు ఫాదర్ బత్తినేని విద్యాసాగర్ పాల్గొన్నారు. జిల్లా, రాష్ర్ట్రం, దేశంతోపాటు, ఇతర దేశాల నుంచి వచ్చిన సుమారు 1000 మంది ఫాదర్స్, సిస్టర్స్ పాల్గొన్నారు. సిస్టర్స్ బృందం భక్తి గీతాలు ఆలపించారు. సెయింట్ ఆన్స్ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి బాల ఏసు కెథడ్రల్ దేవాలయ విచారణ గురువు బెల్లంకొండ జయరాజు అధ్యక్షత వహించారు.
దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ
Published Thu, Jun 5 2014 12:10 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
Advertisement
Advertisement