3 జోన్లుగా రాజధాని! | Sivaramakrishnan Committee submit report to union home ministry | Sakshi
Sakshi News home page

3 జోన్లుగా రాజధాని!

Published Thu, Aug 28 2014 1:12 AM | Last Updated on Tue, Aug 14 2018 3:30 PM

3 జోన్లుగా రాజధాని! - Sakshi

3 జోన్లుగా రాజధాని!

* వికేంద్రీకరణే ఆంధ్రప్రదేశ్‌కు శరణ్యం
* కేంద్ర హోంశాఖకు శివరామకృష్ణన్ కమిటీ నివేదిక
* పలు ప్రత్యామ్నాయాలు సూచించిన కమిటీ
* గుంటూరు - విజయవాడ మధ్య రాజధాని సరికాదు.. ఆర్థిక, పర్యావరణపరంగా నష్టం
* రాజధానికి వినుకొండ-మార్టూరు కొంత అనుకూలం
* హైదరాబాద్ పరిస్థితులు పునరావృతం కాకూడదు
* సచివాలయం, అసెంబ్లీ, ఇతర భవనాల నిర్మాణానికి 7 వేల కోట్లు
* రాజధాని నిర్మాణానికి రూ. 1.10 లక్షల కోట్లు కావాలి
* హైకోర్టు విశాఖలో, బెంచ్ సీమలో ఏర్పాటుచేయాలి
* హైటెక్ జోన్‌గా విశాఖ.. పారిశ్రామిక ప్రాంతంగా కోస్తాంధ్ర.. ట్రాన్స్‌పోర్ట్ కారిడార్‌గా రాయలసీమ
 
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని వికేంద్రీకరణే శరణ్యమని రాజధానిపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ స్పష్టం చేసింది. రాజధానిని ఒకే చోట కేంద్రీకరించకుండా మూడు జోన్లలో విస్తరించాలని సిఫారసు చేసింది. ప్రత్యేకంగా ప్రాంతాలను నిర్దేశించకుండా.. వివిధ ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటుకు అనుకూలతలు, ప్రతికూలతలు, అక్కడి చారిత్రక నేపథ్యాన్ని వివరించింది. ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, రాయలసీమలను దృష్టిలో పెట్టుకుని రాజధానిని వికేంద్రీకరించాలని, ప్రధాన కేంద్రం ఈ మూడు ప్రాంతాలకూ కేంద్రంగా ఉండాలని సిఫారసు చేసింది.

హైదరాబాద్ వల్ల తలెత్తిన పరిస్థితులు పునరావృతం కాకూడదని అభిప్రాయపడింది. గుంటూరు జిల్లా వినుకొండ - ప్రకాశం జిల్లా మార్టూరు మధ్య రాజధాని ఏర్పాటుకు అనుకూలత ఎక్కువని కమిటీ సిఫారసు చేసినట్టు సమాచారం. విజయవాడ -  గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు సరికాదని చెప్పినట్లు తెలిసింది. పలు దఫాలుగా రాష్ట్రంలో పర్యటించిన ఈ కమిటీ నూతన రాజధాని నిర్మాణం విషయంలో అనేక సూచనలు చేసింది. అంతిమ నిర్ణయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని తే ల్చిచెప్పింది.
 
ఐదుగురు నిపుణులతో కూడిన కె.సి.శివరామకృష్ణన్ కమిటీ బుధవారం సాయంత్రం కేంద్ర హోం శాఖకు తన నివేదికను సమర్పించింది. కమిటీకి మాజీ ఐఏఎస్ అధికారి కె.సి.శివరామకృష్ణన్ నేతృత్వం వహించగా, వివిధ రంగాల నిపుణులు రతిన్ రాయ్, జగన్‌షా, ఆరోమర్ రవి, కె.టి.రవీంద్రన్ సభ్యులుగా ఉన్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం నోటిఫైడ్ తేదీ నుంచి ఆరు నెలల్లోపు ఈ కమిటీ నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఈమేరకు ఈ నెల 31 వరకు గడువు ఉన్నప్పటికీ, 4 రోజులు ముందుగానే కమిటీ నివేదిక సమర్పించింది. విశ్వసనీయవర్గాల కథనం ప్రకారం కమిటీ సూచనలు ఈ విధంగా ఉన్నాయి..
 
అభివృద్ధికి నాలుగు భాగాలుగా..
ఆంధ్రప్రదేశ్‌ను ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ.. ఇలా నాలుగు భాగాలుగా చేసుకుని అభివృద్ధిని వికేంద్రీకరించాలని సిఫారసు చేసింది.  కాస్మొపాలిటన్ నగరంగా ఎదుగుతున్న విశాఖ నగరాన్ని హైటెక్ జోన్‌గా మలచుకోవచ్చని తెలిపింది. విశాఖలో ఇప్పటికే ఉన్న ఐటీ ఆధారిత కంపెనీల ఆధారంగా మరికొన్ని సంస్థలను ఆహ్వానించవచ్చని చెప్పింది. కోస్తాంధ్రలో రేవు ఆధారిత, పెట్రో కెమికల్ ఆధారిత పరిశ్రమలకు విపరీతమైన అవకాశాలు ఉన్నందున వాటిని పారిశ్రామిక నగరాలుగా అభివృద్ధి చేయవచ్చని తెలిపింది.

రాయలసీమ ప్రాంతం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు మధ్య ఉన్నందున ఈ జోన్‌ను ట్రాన్స్‌పోర్టు కారిడార్‌గా మలచుకోవచ్చని, బెంగళూరు హైవే దీనికి తోడ్పడుతుందని అభిప్రాయపడింది. శ్రీ కాళహస్తిలో రైల్వేజోన్ ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రం మొత్తం అవసరాలు తీరడ మే కాకుండా పొరుగు రాష్ట్రాలకు, రాష్ట్రంలోని వివిధ నగరాలకు రవాణా సౌకర్యం (కనెక్టివిటీ) పెంచుకోవచ్చని సిఫారసు చేసింది. పోర్టులను అనుసంధానం చేస్తూ రైల్వే కనెక్టివిటీ పెంచుకునేందుకు కూడా ఈ జోన్ అనుకూలంగా ఉంటుందని తెలిపింది.
 
విజయవాడ-గుంటూరు ఆర్థికంగా భారం
గుంటూరు జిల్లా వినుకొండ, ప్రకాశం జిల్లా మార్టూరు మధ్య రాజధాని ఏర్పాటుకు అనుకూలత ఎక్కువగా ఉందని అభిప్రాయపడింది. ఇక్కడ భూసేకరణ సులువని, అన్ని ప్రాంతాలకు మధ్యగా ఉంటుందని అభిప్రాయపడింది. ఇక్కడ ప్రభుత్వ భూములూ అందుబాటులో ఉన్నాయని, నీటి వసతిని సమకూర్చుకోవడమూ సులువేనని తెలిపింది. విజయవాడ - గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు సరికాదని శివరామకృష్ణన్ కమిటీ అభిప్రాయపడింది. మెట్రో నగరంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉన్నప్పటికీ. ఒకే చోట అభివృద్ధిని పరిమితం చేయడం సరికాదంది.

హైదరాబాద్‌లో అభివృద్ధిని కేంద్రీకరించడం వల్ల వచ్చిన సమస్యలే ఇక్కడా పునరావృతమవుతాయని చెప్పింది. పైగా ఇక్కడ భూ సేకరణ అతి పెద్ద సవాలుగా మారుతుందని తేల్చిచెప్పింది. విజయవాడ - గుంటూరు - తెనాలి - మంగళగిరి (వీజీటీఎం) ప్రాంతంలో రాజధాని ఏర్పా టు చేయాలన్న డిమాండ్ బాగా వినిపించినప్పటికీ... ఇక్కడ రాజధానికి అవసరమైన భూముల సేకరణ తీవ్ర కష్టమైన పని అని, ఆర్థికంగా కూడా భారమని అభిప్రాయపడింది. పైగా ఈ  ప్రాంతం పరిధిలో రాజధాని ఏర్పాటు చేయాలంటే సాగు భూములు నష్టపోవాల్సి వస్తుందని తెలిపింది.
 
వికేంద్రీకరణ మేలు..
రాజధానిని ఒకే చోట ఏర్పాటుచేయడం కం టే మూడు జోన్లుగా వికేంద్రీకరించి, రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడం మేలని కమిటీ సిఫారసు చేసింది. ఇలా చేయదలిస్తే.. విజయవాడ-గుంటూరు, విశాఖ-విజయనగరం, రాయలసీమలను మూడు క్లస్టర్లుగా చేసుకొని వికేంద్రీకరించుకోవచ్చని అభిప్రాయపడింది.రాజధానిలో అసెంబ్లీ, సచివాలయం, సీఎం కార్యాలయం, మంత్రులు, ఎమ్మెల్యే ల నివాసాలు ఏర్పాటు చేసి, మిగిలిన కార్యాలయాలు ఆయా ప్రాంతాల స్వభావాన్ని బట్టి ఏర్పాటు చేసుకోవచ్చని సూచించింది.

రాజధానిలో సచివాలయం, శాసనసభ, ఇతర భవనాల నిర్మాణానికి రూ. 7 వేల కోట్లు అవసరమని, మొత్తం రాజధాని నిర్మాణానికి రూ. 1.10 లక్షల కోట్లు అవసరమని కమిటీ అంచనా వేసింది. విశాఖలో హైకోర్టు ఏర్పాటు చేయాలని, రాయలసీమ జిల్లాలైన అనంతపురం లేదా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయొచ్చని సూచించింది. వివిధ శాఖల పరిధిలోని డెరైక్టరేట్లు, కమిషనరేట్లను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల అవసరాలను బట్టి ఏర్పాటుచేయవచ్చని అభిప్రాయపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement