సాక్షి, కాకినాడ: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పెను తుఫాన్‌గా మారడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అండమాన్ రాజధాని పోర్టుబ్లెయిర్‌కు 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ పెను తుఫాన్ ఈ నెల 12న కళింగపట్నం-గోపాల్‌పూర్ మధ్య తీరాన్ని దాటనుంది. ఈ తుఫాన్ తీరం దాటే వరకు తీరం వెంబడి 130 కిలో మీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. అలాగే ముందస్తుగా కాకినాడ పోర్టులో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తున్నారు. తుఫాన్ పునరావాస చర్యల్లో పాల్గొనేందుకు జిల్లా అధికార యంత్రాంగమంతా అప్రమత్తమైంది. అవసరమైతే కనీసం మూడురోజుల పాటు జన్మభూమి-మా వూరు కార్యక్రమాన్ని వాయిదా వేయాలని రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు జిల్లా అధికారులను ఆదేశించారు.
జన్మభూమి-మావూరు కార్యక్రమంతో పాటు ముందు జాగ్రత్త చర్యలపై బుధవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. జిల్లాలోని తీర మండలాల ప్రజలను అప్రమత్తం చేయాలని కృష్ణారావు అధికారులకు సూచించారు. మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లకుండా టాంటాంలు వేయాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ నీతూప్రసాద్ మాట్లాడుతూ తుఫాన్ కారణంగా ముందస్తు చర్యలపై చర్చించేందుకు గురువారం సాయంత్రం ఐదు గంటలకు కాకినాడ విధాన గౌతమి హాలులో జిల్లా అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అనంతరం ఆరు గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్, ఏడు గంటలకు ఎంపీడీఒలు, తహశీల్దార్లు, ప్రత్యేకాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
రానున్న తుఫాన్ ప్రమాదాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగాముందుగానే అవసరమైన నిత్యావసర సరుకులను మండలల్లో సిద్ధంగా ఉంచాలని పౌరసరఫరాల శాఖాధికారులను కలెక్టర్ ఆదేశించారు. అవసరమైన మందులను సిద్ధంగా ఉంచడంతో పాటు తుఫాన్ షెల్టర్లను సిద్దంగా ఉంచాలని, అన్ని మంచినీటి ట్యాంకులను పూర్తిగానీటితో నింపాలని సూచించారు. 10వ తేదీ నుంచి తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అందుకు తగ్గట్టుగా అధికారులు సిద్ధం కావాలన్నారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. మండల ప్రత్యేకాధికారులు ఆయా మండలాల్లోనే మకాం వేసి అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. తుఫాన్ సందర్భంగా ఎంతటి విపత్కర పరిస్థితిైనె నా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో జేసీ ఆర్.ముత్యాలరాజు, ఏజేసీ మార్కండేయులు, సీపీఒ విజయలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
‘తుఫాన్’పై యంత్రాంగం అప్రమత్తం
Published Thu, Oct 9 2014 12:12 AM | Last Updated on Sat, Sep 2 2017 2:32 PM
Advertisement
Advertisement