కలెక్టరేట్,న్యూస్‌లైన్ : గొర్రెల పెంపకం కోసం రాత్రనక పగలనక చెట్లుపుట్టల్లో తిరుగుతూ కాపరులు ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. గొర్రెలకు బీమా సౌకర్యం ఉన్నప్పటికీ.. కాపరులకు బీమా లేకపోవడంతో వారి కుటుంబాలకు ఎలాంటి సాయమూ అందడం లేదు. ఈ విషయాన్ని దృష్టి పెట్టుకుని ప్రభత్వుం గొర్రెలకాపరులకు కూడా బీమా సౌకర్యం కల్పించింది. ఈ ఏడాది నుంచే గొర్రెల పెంపకందారులకు సామూహిక బీమా పథకాన్ని అమలు చేయనుంది.
18 నుంచి 59 ఏళ్లలోపు వయసున్న కాపరులు బీమాకు అర్హులు. సంవత్సరానికి రూ.350 ప్రీమియం కాగా, కాపరులు రూ.80 చెల్లించాల్సి ఉంటుంది. మిగతా రూ.250 కేంద్ర ఉన్ని అభివృద్ధి బోర్డు, కేంద్ర ప్రభుత్వం, ఇన్సూరెన్స్ కంపెనీలు భరిస్తాయి. గ్రామంలో కనీసం 25 మంది పెంపకందారులు ముందుకు వస్తేనే బీమా సౌకర్యం కల్పిస్తారు. ప్రీమియం చెల్లించిన కాపరులు సాధారణ మరణం పొందితే రూ.1.50 లక్షలు, ప్రమాదం వల్ల అంగవికలురుగా మారితే రూ.75 వేలు, పూర్తిగా వికలాంగులైతే రూ.1.50 లక్షల పరిహారం అందుతుంది. కాపరులకు 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే పిల్లలుంటే వారికి నెలకు రూ.100 ఉపకారవేతనం లభిస్తుంది.
గొర్రెల బీమా ప్రీమియం పెంపు..
యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా సామూహిక గొర్రెల బీమా పథకం జిల్లా అంతటా అమలులో ఉంది. 6శాతం ఉన్న ప్రీమియం ను 7శాతానికి పెంచారు. ప్రీమియం, సర్వీసు టాక్స్ కలిపి చిన్న గొర్రెలకు రూ.118 చెల్లించాలి. ఇందులో గొర్రెల పెంపకందారు రూ.48 చెల్లిస్తే పశుసంవర్ధక శాఖ రూ.70 భరిస్తుంది. పెద్ద గొర్రెలకు రూ.236 చెల్లిస్తే.. పశుసంవర్ధక శాఖ రూ.140 భరిస్తుంది.
గొర్రెల కాపరులకు బీమా
Published Sun, Nov 10 2013 2:48 AM | Last Updated on Sat, Sep 2 2017 12:28 AM
Advertisement