14.5 లక్షల మంది రైతన్నలకు శరాఘాతం
(వనం దుర్గాప్రసాద్) సాక్షి, హైదరాబాద్ : వ్యవసాయానికి ఇచ్చే ఉచిత విద్యుత్‌కు కత్తెర వేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. రైతన్నకు 9 గంటల నిరంతర విద్యుత్‌ను సరఫరా చేస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ప్రస్తుతం సరఫరా అవుతున్న ఏడు గంటల విద్యుత్‌కు కూడా కోత విధించే దిశగా టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వ్యవసాయానికి ఏటా 11,700 మిలియన్ యూనిట్లు వినియోగం అవుతుండగా.. ఇందులో 3,293 మిలియన్ యూనిట్ల మేరకు కోత పెడతామని కేంద్ర ఇంధనశాఖకు భరోసా ఇచ్చింది.
తద్వారా ఉచిత విద్యుత్ పథకాన్ని క్రమేణా ఎత్తివేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది రాష్ట్రంలోని 14.5 లక్షల మంది రైతన్నలకు శరాఘాతంలా తగలనుంది. విద్యుత్ పంపిణీ సంస్థలకు రుణ విముక్తి కల్పించేందుకు కేంద్రం ప్రకటించిన ఉజ్వల డిస్కమ్ అస్యూరెన్స్ యోజన (ఉదయ్) పథకంలో చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఇంధన శాఖకు ఇటీవల లేఖ రాసింది. ఈ పథకంలో చేరిన రాష్ట్రాలు డిస్కమ్‌ల అప్పులను 75 శాతం మేర భరించాల్సి ఉంటుంది. అప్పులిచ్చిన బ్యాంకులకు బాండ్లు జారీ చేయాలి. దీనివల్ల రాష్ట్రాలు కొత్తగా అప్పులు తీసుకోవచ్చు. ఉదయ్‌లో చేరినందుకు ఆర్థిక జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) నిబంధనల నుంచి కూడా రాష్ట్రానికి కేంద్రం సడలింపు ఇస్తుంది. ఇవన్నీ ఇలా ఉంచితే విద్యుత్‌ను కొన్న ఖరీదుకే వినియోగదారులకు విక్రయించాలనేది ఉదయ్ పథకంలో ప్రధాన నిబంధన. దీనికి రాష్ట్రం ఆమోదం తెలిపింది.
సమతూకం పాటించాలన్న కేంద్రం
రాష్ట్రంలోని పంపిణీ సంస్థలు ప్రస్తుతం యూనిట్ విద్యుత్‌ను సగటున రూ.4.50కు కొని సరఫరా చేస్తున్నాయి. వినియోగదారుల నుంచి సగటున యూనిట్‌కు రూ.4.10 వసూలు చేస్తున్నాయి. అంటే యూనిట్‌కు 40 పైసల మేర నష్టం వస్తోంది. నిజానికి జెన్‌కో ప్రాజెక్టులను పూర్తిస్థాయిలో నడిపిస్తే డిస్కమ్‌లకు నష్టం రాదు. థర్మల్ విద్యుత్ యూనిట్ రూ.3 చొప్పున, జలవిద్యుత్ రూ.2 లోపే లభిస్తుంది. మరోవైపు కేంద్ర సంస్థల నుంచి వచ్చే విద్యుత్ ఖరీదు కూడా రూ.4లోపే ఉంటోంది. జెన్‌కో రాష్ట్ర థర్మల్ ప్రాజెక్టులను పూర్తిస్థాయిలో పనిచేయించడం లేదు. ప్రైవేటు ప్లాంట్లకు లబ్ధి చేకూర్చేందుకే ప్రభుత్వం ఈ విధంగా చేస్తోందనే ఆరోపణలున్నాయి.
ఈ నేపథ్యంలో స్వల్ప, దీర్ఘకాలిక ఒప్పందాల ద్వారా యూనిట్ విద్యుత్‌ను రూ. 5 నుంచి రూ.7 వరకు వెచ్చించి ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. దీనివల్లే విద్యుత్ సగటు చార్జీ పెరుగుతోంది.ఆ మేరకు చార్జీలు వసూలు చేసుకునేందుకు విద్యుత్ నియంత్రణ మండలి అనుమతించడం లేదు. ఫలితంగా డిస్కమ్‌లు రూ. 14 వేల కోట్లకుపైగా నష్టాల్లో ఉన్నాయి. వీటిని తగ్గించుకునేందుకు విద్యుత్ కొనుగోలు, పంపిణీ మధ్య సమతూకం పాటించాలని కేంద్రం సూచించింది.
వ్యవసాయ విద్యుత్‌ను తగ్గిస్తామన్న రాష్ట్రం
కేంద్రం సూచన మేరకు సమతూకం పాటిస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇందులో భాగంగా వ్యవసాయ విద్యుత్‌ను ఏటా 3,293 మిలియన్ యూనిట్ల మేర తగ్గిస్తామని తెలిపింది. రాష్ట్రంలో 14.5 లక్షల వ్యవసాయ పంపుసెట్లున్నాయి. వీటికి ఏటా 11,700 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగమవుతోంది. ఇందుకుగాను దాదాపు రూ. 5 వేల కోట్లకుపైగా ఖర్చవుతోంది. అయితే ప్రభుత్వం ఏటా కేవలం రూ. 3,188 కోట్లు మాత్రమే సబ్సిడీ రూపంలో అందిస్తోంది. ఇందులో గృహ వినియోగదారులకు ఇచ్చే సబ్సిడీ మొత్తం కూడా కలసి ఉంది. సమతూకం పాటిస్తామని కేంద్రానికి హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. వ్యవసాయ విద్యుత్‌ను ఏటా 3,293 మిలియన్ యూనిట్ల మేర తగ్గిస్తామంటూ తన విధానం తెలిపింది.
అయితే ఇప్పటికీ ఫీడర్ల విభజన పూర్తికాలేదు. గడచిన ఏడాదిలో 30 వేల కొత్త కనెక్షన్లు మంజూరు చేశారు. దీనికి అదనంగా విద్యుత్ ఖర్చవుతుంది. ఇవన్నీ ఇలావుంటే వ్యవసాయ విద్యుత్‌ను ఆదా చేస్తామని కేంద్రానికి రాష్ట్రం చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటనే సందేహాలు కలుగుతున్నాయి. దశల వారీగా ఉచిత విద్యుత్‌ను ఎత్తివేయడమే ప్రభుత్వ ఉద్దేశమని విద్యుత్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కొనుగోలు తగ్గించాల్సిందే : ఉదయ్ పథకం నిబంధనల ప్రకారం కొనుగోలు విద్యుత్‌ను తగ్గించుకోవాల్సి ఉంటుందని, జెన్‌కో ఉత్పత్తిని పెంచుకోవాలని ఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్‌వై దొర చెప్పారు. నాణ్యమైన వ్యవసాయ పంపుసెట్లను బిగించడం ద్వారా వ్యవసాయ విద్యుత్ తగ్గించాలన్నదే తమ లక్ష్యమన్నారు.
ఉచితానికి షాక్!
Published Tue, Dec 15 2015 2:36 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement