గంటా అండతో ఏపీఐఐసీ ఈడీగా సత్యసాయి శ్రీనివాస్
అడ్డుచక్రం వేసిన మంత్రి అయ్యన్న
వారమైనా అందని రిలీవింగ్ ఉత్తర్వులు
మరో రెండు పోస్టులకూ మంత్రుల మధ్య ఆధిపత్య పంతం
నలిగిపోతున్న అధికారులు
విశాఖపట్నం: మంత్రులకు చెలగాటం.. అధికారులకు ప్రాణసంకటం అన్నట్లుగా తయారైంది జిల్లాలో పాలనావ్యవస్థ. కీలకమైన స్థానాల్లో తమకు అనుకూల అధికారే ఉండాలని మంత్రులు గంటా మంత్రి.. అయ్యన్న ఎవరికి వారు పట్టుబడుతున్నారు. మొండికేస్తున్నారు. కీలక పోస్టుల్లో అధికారులను నియమించడం...అంతలోనే అబైయన్స్‌లో పెట్టడం... వారిని మాతృశాఖ నుంచి రిలీవ్ చేయకపోవడం... బదిలీ ఉత్తర్వులు రద్దు చేయడం... చివరికి ఆ పోస్టులు భర్తీకాకుండా ఉండిపోవడం సర్వసాధారణంగా మారిపోయింది. తాజాగా ఏపీఐఐసీ ఈడీ పోస్టు కూడా మంత్రుల ఆధిపత్య పోరులో చిక్కుకుంది. డీఆర్వో, డీఎస్‌వో (విశాఖ సిటీ) పోస్టుల పరిస్థితి కూడా అంతే.
శ్రీనివాస్‌కు అందలం
పంచాయతీరాజ్ శాఖకు చెందిన సత్యసాయి శ్రీనివాస్ దీర్ఘకాలంగా డెప్యుటేషన్ మీద డీఆర్‌డీయే పీడీగా ఉన్నారు. ప్రభుత్వం ఆయన్ను ఇటీవల ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్(ఈడీ)గా బదిలీ నియమించింది. ఇందుకు మంత్రి గంటా సహకారం ఉందని తెలుస్తోంది. ఏపీఐఐసీ ద్వారానే భారీస్థాయిలో భూకేటాయింపులు జరపాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీఐఐసీలో తన మనిషి ఉండాలని మంత్రి గంటా వ్యూహాత్మకంగానే సత్యసాయి శ్రీనివాస్‌కు ఈడీగా నియమించినట్లు సమాచారం. నిబంధనల ప్రకారం సత్యసాయి శ్రీనివాస్ డీఆర్‌డీయే నుంచి తన మాతృసంస్థ పంచాయతీరాజ్ శాఖకు వెనక్కి వెళ్లి... అక్కడి నుంచి ఏపీఐఐసీకి డెప్యుటేషన్ వేయించుకోవాలి. ఇంకేముందీ!...ఉత్తర్వులు వచ్చేశాయి కదా...ఏపీఐఐసీకి వెళ్లిపోదామని సత్యసాయి శ్రీనివాస్ భావించారు. కానీ కీలకమైన పీఠంపై గంటా అనుకూల అధికారి ఉండటం మంచిది కాదని అయ్యన్న పాత్రుడు భావించారు.
తన శాఖకు చెందిన సత్యసాయి శ్రీనివాస్ తనకు తెలియకుండా గంటా ద్వారా పోస్టింగు తెప్పించుకోవడం ఆయన్ని అసహనానికి ఆగ్రహానికి గురి చేసింది. దాంతో అయ్యన్న పంచాయతీరాజ్ శాఖ నుంచి శ్రీనివాస్‌ను రిలీవ్ చేయొద్దని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమాచారం. బదిలీ ఉత్తర్వులు వచ్చి వారం రోజులు దాటినప్పటికీ సత్యసాయి శ్రీనివాస్‌ను ఇంతవరకు పంచాయతీరాజ్ శాఖ రిలీవ్ చేయలేదు. అటు ఏపీఐఐసీ ఈడీగా వెళ్లలేక... ఇటు మంత్రి అయ్యన్న ఆగ్రహానికి గురై పంచాయతీరాజ్ శాఖలో కొనసాగలేక సత్యసాయి శ్రీనివాస్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది.
ఆధిపత్య పోరు
మంత్రులు గంటా, అయ్యన్నల ఆధిపత్య పోరు వల్ల జిల్లాలో మరికొన్ని కీలక పోస్టులు కూడా భర్తీ కావడం లేదు. జిల్లా రెవెన్యూ అధికారి( డీఆర్వో)గా తమ అనుకూల అధికారి కోసం ఇద్దరు మంత్రులు సిగపట్లు పడుతున్నారు. గతంలో విశాఖలో ఆర్డీవోగా పనిచేసిన వెంకటేశ్వరరావును డీఆర్వోగా నియమించేలా అయ్యన్న చక్రం తిప్పారు. ఇద్దరు మంత్రుల మధ్య వివాదంతో ఆ పోస్టింగును ప్రభుత్వం రద్దు చేసింది. కొన్ని రోజుల క్రితం మంత్రి గంటా చాపకిందనీరులా అనుకూల అధికారి చంద్రశేఖర్‌రెడ్డిని డీఆర్వోగా నియమించేలా చేయగలిగారు. ఈమేరకు ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. దీనిపై భగ్గుమన్న అయ్యన్న సీఎం వద్దే పంచాయితీ పెట్టారు. డీఆర్వోగా చంద్రశేఖరరెడ్డి నియమాకాన్ని కూడా ప్రభుత్వం అబయన్స్‌లో పెట్టింది. నగర పౌరసరఫరాల అధికారి పోస్టు కూడా ఇద్దరు మంత్రుల ఆధిపత్య పోరులో చిక్కుకుంది. తమ అనుకూల అధికారిని ఆ పోస్టులో నియమించుకునేందుకు ఇద్దరు మంత్రులు పంతానికి పోతున్నారు. దాంతో ఏడు నెలలుగా ఆ పోస్టు కూడా ఖాళీగానే ఉంది.
మంత్రుల సిగపట్లు..
Published Wed, Oct 14 2015 11:32 PM | Last Updated on Sun, Sep 3 2017 10:57 AM
Advertisement
Advertisement