జిల్లాకూ ‘హుదూద్’ ముప్పు!
సాక్షి, ఏలూరు : అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ‘హుదూద్’ తుపానుగా మారింది. తీవ్రరూపం దాల్చి మన రాష్ట్రం వైపు దూసుకువస్తోంది. 48 గం టల అనంతరం దాని ప్రభావం మన జిల్లాపైనా ఉం టుందన్న సమాచారంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా సిబ్బందిని అప్రమత్తం చేయూలంటూ ఆర్డీవోలు, తహసిల్దార్లకు కలెక్టర్ కె.భాస్కర్ ఆదేశాలు ఇచ్చారు. ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాల్సిందిగా మత్స్య, వ్యవసాయ, నీటి పారుదల శాఖల అధికారులకు సూచించారు. విద్యుత్, పౌర సరఫరాల శాఖలు కూడా తమ బాధ్యతలు నెరవేర్చడానికి సిద్ధమవుతున్నాయి. పరిస్థితిని బట్టి కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు తుపాను వార్తలు అన్నదాతల గుండెల్లో గుబులు రేపుతున్నాయి.
కొద్దిరోజుల క్రితం వచ్చిన గోదావరి వరదలకు ఉద్యాన పంటలు నష్టపోయి ఖరీఫ్‌లో తొలిదెబ్బను చవిచూసిన రైతులు హుదూద్ తుపాన్‌ను తలచుకని భయపడుతున్నారు.అక్టోబర్ వస్తే వణుకే : అక్టోబర్ నెల వచ్చిందంటే జిల్లాలోని రైతులకు వణుకు పుడుతోంది. జిల్లాపై ఏటా అక్టోబర్, నవంబర్ నెలల్లో భారీ వర్షాలు, తుపాన్లు విరుచుకుపడటం పరిపాటిగా మారింది. గతేడాది పై-లీన్, హెలెన్ తుపాన్లు, అంతకు ముందు ఏడాది నీలం, దానికి ముందు ముందు లైలా, జల్ తుపాన్లు జిల్లా రైతుల్ని కోలుకోలేని దెబ్బతీశాయి. మత్స్యకారులు, లంక గ్రామాల ప్రజలు జీవనాధారాన్ని కోల్పోయేలా చేశాయి. హుదూద్ తుపాన్ ముప్పు ఉందంటూ రెండో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేయడంతో మత్స్యకారులకు వేటకు వెళ్లడానికి జంకుతున్నారు. ప్రస్తుతం మెట్టలో వరి కోతలు మొదలు కాగా, మిగతా ప్రాంతాల్లో వరి కంకులు పాలు పోసుకునే దశలోను, గింజలు గట్టిపడే దశలోను ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో హుదూద్ తుపాను ప్రభావం జిల్లాపై పడితే ఇబ్బందులు తప్పవని రైతులు ఆందోళన చెందుతున్నారు.