చంద్రగిరి(చిత్తూరు జిల్లా): ఏప్రిల్ 7న చిత్తూరు జిల్లా శేషాచలం అటవీ ప్రాంతంలోని చీకటీగల కోన, చచ్చినోడుబండ వద్ద ఎన్‌కౌంటర్ జరిగిన స్థలాలను గురువారం సిట్(స్పెషల్ ఇన్విస్టిగేషన్) బృందం పరిశీలించింది. గురువారం ఉదయం 11.30 గంటలకు సిట్ బృందం శ్రీవారి మెట్టు ప్రాంతానికి చేరుకుంది. వాహనాలు పోవడానికి వీలు లేకపోవడంతో సుమారు 15 కిలోమీటర్లు సిట్‌బృందం కాలినడకన ఘటనా స్థలం చేరుకుంది. మృతదేహాలు ఏవిధంగా పడి ఉన్నాయి.. ఎక్కడ నుంచి ఎక్కడ వరకు మృతదేహాలు పడి ఉన్నాయి.. ఎంతమంది టాస్క్‌ఫోర్స్ అధికారులు కాల్పులు జరిపారు.
కూలీల వద్ద ఉన్న ఆయుధాలు ఎక్కడ లభించాయి.. వంటి అంశాలపై స్థానిక అధికారులను ఆరా తీశారు. అనంతరం ఘటనా స్థలానికి సంబంధించిన మ్యాప్‌ను పరిశీలించారు. సంఘటన స్థలంలో ఎక్కడైనా భారీ వృక్షాలు ఉన్నాయా అంటూ ఆరా తీశారు. ఈసందర్భంగా సిట్ చైర్మన్ రవిశంకర్ అయ్యన్నార్ మీడియాతో మాట్లాడారు. హైకోర్టు ఆదేశాల మేరకు 8మందితో కూడిన బృందం శేషాచలంలోని చీకటీగల కోన, చచ్చినోడు బండ ఎన్‌కౌంటర్ ఘటనా స్థలాలను సందర్శించిందన్నారు.
ఈకేసుకు సంబంధించి తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాధ్ జెట్టి నుంచి నివేదిక తీసుకున్నామన్నారు. ఘటన జరిగిన తీరుపై స్థానిక అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నామన్నారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి మరో రెండు నెలల కాల వ్యవధిలో హైకోర్టుకు సీల్డ్ కవర్‌లో నివేదిక అందిస్తామన్నారు. తిరుపతి పోలీసుల నుంచి మరికొన్ని నివేదికలు అందాల్సి ఉందన్నారు. అవి అందిన తర్వాత తుది నివేదికను హైకోర్టుకు అందజేస్తామని తెలిపారు. సిట్ బృందం రవిశంకర్ అయ్యన్నార్‌తో పాటు సభ్యులు డీఐజీ రమణకుమార్, పాలరాజు, చంద్రశేఖర్, యుగంధర్ బాబు, రఘు, మదుసూదన్, చంద్రశేఖర్ వచ్చారు. వీరితో పాటు తిరుపతి వెస్టు డీఎస్పీ శ్రీనివాసులు, చంద్రగిరి సీఐ శివప్రసాద్, ఎస్‌ఐ జయచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇలా ఉండగా ఈ బృందంలో సభ్యుడైన సీబీసీఐడీ డీఎస్పీ యుగంధర్‌బాబు తిరుగు ప్రయాణంలో ఎండ తీవ్రత వల్ల కొంత అస్వస్థతకు గురయ్యారు. చంద్రగిరి సీఐ శివప్రసాద్ వ్యయప్రయాసాలతో శేషాచలంలోకి ద్విచక్ర వాహనాన్ని తెప్పించి సురేంద్రబాబును క్షేమంగా గమ్యానికి చేరవేశారు.
ఎన్‌కౌంటర్ స్థలాన్ని పరిశీలించిన సిట్ బృందం
Published Thu, Apr 30 2015 9:43 PM | Last Updated on Tue, Nov 6 2018 4:42 PM
Advertisement
Advertisement