కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే చెప్పినంత మాత్రాన విభజన ప్రక్రియ జరిగిపోదని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి వ్యాఖ్యానించారు.
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే చెప్పినంత మాత్రాన విభజన ప్రక్రియ జరిగిపోదని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి వ్యాఖ్యానించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రం విడిపోకుండా చేస్తామని, ఈ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ కూడా కళ్లు తెరవాల్సిందేనన్నారు. అసెంబ్లీ ఆవరణలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఈనెల 7న ఏపీఎన్జీవోలు ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న సమైక్యాంధ్ర సభకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. అవసరమైతే సభలో పాల్గొంటాం.
రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించడం మినహా మాకు మరేదీ సమ్మతం కాదు. షిండే మాటలు, బిండే మాటలు మా దగ్గర నడవవు. విభజనకు ఎన్నో ప్రక్రియలున్నాయి. కనీసం 4, 5 నెలల సమయం పడుతుంది. ఈలోపు హైకమాండ్ కళ్లు తెరవాలి. విభజనను కచ్చితంగా ఆపాల్సిందే’’ అని పేర్కొన్నారు. మంత్రి గల్లా అరుణ మాట్లాడుతూ అసెంబ్లీలో సమైక్య వాణిని విన్పించేందుకే తాము ఇంకా పదవుల్లో కొనసాగుతున్నామన్నారు. ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ అసెంబ్లీలో తీర్మానం రాకముందే విభజన ప్రక్రియ ఆగిపోతుందని భావిస్తున్నట్లు చెప్పారు.