షిర్డీకి ప్రత్యేక రైలు
Published Thu, Nov 28 2013 2:09 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
సాక్షి, గుంటూరు: షిర్డీ సాయిబాబా భక్తులకు శుభవార్త. డిసెంబరు 5వ తేదీ నుంచి గుంటూరు మీదుగా నాగర్‌సోల్ వరకు ప్రత్యేక వీక్లీ స్పెషల్ ట్రైన్ నడవనుంది. వారంలో రెండు రోజుల పాటు ఈ రైలు గుంటూరు, నల్లగొండ జిల్లా వాసులకు అందుబాటులో ఉంటుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు న్యూ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ షెడ్యూలును బుధవారం ప్రకటించారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా భక్తులు బాబా దర్శనం కోసం షిర్డీ వెళ్లేందుకు విజయవాడ, సికింద్రాబాద్ స్టేషన్లకు వెళ్లి అక్కడ నుంచి వెళ్లే మన్మాడ్ ఎక్స్‌ప్రెస్ ఎక్కుతున్నారు. దీని వల్ల ప్రయాణ సమయంతో పాటు అధిక మొత్తంలో చార్జీలు కూడా అవుతున్నాయి. నల్లగొండ జిల్లా భక్తులు కూడా విధిగా సికింద్రాబాద్ వెళ్లి రెలైక్కాల్సి వ స్తోంది.
దీనికితోడు గుంటూరు డివిజన్ ఏర్పడినప్పటి నుంచి ఎంపీలు రాయపాటి సాంబశివరావు, మోదుగుల వేణుగోపాలరెడ్డి షిర్డీకి రైలు నడపండని రైల్వే అధికారులను కోరుతున్నారు. ఎట్టకేలకు అధికారులు డిసెంబరు 5 నుంచి న్యూ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను గుంటూరు, పిడుగురాళ్ల, నల్లగొండ మీదుగా నడిపేందుకు నిర్ణయం తీసుకున్నారు. గుం టూరు డివిజన్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ సీ రామకృష్ణ షిర్డీ రైలు ప్రారంభాన్ని బుధవారం సాయంత్రం ధ్రువీకరించారు. డిసెం బరు 5 నుంచి ప్రతి గురు, ఆదివారాల్లో నర్సాపూర్ నుంచి నాగర్‌సోల్ వరకూ ట్రైన్ నెంబరు 17231 నడుస్తుంది. అదేవిధంగా నాగర్‌సోల్ నుంచి నర్సాపూర్‌కు శుక్ర, సోమవారాల్లో (17232) ఈ బండి నడుస్తుంది.
షిర్డీ రైలు షెడ్యూలు ఇలా... గురువారం ఉదయం 10.30 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరే 17231 ట్రైన్ అదేరోజు మధ్యాహ్నం 2.55 గంటలకు గుంటూరు స్టేషన్‌కు చేరుతుంది. ఐదు నిమిషాల విరామం తరువాత ఇక్కడి నుంచి బయల్దేరి 3.40 గంటలకు సత్తెనపల్లి, 4.15 గంటలకు పిడుగురాళ్ల, 4. 36 గంటలకు నడికుడి, సాయంత్రం 6 గంటలకు నల్లగొండ చేరుతుంది. రాత్రి 9.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకునే షిర్డీ ఎక్స్‌ప్రెస్ రాత్రి 10 గంటలకు అక్కడి నుంచి నాగర్‌సోల్ బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు నాగర్‌సోల్ చేరుతుంది.
శుక్ర, సోమవారాల్లో ఉదయం 11.15 గంటలకు నాగర్‌సోల్ నుంచి బయలుదేరే 17232 ఎక్స్‌ప్రెస్ ఔరంగాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, సికింద్రాబాద్‌ల మీదుగా రాత్రి 11.10 గంటలకు సికింద్రాబాద్, మరుసటి రోజు ఉదయం 4.25 గంటలకు గుంటూరు చేరుకుంటుంది. 2014 ఫిబ్రవరి 7వ తేదీ తరువాత నర్సాపూర్ నుంచి నాగర్‌సోల్ వెళ్లే రైలు శుక్ర, ఆదివారాల్లోనూ, నాగర్‌సోల్ నుంచి నర్సాపూర్ వైపు వెళ్లే రైలు అదేనెల 8 తరువాత శని, సోమవారాల్లోనూ నడుస్తాయని గుంటూరు సీనియర్ డీసీఎం రామకృష్ణ వివరించారు. 21 బోగీలతో నడిచే ఈ ఎక్స్‌ప్రెస్‌లో 10 కోచ్‌లు సెకండ్‌క్లాస్ స్లీపర్, టూ టైర్, త్రీ టైర్ ఏసీ కోచ్‌లు ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. త్వరలో అడ్వాన్సు రిజర్వేషన్ వివరాలను వెల్లడిస్తామని రైల్వే వర్గాలు తెలిపాయి.
Advertisement
Advertisement