మోదీది సంక్షేమ పాలన
ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జి సిద్ధార్థనాథ్ సింగ్
అనకాపల్లి: మూడేళ్ల పాలనలో ప్రధాని మోదీ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జ్ సిద్దార్థనాథ్ సింగ్ అన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న మోదీఫెస్ట్‌లో భాగంగా విశాఖ జిల్లా అనకాపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం ఆయన ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక రోటరీక్లబ్ హాల్లో విలేకర్లతో మాట్లాడుతూ మోదీ మూడేళ్లలో 60 సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు.
2014లో మోదీ బాధ్యతలు స్వీకరించే నాటికి జీడీపీ 4.8 ఉండేదని, ఇప్పుడు 7కు చేరుకుందంటే నిరుద్యోగ సమస్య తగ్గినట్టేనని పేర్కొన్నారు. 3.5 లక్షల మంది నిరుద్యోగులకు ముద్రా యోజన ద్వారా రుణాలు మంజూరు చేశారని చెప్పారు. లాల్‌బహుదూర్‌శాస్త్రికి తాను మనుమడినని, ఆయన పాలనకు మోదీ పాలనకు సారూప్యత ఉందని సిద్ధార్థనాథ్‌సింగ్ అన్నారు.