నల్లగొండ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో గాయపడిన ఎస్సై సిద్ధయ్యది మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల.
జడ్చర్ల: నల్లగొండ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో గాయపడిన ఎస్సై సిద్ధయ్యది మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల. శనివారం కాల్పుల్లో ఆయన తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిన జడ్చర్ల వాసులు ఉలిక్కిపడ్డారు. ఆయన తల్లి దస్తగిరమ్మ, సోదరుడు దస్తగిర్ హతాశులయ్యారు. దస్తగిర్ వెంటనే హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సోదరుడిని చూసేందుకు బయలుదేరివెళ్లాడు.
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి మండలం చింతలచెరువు గ్రామానికి చెందిన సిద్ధయ్య కుటుంబం 20ఏళ్ల క్రితం జడ్చర్లలో స్థిరపడింది. నలుగురి సంతానంలో సిద్ధయ్య చివరివాడు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. పేదకుటుంబానికి చెందిన సిద్ధయ్య కష్టపడి ఉన్నత చదువులు చదివాడు. 2012-13లో ఎస్‌ఐగా ఎంపికయ్యాడు. ఆయనకు గతేడాది అనంతపురం జిల్లాకు చెందిన ధరణీషాతో వివాహమైంది. జడ్చర్లలో చదువుకుంటున్న సమయంలోనే చిన్నా చితకా పనులు చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేవాడని కుటుంబసభ్యులు తెలిపారు.