వినుకొండ, న్యూస్‌లైన్: జూనియర్ లైన్‌మెన్ (జేఎల్‌ఎం) పోస్టుల భర్తీతో జిల్లాలోని పలు విద్యుత్ ఉప కేంద్రాల్లో పని చేస్తున్న షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టులు భారీగా ఖాళీ అయ్యాయి. షిఫ్ట్ ఆపరేటర్లగా విధులు నిర్వహిస్తున్న వారికి 20 శాతం రిజర్వేషన్ ప్రకారం జేఎల్‌యం పోస్టులు దక్కడంతో జిల్లాలో సుమారు 100 వరకు షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు ఖాళీ అయ్యాయి. ఇదే అదనుగా భావించిన దళారులు రంగ ప్రవేశం చేసి నిరుద్యోగులకు గాలం వేస్తున్నారు.
షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామంటూ వినుకొండ ప్రాంతంలో పలువురు నిరుద్యోగుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. ప్రధానంగా వినుకొండ, మాచర్ల ప్రాంతాల్లో షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగం పేరుతో ఒక్కొక్కరి నుంచి సుమారు మూడు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. జూనియర్ లైన్‌మెన్ పోస్టుల భర్తీకి 2010లో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయగా కోర్టు ఆదేశాలతో నియామకాలకు బ్రేక్ పడింది. రెండు రోజుల క్రితం తిరిగి కోర్టు అదేశాలతో ఆ పోస్టులను భర్తీ చేశారు.
జిల్లాలో సుమారు 230 మందికి జేఎల్‌యం పోస్టులు దక్కగా వీరిలో సగం మంది షిష్ట్ ఆపరేటర్లు ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వీరంతా ఈనెల 18న విధుల్లో చేరారు. దీంతో వినుకొండ ప్రాంతంలోని నమాజ్‌కుంట విద్యుత్ ఉపకేంద్రంలో-1, చీకటీగలపాలెం సబ్ స్టేషన్‌లో-2, రేమిడిచర్ల-1. పమిడిపాడు-1, నూజెండ్ల-2, వెల్లటూరు-1 షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు ఖాళీ అయ్యాయి. షిఫ్ట్ ఆపరేటర్‌కు నెలకు రూ. 8150ల వేతనంతో పాటు ఈపీఎఫ్ కింద రూ. 799లు చెల్లిస్తారు.
ఈ ఉద్యోగాలను ట్రాన్స్‌కో సీఎండి మార్గదర్శకాల మేర భర్తీ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులకు తప్పని సరిగా ఐటిఐ సర్టిఫికెట్ ఉండాలి. స్తంభం ఎక్కగలగాలి. రిజర్వేషన్ ప్రకారం నియామకం ఉంటుంది. సబ్‌స్టేషన్‌లో వాచ్‌మెన్‌గా పనిచేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.
ఆరోపణలు వస్తున్నాయి... షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగం పేరుతో వినుకొండ ప్రాంతంలో దళారులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు. పోస్టులను నిబంధనల ప్రకారం భర్తీ చేయడం జరుగుతుంది. - ఏడీఈ విశ్వేశ్వరప్రసాదు, వినుకొండ.
పోస్టుకు రూ.3 లక్షలట !
Published Mon, Jan 20 2014 11:50 PM | Last Updated on Sat, Sep 2 2017 2:49 AM
Advertisement
Advertisement