ఆ గడ్డపై ఎన్నో సమరాలు.. తెగిపడిన తలలు | Siddavatam fort In Kadapa | Sakshi
Sakshi News home page

ఆ గడ్డపై ఎన్నో సమరాలు.. తెగిపడిన తలలు

Published Thu, Sep 26 2019 10:54 AM | Last Updated on Thu, Sep 26 2019 10:54 AM

సిద్దవటం కోట వ్యూ  - Sakshi

ఆ గడ్డపై ఎన్నో సమరాలు.. పెల్లుబుకిన ఆవేశాలు.. పౌరుషాలు...మార్మోగిన రణతూర్యాలు.. ప్రతిధ్వనించిన యుద్ధభేరీలు..ఎగిసిన ఖడ్గాలు...తెగిపడిన తలలు..విజయ నాదాలు...వీర సైనికుల రక్తపుటేర్లు, రాచరికపు జిత్తులు... రణతంత్రపుటెత్తులతో గొప్పగా విలసిల్లిన క్షేత్రం సిద్దవటం కోట. 18 రాజవంశాలు.. హిందూ, ముస్లిం పాలకుల కాలంలో చవిచూసిన వైభవానికి నిదర్శనంగా ఆ కోట నేటికీ పర్యాటకులను అలరిస్తోంది. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఈ సంవత్సరం ఇక్కడ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సిద్దవటం కోట గురించి ప్రత్యేక కథనం 

సాక్షి, కడప : ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలానికి సిద్దవటం దక్షిణ ద్వారంగా పేరుగాంచింది. తూర్పు వాహినిగా ఉన్న పెన్నానదికి ఉత్తరాన చుట్టూ దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణంలోఉంది సిద్దవటం. బ్రిటీషర్ల హయాంలో సిద్దవటం జిల్లా కేంద్రంగా గొప్ప వైభవాన్ని చూసింది. పెన్నాలో ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు ఉద్యోగుల రాకపోకలకు తరుచూ అంతరాయం కలుగుతోంది. దీంతో జిల్లా కేంద్రాన్ని కడపకు మార్చారని తెలుస్తోంది. ఒకప్పుడు ఆ ప్రాంతంలో వట (మర్రి) వృక్షాలు ఎక్కువగా ఉండేవని పెన్నాలో స్నానం చేసిన సిద్దులు ఆ చెట్ల కింద తపస్సు చేసుకునే వారని, అందుకే ఆ ఊరికి సిద్దవటం పేరు వచ్చిందని జనంలో ప్రచారంలో ఉంది.

18 రాజవంశాలు
సిద్దవటాన్ని దాదాపు 18 రాజవంశాలు పాలించాయి. వీటిలో మట్లిరాజులు ముఖ్యపాత్ర పోషించారు. 12వ శతాబ్దం నుంచి వారి పాలన ఈ ప్రాంతంలో సాగిందని చరిత్రకారుల సమాచారం. తొలుత కాకతీయులు, తర్వాత విజయనగర మహారాజులకు మట్లిరాజులు సామంతులుగా ఉండేవారని కూడా తెలుస్తోంది. సిద్దవటం జిల్లాలోని అన్ని కోటల కంటే ప్రాచీనమైనదని చరిత్రకారులు పేర్కొంటున్నారు. 11వ శతాబ్దానికి ముందే ఈ కోట నిర్మితమైందని, నాటి నందన చక్రవర్తి ఇక్కడ మట్టి కోటను నిర్మించాడని తెలుస్తోంది.

తర్వాత తెలుగు చోళులు మట్టి కోటను ఇంకా పటిష్టం చేశారని, 14వ శతాబ్దంలో వచ్చిన మట్లిరాజులు (మట్లి అనంతరాజు) కోటను బలిష్టమైన రాతి కోటగా పునర్నిర్మించారని శాసనాధారాలతోపాటు కడప కైఫీయత్తుల ద్వారా తెలుస్తోంది. 1648లో మట్టిదేవ చోళ వెంకటరాజు నుంచి ఈ రాజ్యం ముస్లిం పాలకుడు మీర్‌జుమ్లా ఆధీనంలోకి వచ్చిందని, 1717లో ఆర్కాట్‌ నవాబుల వశమైందని, ఆర్కాట్‌ పాలకుడు పత్తేసింగ్‌ నుంచి కడప నవాబు నబీఖాన్, అతని నుంచి నిజాం నవాబు, 1800వ సంవత్సరం అక్టోబరు 12న నైజాం నవాబు నుంచి దీన్ని బ్రిటీషర్లు స్వాధీనం చేసుకున్నారని పరిశోధకులు పేర్కొంటున్నారు.

పాలనా క్రమం
సిద్దవటం ప్రాంతాన్ని కలకడ వైదుంభులు కూడా పాలించినట్లు చారిత్రక సమాచారం. 1595 ప్రాంతంలో కొండ్రాజు తిరుపతిరాజు, వెంకటపతిరాజులకు రాజంపేట ఊటుకూరు వద్ద జరిగిన యుద్ధంలో మట్లిరాజులకు సిద్దవటం అమర నాయకంగా వచ్చింది. మట్లి వారి తర్వాత ఆర్కాట్‌ నవాబుల కాలంలో సిద్దవటం కోటను మైసూరు పాలకుడు హైదర్‌అలీ కుమారుడు టిప్పు సుల్తాన్‌ పాలించాడు. మట్లి రాజులు ఈ ప్రాంతంలోని పలు గ్రామాలను అభివృద్ధి చేసి సస్యశ్యామలంగా మార్చినట్లు సమాచారం. జిల్లాలోని కోటల్లో సగానికి పైగా మట్లిరాజులు నిర్మించినవే. వీరి  ఏలుబడిలోని ప్రాంతాలను రాజువారి సీమగా పిలిచేవారు. వారి కాలంలోని అనంతరాజు బద్వేలు, యల్లమరాజు చిట్వేలి చెరువులను నిర్మించినట్లు తెలుస్తోంది.

విశిష్ట స్థానం..
జిల్లాలోని కోటల్లో సిద్దవటానికి విశిష్ట స్థానం ఉంది. కోటకు దక్షిణం వైపున పెన్నానది సహజమైన, విశాలమైన కందకంగా ఉండగా, మిగతా మూడు వైపుల బలమైన రాతి గోడలు, బురుజులు ఉన్నాయి. 35 ఎకరాల విస్తీర్ణంలో ఈ కోట నిర్మితమై ఉంది. కోట ముఖ ద్వారంలోనూ, లోపల సభా మండపం తదితర చోట్ల కనువిందు చేసే శిల్ప సోయగాన్ని తిలకించవచ్చు. కోటలో ప్రాచీన సిద్దేశ్వరస్వామి ఆలయం నేడు శిథిలమై ఉంది. గ్రామం మొదట్లో పెన్నా ఒడ్డున శ్రీ రంగనాయకస్వామి పురాతన ఆలయం ఉంది. కోటలో పలుచోట్ల శివాలయాలు బయల్పడుతున్నాయి.

ఒకప్పుడు కోటలో పలు శివాలయాలు ఉండినట్లు దీని ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కోట కేంద్ర పురావస్తుశాఖ ఆధీనంలో ఉంది. వారి ఆధ్వర్యంలో కోటలో ఆకర్షణ కోసం పచ్చిక బయళ్లు పెంచారు. కోట నిత్యం పర్యాటకులతో కళకళలాడుతూ ఉంటుంది. పరిశోధకులు కోటలోని తెలుగు, కన్నడ, సంస్కృత శాసనాలను అధ్యయనం చేసేందుకు వస్తుంటారు. ఈ కోట హిందూ, ముస్లింల సమ్మిళత శైలికి నిదర్శనంగా కనిపిస్తుంది. కోటలో మసీదు కూడా ఉంది. 1802 ప్రాంతంలో ఈ కోటను సందర్శించిన బ్రిటీషు చిత్రకారుడు థామస్‌ ఫ్రీజర్‌ ఈ కోట గురించి రెండు అద్బుతమైన వర్ణ చిత్రాలు గీశారు. అవి నేటికీ లండన్‌ ప్రధాన మ్యూజియంలో ఉన్నాయి.

కళాపోషణ..
మట్లిరాజులు యుద్ద పిపాసులేగాక కళలకు కూడా పెద్దపీట వేశారు. మట్లి యల్లమరాజు కుమారుడు ఆనందరాజు ఆస్థానంలో నాటి ప్రముఖ కవి ఉప్పుగుండూరు వెంకట కవి ఉండేవారు. ఒంటిమిట్ట దశరథరామ చరిత్ర రాసింది ఆయనే. అనంతరాజు కూడా రాయలవారిలాగా మంచి కవి. ఆయన స్వయంగా కకుత్స విజయం కావ్యం రాశారు. కవి చౌడప్ప కూడా అనంతరాజు అస్థానంలోని వారే. రాయల కొలువులో లాగానే మట్లి అనంతరాజు కొలువులో కూడా అష్టదిగ్గజ కవులు ఉండేవారు. ఆయన రాజ్యపాలనలో రాయలంతటి పేరు గడించారు. ఒంటిమిట్ట ఆలయాన్ని పటిష్టం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement