మాయమాటలు చెప్పి ఓ మైనర్ బాలికను ఆమె స్నేహితురాలు, స్నేహితురాలి బావ విజయవాడ తీసుకువెళ్లి
గుంటూరు ఈస్ట్ : మాయమాటలు చెప్పి ఓ మైనర్ బాలికను ఆమె స్నేహితురాలు, స్నేహితురాలి బావ విజయవాడ తీసుకువెళ్లి లైంగిక దాడిచేసిన సంఘటనపై లాలాపేట పోలీసులు విచారిస్తున్నారు. సేకరించిన సమాచారం మేరకు నగరంలోని ఓ వస్త్ర దుకాణంలో సేల్స్ గర్ల్‌గా పనిచేస్తున్న రెహనా జాస్మిన్ తనతోపాటు పనిచేసే సంగడిగుంట ఎల్‌ఆర్ కాలనీకి చెందిన 17 సంవత్సరాల బాలికతో స్నేహంగా ఉంటూ ఉండేది. జాస్మిన్ బుధవారం విజయవాడలో షాపింగ్ చేసేందుకు తన బావతో పాటు కారులో వెళదామని తన స్నేహితురాలిని ఒప్పించింది. జాస్మిన్ బావ ఇలియాజ్ కారులో ముగ్గురూ విజయవాడ వెళ్లారు.
విజయవాడలోని మనోరమ హోటల్‌లో విశ్రాంతి తీసుకునేందుకు రూములో దిగారు. జాస్మిన్, ఇలియాజ్ కలసి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి బాలికకు ఇచ్చారు. అది తాగిన బాలిక మత్తులోకి జారుకుంది. అనంతరం ఇలియాజ్ ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మత్తు నుంచి కోలుకున్న అనంతరం ముగ్గురూ గుంటూరు నగరానికి చేరుకున్నారు. తనపై అఘాయిత్యం జరిగిన విషయాన్ని గ్రహించిన బాలిక తల్లిదండ్రులకు తెలియజేసింది. బాలిక తల్లిదండ్రులు గురువారం ఉదయం లాలాపేట పోలీసులకు విషయం తెలియజేశారు. కేసు నమోదు చేసిన ఎస్‌హెచ్‌ఓ నరసింహారావు బాలికను చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం.