ఆమెది ఆత్మహత్యే..! | she is commited to suside | Sakshi
Sakshi News home page

ఆమెది ఆత్మహత్యే..!

Published Sun, Mar 22 2015 2:15 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

ఆమెది ఆత్మహత్యే..! - Sakshi

ఆమెది ఆత్మహత్యే..!

యువతి సజీవ దహనం కేసులో వీడిన మిస్టరీ
మృతురాలు నందిగామకు చెందిన పూజితగా గుర్తింపు
సీఏ పాస్ కాలేక పోతున్నాననే మనోవేదనే కారణం
ఈ మేరకు సూసైడ్ నోట్ రాసిన మృతురాలు

 
 హైదరాబాద్: రాజధాని నడిబొడ్డున ఐపీఎస్, ఐఏఎస్ క్వార్టర్స్ వద్ద యువతి సజీవ దహనం కేసులో పంజగుట్ట పోలీసులు పురోగతి సాధించారు. మృతిచెందిన యువతి ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నందిగామకు చెందిన విద్యార్థి వాసిరెడ్డి పూజిత (19)గా తేలింది. ఆమె ధరించిన వాచీ, చెవిదిద్దులు, చెప్పుల ఆధారంగా హైదరాబాద్‌లోనే నివాసముంటున్న ఆ యువతి బాబాయ్ నరేష్ పూజిత మృతదేహాన్ని గుర్తించారు. నాలుగు సార్లు పరీక్షలు రాసినా సీఏ ఇంటర్‌లో తప్పిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన పూజిత హైదరాబాద్‌కు వచ్చి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. కృష్ణా జిల్లా నందిగామకు చెందిన శ్రీనివాస్, అన్నపూర్ణ దంపతులకు రోహిత, పూజిత (19) కుమార్తెలు. రోహిత చదువు పూర్తిచేసుకుని ఉద్యోగం చేస్తుండగా, పూజిత చార్టెడ్ అకౌంట్ (సీఏ ఇంటర్) చదువుతోంది. గతంలో పూజిత అమీర్‌పేటలో ఉంటూ సీఏ ఎంట్రన్స్ పరీక్షల కోసం కోచింగ్ తీసుకుంది. ఆ సమయంలోనే లక్డీకాపూల్‌లో బ్యాచిలర్‌గా ఉంటున్న బిహార్ రాష్ట్రానికి చెందిన అక్షయ్‌కుమార్‌తో పరిచయమైంది. ఇతను కూడా సీఏ చదువుతున్నాడు. ఇదిలావుండగా ప్రస్తుతం గుంటూరులో సీఏ ఇంటర్ చదువుతున్న పూజిత నాలుగు సార్లు పరీక్షలు రాసినా ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలోనే ఈ నెల 19న తెల్లవారుజామున ఇంట్లో సూసైడ్‌నోట్ రాసి పెట్టి అదేరోజు తన స్నేహితుడు అక్షయ్‌ను చివరిసారిగా చూసేందుకు హైదరాబాద్  వచ్చింది. ఇద్దరూ కలిసి సికింద్రాబాద్‌లో షాపింగ్ చేశారు. పూజిత ఒక టీషర్టును తన స్నేహితుడికి కొనిచ్చింది. తరువాత తాను ఇంటికి వెళ్తానని చెప్పడంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద రాత్రి 10 గంటలకు అక్షయ్ ఆమెకు వీడ్కోలు చెప్పి తన గదికి వచ్చి పడుకున్నాడు. మరుసటి రోజు రాత్రి తనకు కొనిచ్చిన టీషర్టును అక్షయ్ విప్పి చూడగా అందులో పూజిత సూసైడ్ నోట్ దారికింది. అర్ధరాత్రి తరువాత అక్షయ్ సూసైడ్‌నోట్‌ను తీసుకుని నాంపల్లి పోలీసు స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని వివరించాడు. అప్పటికే పూజిత కాలినగాయాలతో పంజగుట్ట పరిధిలోని మున్సిపల్ గార్డెన్‌లో శవమై తేలింది. రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్ నుంచి పూజిత తిరిగి పంజగుట్టకు చేరుకుంది. అదే రోజు అర్ధరాత్రి దాటిన తరువాత 1.20కి ఆమె గార్డెన్‌లో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతికి కాలిన గాయాలే కారణమని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. అయితే సికింద్రాబాద్ నుంచి పంజగుట్టకు ఎలా వచ్చింది, పెట్రోల్ ఎక్కడ ఖరీదు చేసింది అనే వివరాలు తేలాల్సి ఉంది. కాగా పూజిత మృతదేహాన్ని అప్పగించాల్సిందిగా మృతురాలి బంధువులు శని వారం అర్ధరాత్రి గాంధీ ఆస్పత్రి మార్చురీ వద్ద  ధర్నా చేశారు. ఇదిలా ఉండగా పూజిత మృతిపై ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న కథనాలపై మృతురాలి తల్లి అన్నపూర్ణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూసైడ్ నోట్ రాసి తన కూతురు ఆత్మహత్య చేసుకుందని.. వేరే కారణాలు ఏమీ లేవని ఆమె వాపోతున్నారు.
 పూజిత మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి

అయితే పూజిత మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని మృతురాలి తాత వాసిరెడ్డి రామలింగయ్య కోరారు. గాంధీ మార్చురీ వద్ద శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన మనుమరాలి మృతికి కారణమైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఎస్సెమ్మెస్ ద్వారా: సూసైడ్ నోట్ రాసిన పూజిత తన సెల్ ఫోన్ ఇంట్లోనే పెట్టి వెళ్లింది. ఫోన్‌ను పరిశీలించగా ఎస్సెమ్మెస్ ఆధారంగా విచారిస్తే తన బోయ్‌ఫ్రెండ్ అక్షయ్‌కుమార్‌కు ఆఖరు ఎస్సెమ్మెస్ చేసినట్లు తెలిసింది.

సూసైడ్ నోట్:‘‘మమ్మీ నాకు బతకాలని లేదు. సోదరి రోహితకు కూడా ఉద్యోగం వచ్చింది. కానీ నాకు ఎప్పటికీ రాదు. డిగ్రీ పరీక్షలకు సిధ్దం అయ్యే సమయంలో ఓ లెసన్‌లో చదివాను. నిరుద్యోగులు డిప్రెషన్‌లో ఆత్మహత్య చేసుకుంటారని. అది చదవగానే ఏడుపు వచ్చింది. నేను సూసైడ్ చేసుకుంటున్నాను. నాకోసం ఏడవద్దు, రోహితకు ఏడెకరాల పొలం కట్నంగా ఇచ్చి పెళ్లి చేయండి. ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుందామనుకున్నాను కాని దూరంగా వెళ్లి చనిపోదామని నిశ్చయించుకున్నాను. రూ.2000 తీసుకువెళ్తున్నాను, నేను పుట్టలేదు అనుకొండి. మీకు ఎప్పటికీ భారంకాను. ఈ రోజు రాత్రికల్లా చనిపోతాను. అక్కా ఆల్ ది బెస్ట్ కీప్ స్మైలింగ్’’అని రాసి ఉంది. ఇంట్లో రాసిన సూసైడ్‌నోట్‌ను పంజగుట్ట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టీషర్టులో లభించిన నోట్‌ను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement