
కన్నీటి వీడ్కోలు
అభిమానుల కన్నీటితో ఆళ్లగడ్డ తడిసి ముద్దయింది.. నిప్పుకణికలా మండే సూరీడు చిన్నబోయాడు... విషాద వదనాలు.. ఎవరిని కదిలించినా కన్నీరు ఉబికి వస్తోంది.. నలుదిక్కులా కనుచూపు మేర ఇసుక వేస్తే రాలనంతగా జనం.. కొందరు మహిళలు కన్నీరింకిపోయేలా పొగిలి పొగిలి ఏడ్చి.. అలసి సొలసినా తడబడుతూనే శోభమ్మకు కడసారి వీడ్కోలు పలికేందుకు అడుగులో అడుగువేశారు.. చిక్కటి చిరునవ్వుతో అచ్చ తెలుగు ఆడపడుచుకు ప్రతిరూపంగా.. అన్నా.. అక్కా.. తమ్ముడూ.. అవ్వా.. తాతా.. అంటూ అందరినీ ఆత్మీయంగా పలుకరించే శోభమ్మ ఇక లేరనే వాస్తవాన్ని జీర్ణించుకోలేక అనుచరులు, ఆమెతో ప్రత్యక్షంగా, పరోక్షంగా అనుబంధం ఉన్న ఆత్మీయులు విలవిల్లాడిపోయారు.. రెండు రోజులుగా గుండెలవిసేలా రోదిస్తున్న శోభమ్మ పిల్లలను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు.. జననేత జగన్‌మోహన్‌రెడ్డి విషాద వదనంతో దుఃఖాన్ని దిగమింగుకుని శోభమ్మ భౌతికకాయంపై పుష్ప గుచ్ఛం ఉంచి నివాళులర్పిస్తున్న దృశ్యాన్ని చూసిన జనం మూగగా రోదించారు.. విజయమ్మ, షర్మిల, భారతి.. శోభ నుదుటిపై ఆప్యాయంగా చెయ్యి వేసి, తల నిమిరిన దృశ్యం చూసి అక్కడున్న వారి గుండెబరువెక్కింది.. పురుషులు సైతం కంటతడి పెట్టారు. శోభమ్మ కుటుంబానికి అండగా ఉంటామంటూ ప్రతినబూనారు.
సాక్షి ప్రతినిధి, కర్నూలు: తమను ప్రేమగా పలుకరించే తల్లి దూరమైందని పల్లెలు తల్లడిల్లాయి. తమను ఆప్యాయంగా అక్కున చేర్చుకునే అక్క దూరమైందని తమ్ముళ్లు, చెల్లెమ్మలు.. అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. అమ్మా బాగున్నారా? అంటూ నోరారా పలకరించే తమ బిడ్డ లోకం వీడిపోయిందని ముదసలి తల్లులు బోరున విలపించారు. రాజకీయంగా ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఇంటిని నిర్లక్ష్యం చేయకుండా.. పిల్లల ఆలనా పాలన.. ప్రజా పాలనను సమాన దృష్టితో చూసిన ధైర్యశాలి.. స్నేహశీలి అయిన సతీమణి దూరం కావడంతో భూమా నాగిరెడ్డి గుండెలవిసేలా రోదించారు.
జనం గుండెల్లో స్థానం సంపాదించుకున్న అమ్మ తమకు దూరం కావటంతో కూతుళ్లు, కొడుకు దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఆళ్లగడ్డ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి అంతిమ యాత్రకు జనం పోటెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, షర్మిల, వైఎస్ భారతి, వైవీ సుబ్బారెడ్డి, సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆళ్లగడ్డకు చేరుకుని ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి పార్థివదేహం వద్ద నివాళులు అర్పించారు. తమ ప్రియతమ నేతను కడసారి చూసేందుకు ఉదయం నుంచే అభిమానులు బారులు దీరారు.
గంట గంటకు రద్దీ పెరగటంతో భూమా నివాసం కిటకిటలాడింది. ప్రజల సందర్శనార్థం నివాసం వద్ద ఉంచిన శోభా నాగిరెడ్డి పార్థివ దేహాన్ని చూసేందుకు జనం బారులు తీరారు. అభిమాన నేత పార్థివ దేహాన్ని చూసి చలించిపోయారు. నిన్నటి వరకు తమ మధ్యనే ఉన్న నేతను ఇలా చూడాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదంటూ జనం రోదించారు. వృద్ధులు, పిల్లలు, మహిళలు విగత జీవిగా మారిన శోభమ్మను చూడగానే దుఃఖాన్ని ఆపుకోలేక బోరున విలపించారు. శోకతప్త హృదయాలతో అభిమానులు తల్లడిల్లిపోయారు. విగతజీవి అయిన శోభమ్మను పట్టుకుని భూమా నాగిరెడ్డి కుటుంబ సభ్యులు మౌనంగా ఉండటం చూసి ప్రజలు మరింత కలత చెందారు.
అభిమానులతో కిక్కిరిసిన ఆళ్లగడ్డ
తమ అభిమాన నేత శోభా నాగిరెడ్డి అంతిమ యాత్ర కోసం రాష్ట్ర నలుమూలల నుంచి పెద్దఎత్తున తరలిరావటంతో ఆళ్లగడ్డ కిటకిటలాడింది. ఉదయం నుంచే ఆళ్లగడ్డకు తరలిరావటంతో 9 గంటలకే రోడ్లన్నీ నిండిపోయాయి. సందర్శకుల సందర్శనార్థం భూమా నివాసంలో ఉంచిన శోభా నాగిరెడ్డి పార్థివ దేహాన్ని చూసేందుకు జనం క్యూ లైన్లో బారులు తీరారు.
ముగ్గురు డీఎస్పీల బృందం అభిమానులను అదుపు చేసే ప్రయత్నం చేసినా అభిమానులు గోడలెక్కి దుమికి వెళ్లి తమ అభిమాన నేత భౌతికకాయాన్ని సందర్శించారు. పోలీసులు అదుపు చేయలేకపోవటంతో భూమా నాగిరెడ్డే స్వయంగా అభిమానులను ఆదుపు చేయాల్సి వచ్చింది. ప్రచార రథంపెకైక్కి అభివాదం చేస్తూ ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బొంగురుపోయిన స్వరంతో ఆయన వేడుకుంటుండటం చూసిన జనం కన్నీటిని ఆపుకోలేకపోయారు. ‘అన్నా.. అన్నా.. శోభమ్మ’ అంటూ పెద్ద ఎత్తున రోదించారు.
భారీ జనసందోహం మధ్య శోభమ్మ అంతిమ యాత్ర
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి అంతిమ యాత్ర భారీ జనసందోహం మధ్య సాగింది. సాయంత్రం 3.30 గంటల వరకూ అభిమానుల సందర్శనార్థం ఉంచిన శోభమ్మ పార్థివ దేహానికి చివరిసారి ‘ముత్తైవు ప్రక్రియ’ను పూర్తి చేసేందుకు ఇంట్లోకి తీసుకెళ్లారు. బంధువులు కార్యక్రమాలను పూర్తిచేసి అంతిమ యాత్ర కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలోకి తీసుకొచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, షర్మిల, వైఎస్ భారతి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి 4.16 గంటలకు నివాళులర్పించారు. అనంతరం అంతిమ యాత్ర మొదలైంది. భూమా నివాసం నుంచి టీబీరోడ్డు, గాంధీసెంటర్, పాతబస్టాండ్, కందుకూరు రోడ్డులోని భూమా పొలాల వరకు సుమారు రెండు కిలోమీటర్లు మేర అంతిమయాత్ర సాగింది. అంతిమయాత్ర సందర్భంగా ఆళ్లగడ్డలోని దుకాణాలన్నీ స్వచ్ఛందంగా మూసివేసి నివాళి అర్పించారు. నివాసాలకు తాళాలు వేసి ఆళ్లగడ్డ ప్రజలు మొత్తం అంత్యక్రియల్లో పాల్గొన్నారు. దుకాణాలు, మిద్దెలపై ఎక్కి శోభమ్మను కడసారి చూశారు. ముఖం నిండా పసుపు పూసి.. పట్టచీరతో అలంకరించిన శోభమ్మను చూసి మహిళలు కన్నీరుమున్నీరయ్యారు. కుమారుడు జగద్విఖ్యాత్‌రెడ్డి చేతిలో నిప్పుకుండతో వాహనంపైకి ఎక్కటంతో చిన్నా, పెద్దా తేడా లే కుండా అందరూ కన్నీరు పెట్టుకోవటం కనిపించింది. బంధువుల సమక్షంలో శుక్రవారం సాయంత్రం 6.20 గంటల సమయంలో శోభా నాగిరెడ్డి కుమారుడు జగద్విఖ్యాత్ చితికి నిప్పుపెట్టారు.
అంతకు ముందు తల్లి భౌతికకాయం చుట్టూ ప్రదక్షిణ చేసే సమయంలో భూమా నాగిరెడ్డి రెండు చేతులు జోడించి శోభమ్మకు నమస్కరిస్తుండిపోయారు. నిప్పు పెట్టిన వెంటనే కళ్లెదుట కాలిపోతున్న శోభమ్మను చూసి భూమా నాగిరెడ్డి, కుమార్తెలు అఖిలప్రియ, నాగమౌనిక, జగత్‌విఖ్యాత్ కన్నీటి పర్యంతమయ్యారు. కుమార్తె ‘నాన్నా.. అమ్మ’ అంటూ చేయిచూపుతూ తండ్రిని గట్టిగా పట్టుకుని బోరుమని విలపించటం అక్కడున్న వారిని కలచివేసింది. అంతిమ యాత్రలో శోభా నాగిరెడ్డి తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డి, సోదరులు ఎస్వీ ప్రసాద్‌రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, అక్క నాగలక్ష్మమ్మ, నాగరత్మమ్మ, పినతండ్రి ఎస్వీ నాగిరెడ్డి, ఆయన కుమారులు జగన్‌మోహన్‌రెడ్డి, లక్ష్మీరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, భూమా నాగిరెడ్డి సన్నిహితులు ఏవీ సుబ్బారెడ్డి, బీవీ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.