కస్టడీకి తరలించిన తర్వాత నిర్మానుష్యంగా ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్
సాక్షి, విశాఖపట్నం: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసును ఛేదించేందుకు ఏర్పాటు చేసిన సిట్ రోజుకో కట్టు కథ చెబుతూ కాలక్షేపం చేసేసింది. ఆరు రోజులు ఆరు కట్టు కథలు చెప్పించి చివరకు ఏమీ సాధించలేకపోయామని చేతులెత్తేసింది. నిందితుడు శ్రీనివాస్‌ను కస్టడీకి తీసుకున్న తొలిరోజు నుంచి ఏరోజు ఏం జరిగిందో పరిశీలిస్తే..
తొలిరోజు(28.10.2018)
ఆరు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించడంతో గత నెల 28వ తేదీ ఉదయం 11.15 గంటలకు నిందితుడ్ని సెంట్రల్ జైలు నుంచి తీసుకొచ్చారు. 11.45 గంటలకు ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌లో నిందితుడ్ని తొలిరోజు ఎన్ని ప్రశ్నలు వేసినా లేఖలో రాశాను కదా.. అంతా ఆ లేఖలోనే ఉందన్న ఒక్క సమాధానం తప్ప మరో ముక్క అతని నోటి వెంట చెప్పించలేకపోయారు. హత్యాయత్నానికి ఉపయోగించిన కత్తిని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్‌లోనే దాచానని అంగీకరించాడు. దీంతో టీడీపీ నేత, ఫ్యూజన్ ఫుడ్స్ యజమాని హర్షవర్థన్ చౌదరిని పిలిపించి ఓ గంటసేపు విచారించి పంపించేశారు. ఫ్యూజన్ ఫుడ్స్‌కు చెందిన 12 మంది సిబ్బందిని విచారించారు. నిందితుడ్ని వీఐపీ లాంజ్‌లోకి తీసుకెళ్లిన సహోద్యోగి రమాదేవిని, లేఖ రాసిన రేవతిపతి, సోదరి విజయదుర్గలను తీసుకొచ్చి విచారించారు.
రెండో రోజు (29.10.2018)
రెండో రోజు శ్రీనివాస్‌తో పాటు ఫ్యూజన్ పుడ్స్ సిబ్బందిని విచారించారు. హర్షవర్థన్‌ను రెండో రోజు కూడా గంటపాటు విచారించి పంపించేశారు. శ్రీనివాస్ కాల్‌డేటా ఆధారంగా ఎనిమిది సిట్ బృందాలు సెల్‌ఫోన్లు, టాప్–100 కాల్స్ మాట్లాడిన వారిలో అనుమానితులను విచారించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు పంపించారు. జగన్‌పై హత్యాయత్నానికి ఉపయోగించిన కత్తులను తమకు పలుమార్లు రెస్టారెంట్‌లో నిందితుడు చూపించాడని సహోద్యోగులు అంగీకరించారు. శ్రీనివాస్‌తో పాటు రమాదేవి, హేమల నుంచి సమాచారాన్ని రాబట్టారు. స్వగ్రామమైన ఠానేలంకలో కూడా విచారించి అక్టోబర్ 11–16 మధ్య స్వగ్రామంలో గడిపినట్టుగా గుర్తించారు. రెండో రోజు కూడా శ్రీనివాస్ నుంచి ఎలాంటి అదనపు సమాచారాన్ని రాబట్టలేకపోయారు.
3వ రోజు (30.10.2018)
మూడో రోజు విచారణ అనేక అనుమానాలకు తావిచ్చేలా సాగింది. మంగళవారం తెల్లవారు జామున 2 గంటల వరకు టీడీపీ నేత హర్షవర్థన్ చౌదరిని విచారించడంతో కేసు కీలకమలుపు తిరుగుతుందని అందరూ భావించారు. హర్షవర్థన్ విచారణ సమయంలో శ్రీనివాస్‌ను మీడియా ముందుకు పంపండి.. వాడే చెబుతాడు అన్నీ అని పోలీసులకు డైరెక్షన్ ఇచ్చినట్టు గుసగుసలు వినిపించాయి. ఆయనిచ్చిన డైరెక్షన్ మేరకే తొలుత డాక్టర్ దేవుడు బాబును తీసుకొచ్చి వైద్య పరీక్షలు చేయించి అతని నోటి వెంటే కేజీహెచ్‌కు తీసుకెళ్లాలని చెప్పించారు. నిందితుడు తనకు ప్రాణహాని ఉందని, తనను చంపి రాజకీయం చేయాలని చూస్తున్నారంటూ చెప్పడంతో ఖాకీల గొంతులో వెలక్కాయిపడ్డట్టయింది. మూడో రోజూ నిందితుడు నోటి వెంట ఒక్క ముక్క కూడా చెప్పించలేకపోయారు.
4వ రోజు (31.10.2018)
నాలుగో రోజు విచారణలో శ్రీనివాస్ ముందస్తు మర్డర్ ప్లాన్ బట్టబయలైంది. శ్రీనివాస్ కాల్‌డేటా ఆధారంగా ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన సయ్యద్ బీ షేక్, అమ్మాజీ షేక్, రసూల్, నాగూర్ వలీలను విశాఖకు రప్పించి రోజంతా విచారించారు. తమకు శ్రీనివాస్ ఎవరో తెలియదని, మిస్ట్‌కాల్ వస్తే మాట్లాడామని, ఆ సందర్భంగా శ్రీనివాస్ తాను రేపు జగన్‌పై ఎటాక్ చేస్తున్నా, టీవీలో చూసుకోమన్ని చెప్పినట్టుగా అసలు విషయాన్ని బయటపెట్టాడు. దీంతో జగన్ హత్యకు శ్రీనివాస్ ముందస్తు వ్యూహం రచించినట్టుగా స్పష్టమైంది. ఎయిర్ పోర్టు డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, సీఎస్‌వో వేణుగోపాల్‌ను విచారించారు. హొటల్ సిబ్బంది, స్నేహితులను విచారించినా ఏమీ సాధించలేకపోయారు. కుట్రకోణాన్ని వదిలేసి శ్రీనివాస్ తల్లిదండ్రులను మంగళవారం రాత్రి విశాఖకు రప్పించారు.
5వ రోజు(01.11.2018)
ఐదో రోజు విచారణ పూర్తిగా పడకేసింది. తల్లిదండ్రులను, ఇద్దరు హొటల్ సిబ్బందిని మినహా మరెవర్ని విచారించలేదు. మా అబ్బాయికి వైఎస్సార్‌సీపీతో సంబంధంలేదని, ఏనాడు ఆ పార్టీ నేతలతో కానీ, పార్టీలో కానీ తిరగలేదని తల్లిదండ్రులు విచారణలో తేల్చిచెప్పారు. మరో వైపు అప్పటి వరకు జగన్‌కు బయట నుంచి కాఫీ తీసుకొచ్చేవారు కదా ఎవరు ఆపమంటే ఆపేశారంటూ ఎయిర్‌పోర్టు సీఎస్‌వో వేణుగోపాల్‌ను ప్రశ్నించారు. ఐదో రోజు రాత్రి వరకు తల్లిదండ్రులను స్టేషన్‌లోనే ఉంచి విచారించారు.ఐదో రోజు కూడా కుట్రకోణంపై అధికారులు దృష్టి పెట్టలేదు.
6వ రోజు(02.11.2018)
ఇక ఆరో రోజు.. కస్టడీకి చివరి రోజైన శుక్రవారం విచారణను పూర్తిగా చాపచుట్టేశారు. ఆరో రోజు ఏదో తేల్చాశారంటూ.. కుట్రదారులను బయటపెడతారని ఆశిస్తే కనీసం కేసులో ఏ–2, ఏ–3, ఏ–4 ముద్దాయిలను కూడా గుర్తించలేదు. మధ్యాహ్నం మూడు గంటల వరకు టైం పాస్ చేసి నిందితుడ్ని కోర్టుకు తరలించారు. అదనపు కస్టడీ కోరుతూ సమగ్రమైన వాదనను, డాక్యుమెంట్లను సమర్పించకపోవడంతో కస్టడీ పొడిగింపు పిటిషన్‌ను మేజిస్ట్రేట్ డిస్మస్ చేశారు. కుట్ర కోణాన్ని వెలుగులోకి తీసుకురాలేదు. వెనుక ఉన్న సూత్ర, పాత్రధారులను బయటపెట్ట లేదు. ఏమీ సాధించకుండానే నిందితుడ్ని సెంట్రల్ జైలుకు తరలించారు.
బోసిపోయిన ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్
సంచలనం సృష్టించిన జననేతపై హత్యాయత్నం కేసు విచారణకు వేదికైన ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌లో ఏం జరుగుతుందో చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చే ప్రజలు మీడియా ప్రతినిధులతో రోజూ కిటకిటలాడేది. స్టేషన్‌కు సెంట్రీ కూడా రాకుండానే ప్రతిరోజు ఉదయం లైవ్ వెహికల్స్‌తో మీడియా ప్రతినిధులు చేరుకునేవారు. ఘటన జరిగిన 25వ తేదీ నుంచి నిందితుడి కస్టడీ ముగిసిన శుక్రవారం వరకు రాత్రి, పగలనే తేడా లేకుండా మీడియా ప్రతినిధులు స్టేషన్ వద్దే పడిగాపులు పడుతూ ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ చెబుతూ కేసు పురోగతిని ప్రపంచానికి తెలియజేశారు. అలాంటిది శుక్రవారం సాయంత్రం 3.40 గంటలకు నిందితుడు శ్రీనివాసరావును కోర్టుకు తరలించిన కొద్ది క్షణాలకే స్టేషన్ ఒక్కసారిగా బోసిపోయింది. లైవ్ వెహికల్స్ ఒక్కొక్కటిగా వెళ్లిపోవడం, మీడియా ప్రతినిధులు, ప్రజలు కూడా వెళ్లడంతో స్టేషన్ పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment