నామినేటెడ్ పదవుల పంపకంలో ఇద్దరు మంత్రులు ఒక్కటయ్యారా..? నువ్వొకటి.. నేనెకటి పంచుకుందామని డిసైడయ్యారా..?
సాక్షి ప్రతినిధి, వరంగల్ : నామినేటెడ్ పదవుల పంపకంలో ఇద్దరు మంత్రులు ఒక్కటయ్యారా..? నువ్వొకటి.. నేనెకటి పంచుకుందామని డిసైడయ్యారా..? మనలో మనకెందుకు గొడవలని సర్దుకుపోయారా..? వారం రోజులుగా జరుగుతున్న ఈ ప్రచారం... నామినేటెడ్ పదవుల రేసులో ఉన్న అధికార పార్టీ నేతలను ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది.
ఏనుమాముల మార్కెట్ కమిటీ చైర్మన్‌గా మంద వినోద్‌ను నియమిస్తూ శనివారం సాయంత్రం ఉత్తర్వులు వెలువడ్డాయి. మూడేళ్లుగా పెండిం గ్‌లో ఉన్న ఈ పదవి నియామకంలో మంత్రి సారయ్య తన పంతం నెగ్గించుకున్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీధర్ సిఫారసులను ఖాతరు చేయకుండా ఢిల్లీ వరకు పైరవీ చేసి తన ప్రధాన అనుచరుడు వినోద్‌కు చైర్మన్ పదవిని కట్టబెట్టారు. ఈ క్రమంలో అడ్డు పడకుండా ఉండేందుకు విభేదాలను పక్కనబెట్టి.. మంత్రి పొన్నాలతో సారయ్య చేతులు కలిపినట్లు ప్రచారం జరుగుతోంది. నామినేటెడ్ పదవుల విషయంలో ఇద్దరూ రాజీ ధోరణి అవలంబించాలని ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.
అదే క్రమంలో మార్కెట్ కమిటీ నియామకం జరిగినట్లు స్పష్టమవుతోంది. ఉత్తర్వులు వెలువడిన కొద్దిసేపటికే మంద వినోద్ హైదరాబాద్‌లో ఉన్న మంత్రి పొన్నాలను కలిసి కృతజ్ఞతలు తెలిపి.. పొన్నాల నుంచి అభినందనలు అందుకోవడం గమనార్హం. దీంతో మంత్రులు ఇద్దరూ కలిసికట్టుగా నామినేటెడ్ పదవులు పంచుకున్నట్లు ప్రచారం జోరందుకుంది. దీంతో తదుపరి కీలకమైన నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న ముఖ్యులందరిలో ఉత్కంఠ మొదలైంది. జిల్లాలో కాంగ్రెస్ నేతలందరూ కొంతకాలంగా రెండు గ్రూపులుగా చీలిపోయారు. పొన్నాల, సారయ్య వర్గీయులుగా ముద్ర వేసుకున్నారు. వీరికి తోడు చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, కేంద్ర మంత్రి బలరాంనాయక్‌లకు సైతం ప్రత్యేక అనుచరగణం ఉంది.
మరోవైపు మాజీ మంత్రి రామసాయం సురేందర్‌రెడ్డి కుమారుడు రఘురాంరెడ్డి అనూహ్యంగా జిల్లా పార్టీలో చక్రం తిప్పే స్థాయికి ఎదిగారు. సీఎం కిరణ్‌తో సాన్నిహిత్యం ఉండటంతో పదవుల నియామకంలో ఆయన సైతం పవర్ సెంటర్‌గా మారారు. ఇవన్నీ గ్రూపులతో పాటు తెలంగాణ ఉద్యమ ఆందోళనలతో నామినేటెడ్ పదవుల పంపకం సంక్లిష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ఇద్దరు రాష్ట్ర మంత్రులు ఒక్కటవడంతో వరుసగా పెండింగ్‌లో ఉన్న పదవులకు క్లియరెన్స్ వస్తుందనే వాదనలున్నాయి. తాజాగా ఎనుమాముల మార్కెట్ కమిటీకి గ్రీన్ సిగ్నల్ రావడంతో అంతకుమించి ప్రాధాన్యమున్న కాకతీయ అర్బన్ డెవెలప్‌మెంట్ అథారిటీ(కుడా) చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ కాంగ్రెస్ ముఖ్యులలో నెలకొంది.
కీలకమైన ఈ పదవి రేసులో ప్రస్తుత జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, వరద రాజేశ్వరరావు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ఆ పార్టీలో విసృ్తతంగా చర్చ జరుగుతోంది. రాజేందర్‌రెడ్డికి ‘కుడా’ చైర్మన్ పదవి కట్టబెడితే గతంలో చివరి నిమిషంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిని కోల్పోయిన బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి అవకాశం కల్పిస్తారనే ప్రచారం ఉంది. రేసులో ఉన్న దుగ్యాలకు, లేదా వరద రాజేశ్వరరావుకు ఛాన్స్ దొరికితే రాజేందర్‌రెడ్డిని తిరిగి అదే గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిలో కొనసాగిస్తారని తెలుస్తోంది. ఈ ముగ్గురిలో ఇద్దరు మంత్రుల అనుగ్రహం పొందిన వారికే పదవి దక్కుతుందని తాజా పరిణామాలు రూఢీ చేస్తున్నాయి.