సోఫీ థామస్ కేసేమైంది? | She is a national-level player. | Sakshi
Sakshi News home page

సోఫీ థామస్ కేసేమైంది?

Published Wed, Feb 5 2014 2:39 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM

She is a national-level player.

అనంతపురం క్రైం, న్యూస్‌లైన్ : ఆమె జాతీయ స్థాయి క్రీడాకారిణి. రన్నింగ్, కబడ్డీలో గుర్తింపు పొందిన ఆణిముత్యం. క్రీడాప్రతిభతోనే ఉద్యోగాన్ని కూడా సాధించింది. అయితే.. మృగాళ్ల బారి నుంచి మాత్రం తప్పించుకోలేక పోయింది. వారి ఆకృత్యాలకు బలైపోయింది. ఈ ఘటన జరిగి పదేళ్లయినా.. ఇప్పటికీ ఆ కేసు మిస్టరీగానే మిగిలిపోయింది.
 
 అప్పటి పోలీసుల పుణ్యమా అని నిజాలు సమాధి అయినట్లు తెలుస్తోంది. కేరళ నుంచి నర్సింగ్ కోసం మన రాష్ట్రంలో అడుగుపెట్టిన సోఫీ థామస్ గుంతకల్లుకు చేరింది. స్పోర్ట్స్ కోటా కింద రైల్వేశాఖలో బంట్రోతు ఉద్యోగం సంపాదించింది. అవివాహిత కావడంతో ఉద్యోగినులకు కేటాయించిన డార్మెటరీ రైల్వే క్వార్టర్స్‌లో ఉండేది. ఆమెతో పాటు నలుగురు యువతులు ఆ క్వార్టర్సులోనే ఉండేవారు. ఉదయం లేచింది మొదలు పరుగు, వ్యాయామం, అనంతరం ఉద్యోగం... ఇదీ ఆమె దినచర్య. ఎవరితో పెద్దగా సత్సంబంధాలు కలిగి ఉండేది కాదు. ఓ రోజు ఉదయాన్నే మైదానంలో జాగింగ్‌కు వెళ్లిన సోఫీని గుంతకల్లు పట్టణానికి చెందిన అప్పటి అధికార పార్టీ నేత, ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ దివంగత నేత కుమారుడు టీజ్ చేశాడు.
 
 దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అదే ఆమె జీవితంలో మొదటిసారిగా గొడవ పడ్డ సందర్భమని స్నేహితురాళ్లతో చెప్పినట్లు తెలుస్తోంది. అంతకుమించి ఎవరితోనూ విభేదాలు లేవు. ఇదిలా ఉండగా.. ప్రతియేటా లాగానే 2002 డిసెంబర్ 31న రాత్రి డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. తనతో పాటు క్వార్టర్సులో ఉంటున్న ముగ్గురు స్నేహితురాళ్లలో ఇద్దరు విధులకు, మరొకరు సొంతూరికి వెళ్లడంతో నూతన సంవత్సర వేడుకలకు సోఫీ ఒంటరిగానే హాజరైంది. రాత్రి 11.30 సమయంలో తలనొప్పిగా ఉందంటూ సహచర ఉద్యోగులకు చెప్పి క్వార్టర్సుకు బయలుదేరింది.
 
 కాగా.. తెల్లవారుజామున విధులు ముగించుకుని క్వార్టర్సుకు వచ్చిన స్నేహితురాళ్లు తలుపులు తెరిచి చూడగా రక్తపుమడుగులో విగతజీవిగా కనిపించింది. దీంతో వారు వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. అప్పటి డీఎస్‌పీ మార్కండేయులు, సీఐ పాపారావు, ఎస్‌ఐ ఆంజనేయులు హత్యకు దారి తీసిన కారణాలపై దర్యాప్తు చేపట్టారు. సోఫీ మంచి దేహదారుఢ్యం, ధైర్యసాహసాలు కల్గిన క్రీడాకారిణి. దీంతో ఆమెను హత మార్చడానికి కనీసం ఐదుగురైనా వచ్చి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సోఫీపై దాడి చేసే సమయంలో ఆమె తీవ్రంగా ప్రతిఘటించిన ఆనవాళ్లు లభించాయి. హంతకుడు ధరించిన టీషర్ట్ చిరిగిపోయిన ముక్కతో పాటు ఆమె గోళ్లలో హంతకుడి చర్మం కనిపించింది. మెడకు టెలిఫోన్ కేబుల్‌తో ఉచ్చు బిగించి.. ఛాతీ, పొట్ట కింది భాగంలో బలంగా కొట్టి చంపారు. రంగంలోకి డాగ్‌స్క్వాడ్ , క్లూస్ టీమ్‌ను దింపిన పోలీసులు హంతకులను గుర్తించేందుకు ప్రయత్నించారు. డాగ్‌స్క్వాడ్ శాంతినగర్‌లోని సోఫీ ఉంటున్న క్వార్టర్సు నుంచి రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫారమ్‌లోని ఎస్-2 బోగీ వద్ద ఆగిపోయింది. దీంతో హంతకులు రెలైక్కి పరారై ఉండవచ్చని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
 
 ఎన్నెన్నో అనుమానాలు
  సోఫీ థామస్ హత్య విషయంలో ఎన్నెన్నో అనుమానాలున్నాయి. ఆమెను డిసెంబర్ 30వ తేదీనే దారుణంగా హత్య చేసినట్లు స్థానికంగా వదంతులు షికార్లు చేశాయి. అయితే.. అప్పట్లో అధికార పార్టీకి చెందిన నేత ఈ విషయాన్ని బయటకు పొక్కనివ్వకుండా పోలీసులు, రైల్వేశాఖ అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులు, వైద్యులు మాత్రం డిసెంబర్ 31 అర్ధరాత్రి తర్వాత సోఫీ హత్యకు గురైనట్లు నిర్ధారించారు. ఈ మేరకు కేసు (క్రైం నంబర్ 175/02, ఐపీసీ 302 సెక్షన్ ) నమోదైంది. అయితే.. సాక్ష్యాలేమీ లేవని కేసును పక్కనబెట్టారు.
 
 సీబీసీఐడీ కూడా దర్యాప్తు చేసినా పురోగతి కనిపించలేదు. హత్యోదంతం ఒకరోజు తర్వాత వెలుగుచూడటంతో అప్పటికే హంతకులు పోలీసులతో చేతులు కలిపి సాక్ష్యాలకు పాతరేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసును ఛే దించేందుకు అప్పటి ఎస్పీ అంజనాసిన్హా ప్రత్యేక టీమ్‌ని రంగంలోకి దింపినా కింది స్థాయి అధికారులు దర్యాప్తునకు సహకరించలేదని తెలిసింది. అనంతరం ఈ కేసులో అనుమానితులుగా అప్పటి అధికార పార్టీకి చెందిన నేత కుమారుడితో పాటు ఓ కేబుల్ ఆపరేటర్, సోఫీ థామస్ సహచర ఉద్యోగులను పోలీసులు విచారణ చేశారు. అంతకుమించి పురోగతి సాధించలేదు.  
 
 అట్టుడికిన రెండు రాష్ట్రాలు
 ఢిల్లీ వీధుల్లో నిర్భయ ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎలా ఉద్యమాలు జరిగాయో... నాడు గుంతకల్లులో సోఫీ దారుణ హత్య ఘటన కూడా ఆంధ్ర, కేరళ రాష్ట్రాల ప్రజలను కదిలించింది. ఈ కేసులో మృగాళ్లకు శిక్ష పడాలని ప్రస్తుత మంత్రి గీతారెడ్డి కూడా అప్పట్లో పెద్దఎత్తున ఉద్యమాలకు సహకరించారు. అప్పటి రాష్ట్ర గవర్నర్ సుర్జీత్‌సింగ్ బర్నాలను గీతారెడ్డి, రాష్ట్ర ఓబీసీ సెల్ కార్యదర్శి గాలి మల్లికార్జున, మహిళా సంఘాల నేతలు కలిసి సోఫీ హత్యకేసులో దోషులను శిక్షించాలని విన్నవించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement