ఉద్యమ మీరులకు వందనం: షర్మిల | Sharmila Saluted to United Andhra Fighters | Sakshi
Sakshi News home page

ఉద్యమ మీరులకు వందనం: షర్మిల

Published Thu, Sep 5 2013 2:42 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

ఉద్యమ మీరులకు వందనం: షర్మిల - Sakshi

ఉద్యమ మీరులకు వందనం: షర్మిల

  • ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక జేఏసీలకు అభినందనలు తెలిపిన షర్మిల
  •  ప్రాణాలను, జీతాలను, జీవితాలను పణంగా పెట్టి ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారు
  •  కాంగ్రెస్ వాళ్లు రాక్షసుల్లా వారి మీద కేసులు పెడుతున్నారు.. జీతాలు ఇవ్వబోం అంటున్నారు
  •  ఆ కేసులన్నీ మాఫీ చేయాలని, జీతాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం
  •  లేదంటే జగనన్న సీఎం కాగానే.. ఉద్యమ కేసులన్నీ మాఫీ చేస్తాం.. జీతాలను పువ్వుల్లో పెట్టి చెల్లిస్తాం
  •  ఓట్లు, సీట్ల కోసం, రాహుల్‌ను ప్రధానిని చేయడం కోసమే
  •  రాష్ట్రాన్ని అడ్డగోలుగా నరికేయడానికి కాంగ్రెస్ యత్నిస్తోంది
  •  చేసిందంతా చేసేసి ఇప్పుడు చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర చేస్తున్నారు
  •  విభజన లేఖను వెనక్కు తీసుకోవాలని ప్రజలు అడిగితే చంద్రబాబు ఏం చెప్తారు?
  •  మీరు, మీ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయరేమంటే ఏం జవాబిస్తారు?
  •  సమైక్యవాదానికి దన్నుగా నిలిచింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్, ఎంఐఎం, సీపీఎం మాత్రమే
  • ‘సమైక్య శంఖారావం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘కడుపు మండితే.. ఎవరైనా నిరసన తెలియజేయొచ్చు అన్నది రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కు. అలాంటిది కోట్ల మంది సీమాంధ్రులకు అన్యాయం జరుగుతోందని ఈ రోజు ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, విద్యార్థులు, సామాన్యులతోపాటు మహిళలు సైతం రోడ్లమీదికొచ్చి ఆందోళనలు చేస్తున్నారు. వారి ప్రాణాలను పణంగా పెడుతున్నారు.. వారి లాభాలను కాదనుకుంటున్నారు.. వారి జీతాలను కాదనుకుంటున్నారు.. వారి చదువులను కాదనుకుంటున్నారు.. వారి పనులను కాదనుకుంటున్నారు. అలాంటివారి మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెడుతోంది.
     
     కనికరం లేని ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్లు మనుషులా లేక రాక్షసులా?’’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నిప్పులు చెరిగారు. సమైక్య ఉద్యమంలో తమ వంతు పాత్ర పోషిస్తున్న ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయ జేఏసీ సంఘాలన్నింటినీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా అభినందిస్తోందని ఆమె అన్నారు. వారి ఉద్యమానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతు పలుకుతోందని, వారికి వచ్చిన ప్రతి కష్టంలోనూ పార్టీ అండగా నిలుస్తుందని మాట ఇచ్చారు. రాష్ట్రానికి న్యాయం చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది కాబట్టి.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ షర్మిల చేపట్టిన ‘సమైక్య శంఖారావం’ బస్సు యాత్ర మూడోరోజు బుధవారం అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో సాగింది. షర్మిల చిత్తూరు జిల్లాలోని మొలకలచెరువు, అనంతపురం జిల్లా కనకల్లు, కదిరి, గోరంట్ల, హిందూపురం, అనంతపురం సభలలో మాట్లాడారు. వీటిలో మొలకల చెరువు, కనకల్లు, గోరంట్ల సభలు షెడ్యూల్లో లేకున్నా.. సమైక్యవాదులు, అభిమానులు, పార్టీ కార్యకర్తల కోరిక మేరకు అక్కడ మాట్లాడారు. షర్మిల యాత్రలో మూడో రోజున కూడా ఈ రెండు జిల్లాల్లో ప్రజలు నీరాజనం పట్టారు. పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు ఎదురేగి స్వాగతం పలికారు. షర్మిల ప్రసంగానికి పదేపదే చప్పట్లు, నినాదాలతో జనం హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఆయా సభల్లో షర్మిల ప్రసంగం ఆమె మాటల్లోనే..
     
     జగనన్న సీఎం కాగానే కేసులన్నీ ఎత్తేస్తాం..
     ‘‘సీమాంధ్రకు అన్యాయం జరుగుతుందని ఉద్యమిస్తున్న వారి మీద కాంగ్రెస్ పార్టీ పెట్టిన అన్ని కేసులనూ వెంటనే ఎత్తివేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయకపోతే.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం.. జగనన్న ముఖ్యమంత్రి అవడం ఖాయం.. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత.. సీమాంధ్ర కోసం ఉద్యమించిన ఆ వీరుల మీద ఉన్న అన్ని కేసులనూ ఎత్తేస్తారని మాట ఇస్తున్నాం. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక జేఏసీ సంఘాలవారు జీవితాలను పణంగా పెట్టి.. రోడ్ల మీద కూర్చొని ఉద్యమిస్తుంటే.. ఈ కాంగ్రెస్ పార్టీ వారి కడుపుమీద కొట్టి జీతాలు కూడా ఇవ్వనూ అంటోంది. వారి కడుపు మంటను అర్థం చేసుకుని.. భవిష్యత్తు తరాల కోసం వారు చేస్తున్న ఉద్యమాన్ని అర్థం చేసుకుని వారికి వెంటనే జీతాలు ఇవ్వాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అలా వారు ఇవ్వని పక్షంలో, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ఆ పోరాట యోధులందరికీ, వారు కోల్పోయిన జీతాలను పువ్వుల్లో పెట్టి అందిస్తాం.


     
     రాహుల్‌ను ప్రధానిని చేయడం కోసమే..
     ఓట్ల కోసం, సీట్ల కోసం, టీఆర్‌ఎస్‌ను కలుపుకొనైనా సరే.. కేంద్రంలో రాజకీయ లబ్ధి పొంది రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవడం కోసం కోట్ల మంది ప్రజలకు తీరని అన్యాయం చేయడానికి పూనుకొంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే మహారాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత.. కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లు నిండితే తప్ప కింద ఉన్న మన రాష్ట్రానికి నీళ్లు వదలని పరిస్థితి. ఇప్పుడు మధ్యలో ఒక రాష్ట్రం వచ్చి.. కృష్ణా నీళ్లను అడ్డుకుంటే.. శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీళ్లు ఎక్కడ నుంచి వస్తాయి? పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టును చేస్తామంటోంది కేంద్ర ప్రభుత్వం.. మధ్యలో ఒక రాష్ట్రం వచ్చి గోదావరి నీళ్లను అడ్డుకుంటే పోలవరానికి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో చెప్పడం లేదు. గతంలో మద్రాసును తీసేసుకున్నారు.. ఇప్పుడు హైదరాబాద్‌ను కూడా దూరం చేస్తామంటోంది కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ ఇంతలా అభివృద్ధి చెందిందీ అంటే.. దాంట్లో సీమాంధ్రుల పాత్ర లేదా అని అడుగుతున్నాం. మన రాష్ట్రంలో చదువుకున్న ప్రతి విద్యార్థీ తన భవిష్యత్తు కోసం మొట్టమొదటిగా చూసేది హైదరాబాద్‌వైపు. ఇప్పుడు విద్యార్థులంతా ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్లాలి? పదేళ్లలో హైదరాబాద్‌లాంటి కొత్త రాజధానిని కట్టుకొని వెళ్లిపొమ్మంటే.. 60 ఏళ్లపాటు నిర్మించిన హైదరాబాద్‌ను పదేళ్లలో కట్టుకోవడం ఎలా సాధ్యమవుతుంది?
     
     చంద్రబాబు ఆత్మకు ఒక గౌరవం ఉందా?
     రాష్ట్రాన్ని మీకు నచ్చినట్లు చీల్చేసుకోండంటూ బ్లాంక్ చెక్కులా లేఖ రాసిచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు ఆత్మగౌరవ యాత్ర చేస్తున్నారు. అసలు చంద్రబాబుకు ఆత్మ అనేది ఉందా.. దానికంటూ ఒక గౌరవం ఏడ్చిందా? సొంత మామను వెన్నుపోటు పొడిచి అధికారం చేజిక్కించుకున్న వ్యక్తికి అసలు ఆత్మ అనేది ఉంటుందా! దివంగత ైవె ఎస్ కుమారుడు జగన్ రాజకీయ ఉగ్రవాది అని, ఆయనను ఉరితీయాలని చంద్రబాబు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, తొమ్మిదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలేనా ఇవి! బాబుకు సంస్కారం ఉండి మాట్లాడుతున్నారా.. లేకుండా మాట్లాడుతున్నారా..?
     
     మీకెలా ఉంటుంది?: చంద్రబాబు నాయుడుగారూ.. మీరు అందరిపైనా అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారు. మిమ్మల్ని ఒక్క మాట అడుగుతున్నా.. మీ కుమారుడు లోకేశ్ పనికిరాని వాడంటే మీకెలా ఉంటుంది? మీరు ఏం చేసినా లోక కల్యాణం కోసమే నిర్ణయాలు తీసుకున్నానని అంటున్నారు.. మీరు తీసుకున్న నిర్ణయాలు లోక కల్యాణం కోసం కాదు, లోకేశ్ కల్యాణం కోసమంటే మీకెలా ఉంటుంది. లోకేశ్‌కు అధికారం కట్టబెట్టేందుకే ఎన్టీఆర్ వారసులను రాజకీయాల్లో తొక్కి పెడుతున్నారని అంటే మీకెలా ఉంటుంది? అసలు రాష్ట్ర విభజనకు బ్లాంక్ చెక్ లాగా లేఖ రాసిచ్చిన మీరు ఏ మొహం పెట్టుకుని ప్రజల ముందుకు వస్తున్నారు? తెలంగాణకు అనుకూలంగా లేఖను ఇచ్చి ఇపుడెందుకు వస్తున్నారని ప్రజలు అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు? విభజనపై నిర్ణయం జరిగాక మీరుగాని, మీ ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నిస్తే ఏం చెబుతారు? ఆ లేఖను వెంటనే వెనక్కు తీసుకోమని అడిగితే ఏం జవాబు చెప్తారు?
     
     జైలులో ఉన్నా జననేతే..: విలువలతో కూడిన రాజకీయాలు చేసే ధైర్యంలేని టీడీపీ, కాంగ్రెస్ కుట్ర పన్ని జగన్‌ను జైల్లో పెట్టాయి. ఆయన జైల్లో ఉన్నా తనకు జరిగిన అన్యాయాన్ని పక్కనబెట్టి.. కోట్లాది మంది ప్రజల కోసం వారం రోజులపాటు నిరాహార దీక్ష చేశారు. జగనన్న జనంలో ఉన్నా, జైలులో ఉన్నా జననేతే. ఈ కాంగ్రెస్, టీడీపీ నేతలు బయట ఉన్నా.. దొంగలు, ద్రోహులే. త్వరలోనే జగనన్న బయటకు వస్తారు.. మనందరినీ రాజన్న రాజ్యంవైపు నడిపిస్తారు.’’
     
     షర్మిల యాత్రకు జేఏసీ నేతల సంఘీభావం
     హిందూపురం అర్బన్, న్యూస్‌లైన్: షర్మిల చేపట్టిన ‘సమైక్య శంఖారావం’ బస్సు యాత్రకు అనంతపురం జిల్లా హిందూపురం జేఏసీ నేతలు సంఘీభావం తెలిపారు. బుధవారం సాయంత్రం ఇక్కడికి బస్సు యాత్ర చేరుకోగానే హిందూపురం రెవెన్యూ, విశాలాంధ్ర పరిరక్షణ కమిటీ కన్వీనర్, జేఏసీ నాయకులు ప్రభాకర్ బాబు, ఆనంద్ రాజు, ఉదయ్ కుమార్, ట్రెజరీ జగదీష్, ఎంపీడీఓ ఆదినారాయణ, ఎన్జీవో చైర్మన్ సుబ్బారెడ్డి, ఇతర నాయకులు యాత్రకు మద్దతు తెలియజేశారు.
     
     ‘‘మన ఖర్మ ఏమిటంటే.. ఓట్ల కోసం సీట్ల కోసం, తెలంగాణ తామే ఇచ్చామన్న క్రెడిట్ కోసం.. కోట్ల మంది ప్రజలకు అన్యాయం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇంకోవైపేమో కోట్ల మంది ప్రజలకు అన్యాయం జరుగుతున్నా.. ఓట్లు పోతాయని, సీట్లు పోతాయని, క్రెడిట్ తనకు రాకుండా పోతుందని అస్సలు పట్టించుకోవట్లేదు చంద్రబాబు. కాంగ్రెస్, టీడీపీ కలిసి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాయి.. కోట్ల మంది ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయి.. తరతరాలు క్షమించలేని ఘోరపాపం చేస్తున్నాయి.’’
     
     ‘‘తెలంగాణకు టీడీపీ సహా ఐదు పార్టీలు అనుకూలంగా ఉంటే.. వైఎస్సార్ సీపీ, ఎంఐఎం, సీపీఎం ఎప్పుడూ విభజనకు అనుకూలంగా లేవు. చంద్రబాబుకు నిజంగా నిజాయితీ ఉంటే, నిజంగా మనిషైతే, నిజంగా ఈ గడ్డమీద పుట్టినవాడైతే.. వచ్చి ఈ మూడు పార్టీల పక్షాన నిలబడి నాలుగో పార్టీగా చేరాలి. ఈయన రాజీనామా చేసి.. తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామా చేయించాలి. లేఖను వెనక్కు తీసుకోవాలి.’’
     - షర్మిల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement