సినీఫక్కీలో యువకుడి వీరంగం
నాటు తుపాకీతో బెదిరింపు
పోలీస్‌ల అదుపులో నిందితుడు
విడవలూరు : ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఇరువర్గాలు మోహరించడంతో అందులో ఓ యువకుడు నాటు తుపాకీతో సినీఫక్కీలో వీరంగం సృష్టించాడు. ఉద్రిక్తతలకు దారి తీసిన , సంచలనం సృష్టించిన ఈ సంఘటన మండలంలోని చౌకచెర్లలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. నెల్లూరుకు చెందిన కొమ్మిరెడ్డి నరేంద్రరెడ్డికి చౌకచెర్లలో 19 ఎకరాల పట్టా భూమి ఉంది. దీన్ని గ్రామంలోని తన బంధువైన కొమ్మిరెడ్డి మురళీకృష్ణారెడ్డికి 2004లో కౌలు కింద అప్పగించారు. ఆ సమయంలో నరేంద్రరెడ్డి రూ.11 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. 12 ఏళ్ల కిత్రం తీసుకున్న అప్పు నేడు వడ్డీతో కలిపి దాదాపు రూ.50 లక్షల వరకు పెరిగి పోయింది.
ప్రస్తుతం ఉన్న అప్పులో రూ.30 లక్షలు అయినా చెల్లించాలని మురళీకృష్ణారెడ్డి పలు మార్లు నరేంద్రరెడ్డిని కోరాడు. దీనికి ఆయన సమాధానం చెప్పలేదు. ప్రస్తుతం నరేంద్రరెడ్డికి ఉన్న 19 ఎకరాల పొలం కోత దశకు చేరుకుంది. దాన్ని కోసేందుకు వారం రోజులుగా నరేంద్రరెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే మురళీకృష్ణారెడ్డి, స్థానికులతో కలిసి తన అప్పులో కొంతభాగమైన చెల్లించి వరి కోసుకోవచ్చునని అడ్డుపడుతున్నారు. దీంతో నరేంద్రరెడ్డి ఎలాగైనా పంట కోసుకుపోవాలని పూర్తి బందోబస్తుతో శుక్రవారం పొలం వద్దకు చేరుకున్నాడు. మూడు వరికోత యంత్రాలను, ఇందుకూరుపేట మండలం మైపాడు, కుడితిపాళెం, నెల్లూరుకు చెందిన దాదాపు 100 మంది యువకులను తీసుకువచ్చాడు.
వీరిలో నెల్లూరుకు చెందిన వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు కూడా ఉండటం గమన్హారం. విషయం తెలుసుకున్న మురళీకృష్ణారెడ్డి, గ్రామస్తులు దాదాపు 150 మంది సంఘటన స్థలం వద్దకు చేరుకుని వరి కోత యంత్రాలను అడ్డుకున్నారు. దీంతో నరేంద్రరెడ్డి తనతో వచ్చి యువకులను రెచ్చగొట్టి గ్రామస్తులపైకి ఉసిగొల్పాడు. ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. అదే సమయంలో నరేంద్రరెడ్డితో వచ్చిన యవకుల్లో నెల్లూరుకు చెందిన బాబు అనే వ్యక్తి తన వద్దనున్న నాటు తుపాకీ, కత్తిని బయటకు తీసి గ్రామస్తులను బెదిరించాడు.
కత్తితో దాడికి పాల్పడడంతో తప్పించుకునే ప్రయత్నంలో గ్రామానికి చెందిన స్టాలిన్ అనే వ్యక్తి చొక్కా చినిగిపోయింది. ఇక్కడి నుంచి వెళ్లకపోతే కాల్చిచంపుతానంటూ సినీఫక్కిలో, మాఫియా తరహాలో స్థానికులను భయబ్రాంతులకు గురి చేశాడు. అయితే స్థానికులు ధైర్యంగా నిలబడటంతో అతను వెనక్కితగ్గాడు. గ్రామస్తులు పోలీస్‌లకు ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ వెంకట్రావు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని అతన్ని అదుపులోకి తీసుకోగా మిగిలిన వారు పరారయ్యారు. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో నరేంద్రరెడ్డి కారణంగా అలజడి రేగడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌లు తెలిపారు.