'వెంకయ్యకు పవన్ సర్టిఫికెట్ అక్కర్లేదు'
సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై ఏపీ బీజేపీ ఇంఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీలో బహిరంగసభలు నిర్వహించిన సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆదివారం న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. పవన్ అహంకారంతో మాట్లాడుతున్నారని, ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు పవన్ సర్టిఫికెట్ అవసరం లేదని పేర్కొన్నారు.
ఏపీ అభివృద్ధి కోసం వెంకయ్యనాయుడు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, పవన్ ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. నార్త్, సౌత్ అని ప్రసంగిస్తున్న పవన్ భారత్ను విడగొట్టాలనుకుంటున్నారా అని ఈ సందర్భంగా సిద్ధార్థనాథ్ సింగ్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రకటించిన ప్రత్యేక సాయంలో ఏముందో అర్థం చేసుకోవాలన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పవన్ బహిరంగసభలో పాల్గొని ఏపీకి జరుగుతున్న అన్యాయంపై కేంద్రాన్ని మరోసారి ప్రశ్నించిన విషయం తెలిసిందే. రాష్ట్ర టీడీపీ, బీజేపీ నేతల వల్ల కాకపోతే ఏపీకి ప్రత్యేక హోదా కోసం స్వయంగా తాను రంగంలోకి దిగాల్సి ఉంటుందని ఆ సభలో పవన్ హెచ్చరించారు.