సిద్ధార్థ కళాశాల వద్ద తెలుగు తమ్ముళ్ల హడావుడి
- ఓటమి భయంతో అర్థరాత్రి స్ట్రాంగ్ రూమ్ పరిశీలన
- కళాశాల వద్ద ఓ మీడియా సిబ్బంది కాపలా
- ఈవీఎంలపై ఎల్లో ప్రచారం
సాక్షి,విజయవాడ, పెనమలూరు, న్యూస్‌లైన్ : ఆడలేక మద్దెల దరువు అనే చందాన ఎన్నికల్లో గెలుపు పై నమ్మకంలేక తెలుగుతమ్ముళ్లు బుధవారం అర్థరాత్రి ఈవీఎంలు భద్రపర్చిన కానూరు సిద్ధార్థ కళాశాల వద్ద హడావుడి చేసి భంగపాటుకు గురయ్యారు. ఓ ప్రతిక (సాక్షికాదు)లో పని చేస్తున్న పాత్రికేయులను కళాశాల వద్ద తెల్లవార్లు వేచి ఉన్నారు. టీడీపీ నేతలు చేస్తున్న హడావుడిని చూసిన కేంద్ర ఎన్నికల పరిశీలకులతో పాటు,జిల్లా అధికారులు నివ్వెర పోయారు.
వివరాలిలా ఉన్నాయి ..కానూరు వీఆర్ సిద్ధార్థ,పీవీపీ సిద్ధార్థ ఇంజినీరింగ్‌కాలేజీల్లో జిల్లాకు చెందిన రెండు ఎంపీ,16 అసెంబ్లీ స్థానాలకు చెందిన ఈవీఎంలు పటిష్టమైన కేంద్ర బలగాలు సీఆర్‌పీఎఫ్ పహారాలో స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపర్చారు.అయితే బుధవారం అర్ధరాత్రి విజయవాడ టీడీపీ ఎంపీ ఎలక్షన్ ఏజెంట్ అంటూ వచ్చిన వ్యక్తి తాను స్ట్రాంగ్ రూమ్ చూడాలని హడావుడి చేశాడు. దీంతో బందోబస్తులో ఉన్న పోలీస్ అధికారులు ,ఇతర అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వచ్చారు.
వీడియో గ్రాఫర్ సమక్షంలో ఆయనను పరిశీలనకు అనుమతించారు.అయితే సదురు అభ్యర్థి ఏజెంట్ కాలేజీలో కౌంటింగ్‌కు ఏర్పాట్లకు పని చేస్తున్న సిబ్బందిని చూసి లేనిపోని అనుమానాలు వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగారు.ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయటానికి కుట్ర జరుగుతుందని తమ్ముళ్లు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు.తీరా అటువంటిది ఏమీ లేదని తెలుసుకుని చల్లగా జారుకున్నారు. తెల్లవారే వరకు ఒక దిన పత్రిక(సాక్షికాదు) విలేకర్లు కళాశాల వద్దనే కాపుకాసి వచ్చే పోయే వాహనాలను వీడియో తీయడం గమనార్హం.
ఓటమి భయం...
కాలేజీ వద్ద తెలుగుతమ్ముళ్లు, భయంతో ఉన్నారని తెలుస్తుంది. ఈ విషయం ఓ అధికారి మీడియా ముందు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. గురువారం జిల్లా కలెక్టర్ రఘునందనరావు కాలేజీలో ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్‌రూమ్‌లను పరిశీలించి వెళ్లారు.అన్ని సక్రమంగా ఉండటమే కాకుండా కట్టుదిట్టమైన భద్రత ఉండటం పై ఆయస సంతృప్తి వ్యక్తం చేశారు.
వ్యాన్‌లో వచ్చారంటూ హడావుడి....
కొంతమంది వ్యక్తులు బొలారో వ్యాన్‌లో సిద్ధార్ధ క ళాశాలలోకి ప్రవేశించారని, తాము వెళ్లే సరికి ఆ వాహనాన్ని వెనుక గేటు నుంచి బయటకు పంపేశారని హడావుడి చేశారు. ఈ వ్యాన్ నెంబర్లు ఎంట్రీగేటులోనూ నమోదు చేయకపోవడంతో తమకు అనుమానం వస్తోందని ఆరోపించారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ పట్టాభిరామ్ కలెక్టర్ రఘనందనరావు, జాయింట్ కలెక్టర్ మురళి , పోలీసు కమిషనర్ బి.శ్రీనివాసులను కలిసి విజ్ఞాపన పత్రాలు అందజేశారు.
సిద్ధార్థలో డబ్బులు దొరికితే స్పందించని నేతలు....
నగర నడిబొడ్డులో ‘సిద్ధార్ధ’అకాడమీలో సుమారు రూ.3.75 కోట్లు నగదును ఎన్నికలు అధికారులు పట్టుకున్నప్పటికీ తెలుగు తమ్ముళ్లు కాని, వీరికి వత్తాసు పలికే సదరు దినపత్రిక విలేకర్లు కాని ఏమాత్రం స్పందించలేదు. ఎన్నికలకు ఒకరోజు ముందు టీడీపీ ఎంపీ సుజనా చౌదరి కోట్ల రూపాయల నిధుల్ని అకాడమి భవనం నుంచే రెండు మూడు జిల్లాలకు పంపించారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. స్థానిక అధికారులు పట్టుకున్న సొమ్ము పై ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ అసంతృప్తి కూడా వ్యక్తం చేసిన విషయం విధితమే.