ఈ హడావిడే మిగిలింది !
విశాఖను కుదిపేసిన వేల కోట్ల రూపాయల భూకుంభకోణాలు.. మావోయిస్టుల దాడిలో ప్రభుత్వ విప్ కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరిల మరణం.. ఈ రెండు ఉదంతాలపైనా ప్రత్యేక విచారణ పేరుతో సర్కార్ సిట్‌లను ఏర్పాటు చేసి హడావుడి చేసింది. వీటి విచారణలు ముగిసినా.. నివేదికలు మాత్రం వెలుగు చూడలేదు.. బాధ్యులపై చర్యలూ లేవు..కారణం.. ఈ రెండింటిలోనూ అధికార టీడీపీ నేతలే దోషులుగా తేలడం.. అందువల్లే ఆ రెండు నివేదికలను టీడీపీ సర్కారు అటకెక్కించేసింది.ఇక.. తాజాగా వైఎస్సార్‌సీపీ నేత, ప్రతిపక్ష నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం ఘటనపైనా సర్కారు హడావుడిగా సిట్ వేసింది. దాని ఆధ్వర్యంలో జరుగుతున్న విచారణ తంతు చూస్తే.. గత రెండు నివేదికల్లానే ఇదీ అటకెక్కిపోవచ్చన్న అనుమానాలు కలుగుతున్నాయి.ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే.. అటు పోలీస్ బాస్, ఇటు ప్రభుత్వ పెద్ద చెప్పిన మాటలనే నిజం చేసే రీతిలో విచారణ జరుగుతోంది. కుట్రదారుల ఊసెత్తకుండా నిందితుడి చుట్టూనే విచారణను తిప్పుతున్న తీరు.. అతనితో పలికించిన పలుకులు.. సిట్ నివేదిక ఎలా ఉండబోతోందో.. ఆ నివేదికపై చర్యలు ఉంటాయో లేదో.. చెప్పకనే చెబుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సిట్.. షిట్.. విశాఖలో వరుసగా వేసిన సిట్‌ల నివేదికలు, విచారణ తీరు చూస్తే ఎవరికైనా ఇలానే అనిపిస్తుంది. ఏడాది కిందట వేల కోట్ల భూ కుంభకోణం మొదలు ఇటీవల అరకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు దారుణంగా కాల్చిచంపిన ఉదంతం.. తాజాగా ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎయిర్‌పోర్ట్‌లో హత్యాయత్నం ఘటనలపై విచారణకు ప్రభుత్వం సిట్‌లను నియమించింది. ఆ రెండు సిట్‌లూ తెరమరుగైపోగా.. జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం వెనుక కుట్రదారులు బడాబాబులు, టీడీపీ పెద్దలేనన్న వాదనలకు బలం చేకూరుతోంది. దీంతో సిట్ విచారణ ముందుకు కదలడం లేదు.
కిడారి కేసులో టీడీపీ నేతల పేర్లు తొక్కిపెట్టినఫకీరప్ప నిన్నటి వరకు సిట్‌లో కీలకం
వైఎస్‌జగన్‌పై హత్యాయత్నం జరిగిన గత నెల 25న సాయంత్రం ఏసీపీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటుచేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ నాగేశ్వరరావు కంటే కిడారి హత్యోదంతాన్ని విచారించిన సిట్ అధికారి డీసీపీ ఫకీరప్పే నిన్నమొన్నటి వరకు ఎక్కువ ‘యాక్షన్’ చేస్తూ వచ్చారు. కర్నూలు ఎస్పీగా వారం కిందటే బదిలీ అయినప్పటికీ అక్కడికి వెళ్లకుండా ఈ కేసుపైనే ఆసక్తి చూపిస్తూ ఇక్కడే మకాం వేశారు. డీసీపీ–2 షష్మీ వచ్చే వరకు ఆయనదే హవా. ఘటన జరిగి వారమైనా.. నిందితుడు శ్రీనివాసరావు పోలీస్ కస్టడీ శుక్రవారంతో ముగుస్తున్నా కేసులో పురోగతి సాధించలేకపోయారు. కుట్రలో పాత్రధారులు, సూత్రధారుల వివరాలు రాబట్టలేకపోయారు. పైగా మంగళవారం నాడు నిందితుడికి భుజం నొప్పి పేరిట కేజీహెచ్‌కు తరలించి.. అక్కడ వ్యూహాత్మకంగా మీడియాతో మాట్లాడించారు. టీవీలకు బైట్‌లు ఇప్పించారు. నిందితుడు జగన్ అభిమానే అని.. ఫీలర్ మరోసారి బయటకు పంపించారు. ఇప్పటివరకు జరిగిన విచారణ తంతు గమనిస్తే శ్రీనివాసరావు పనిచేస్తున్న హోటల్ సిబ్బంది, స్నేహితులు మినహా కనీసం హోటల్ యజమాని, టీడీపీ నేత హర్షవర్ధన్ ప్రసాద్ చౌదరిని కూడా సరిగ్గా విచారించలేకపోయారు. అసలు పాత్రధారులు, సూత్రధారులు బయటకురాకుండా విచారణను శ్రీనివాసరావుకే పరిమితం చేసి కేసును నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా విచారణ సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
భూకుంభకోణాలపై విచారణ ముగిసినాబయటకు రాని భూ రాబందులు
రాష్ట్రాన్ని కుదిపేసిన విశాఖ భూ కుంభకోణాలపై గతేడాది జూన్‌లో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణ ఈ ఏడాది జనవరిలో ముగిసింది. మధురవాడ ప్రాంతంలో రూ.550 కోట్ల విలువైన 60.4 ఎకరాలు, కొమ్మాది ప్రాంతంలో రూ.1641 కోట్ల విలువైన 178.2 ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాకు గురైనట్టు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ప్రకటించడంతో మొదలైన ఈ భూ వివాదం ఆ తర్వాత సుమారు లక్ష ఎకరాలకు సంబంధించిన ఎఫ్‌ఎంబీలు, విలేజ్ మ్యాప్‌లు గల్లంతయ్యాయంటూ చేసిన ప్రకటనతో మరింత ముదిరింది. దీంతో ప్రభుత్వం భూకుంభకోణాలపై వినీత్ బ్రిజ్‌లాల్ నాయకత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. అందిన 2865 ఫిర్యాదుల్లో 327 íసిట్ పరిధిలోకి వచ్చినట్టుగా లెక్కతేల్చారు. మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి పెందుర్తి బండారు సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్యేలు పీలా గోవింద్, పల్లా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్‌బాబు, గణబాబు, కేఎస్‌ఎన్ రాజు, జెడ్పీ చైర్‌పర్సన్ లాలం భవానీ భర్త భాస్కరరావులతో పాటు టీడీపీ ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు పాల్పడిన భూ కబ్జాలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కానీ మొత్తంగా అధికార పార్టీకి చెందిన ఓ అవినీతి చిట్టెలుకను కూడా అరెస్టు చేయకుండానే సిట్ విచారణ తంతు ముగించేశారు.
కిడారి హత్యోదంతంలోటీడీపీ నేతలే కుట్రదారులు సిట్ తేల్చినా పేర్లు వెల్లడించిన వైనం
గత నెలలో జరిగిన ప్రభుత్వ విప్, అరుకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యాకాండకు కుట్రదారులు అధికార టీడీపీ నేతలేనని సిట్ తేల్చింది. సెప్టెంబర్ 24న లివిటుపుట్టులో వారిద్దరినీ మావోయిస్టులు దారుణంగా హత్య చేసిన నేపథ్యంలో డీసీపీ ఫకీరప్ప నేతృత్వంలో ప్రభుత్వం సిట్‌ను నియమించింది. విచారణలో కిడారి, సోమలను హతమార్చిన మావోలకు సహకరించారంటూ డుంబ్రిగుడ మండల టీడీపీ ఉపాధ్యక్షుడైన తూటంగి మాజీ ఎంపీటీసీ యేడెల సుబ్బారావు, అతని భార్య ఈశ్వరితో పాటు డుంబ్రిగుడ మండలం ఆంత్రగుడ గ్రామానికి చెందిన గెమ్మిలి శోభన్, గుంటసీమ పంచాయతీ తడ్డ గ్రామానికి చెందిన కొర్రా కమలను అరెస్ట్ చేశారు. టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఈ నలుగురు గతంలో ఆర్గనైజేషన్ ఆఫ్ ప్రొటక్షన్ గిరిజన రైట్స్ (ఒపీజీఆర్)లో పనిచేశారని గుర్తించారు. టీడీపీ మండల పార్టీ ఉపాధ్యక్షుడు సుబ్బారావు ఇంటికి మావోలు దాసు, జోగేష్, కిషోర్‌లు కొద్దిరోజుల క్రితం సివిల్ దుస్తుల్లో వచ్చి బస చేశారని, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యకు రెక్కీ నిర్వహించారని పోలీసులే ప్రకటించడంతో ఈ జంట హత్యల వెనుక అధికార టీడీపీ నేతల హస్తం తేటతెల్లమైంది. కానీ వారి పేర్లను మాత్రం బయటపెట్టకుండా సిట్ విచారణను అర్ధంతరంగా ముగించేశారు.
Comments
Please login to add a commentAdd a comment