
సాక్షి, అమరావతి : గోదావరి పుష్కరాల సమయంలో తొక్కిసలాటకు కారణాలు వివరిస్తూ సోమయాజులు కమిషన్ ఇచ్చిన నివేదికను శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి తప్పుపట్టారు. భక్తుల మూఢనమ్మకాలు, పంచాంగ కర్తలు, స్వామిజీలు, మీడియా వల్లే గోదావరి పుష్కరాల సమయంలో తొక్కిసలాట జరిగిందంటూ నివేదిక ఇవ్వడం దారుణమన్నారు. గోదావరి పుష్కరాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు.
ఆ వ్యవహారాన్ని దాచేందుకే..
పుష్కరాల కోసం రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారన్న శివస్వామి.. పుష్కరాల్లో బోయపాటి శ్రీను డాక్యుమెంటరీ వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అయినా పుష్కరాల సమయంలో వీఐపీ ఘాట్‌లో ఉండాల్సిన ముఖ్యమంత్రి సామాన్యులు స్నానం చేసే ఘాట్‌లో ఎందుకు ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఈ ఘటనను స్వామిజీలు, మీడియాపైకి నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలదే తప్పు అన్నట్లుగా కమిషన్ నివేదిక ఇవ్వడాన్ని స్వామిజీల తరపున ఖండిస్తున్నామన్నారు. కాగా 2015లో గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన తొక్కిసలాటకు అతి ప్రచారమే కారణమని జస్టిస్ సోమయాజులు కమిషన్ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment