నకిలీలతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన భద్రతా నిపుణులు
పలు ఫేక్ లోన్‌యాప్‌ల జాబితా విడుదల చేసిన సైబర్ సెక్యూరిటీ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: కొన్ని లోన్‌యాప్‌ల అరాచకాలకు తోడు నకిలీ లోన్‌యాప్‌లు ఇప్పుడు వల విసురుతున్నాయి. ఫేక్ లోన్‌యాప్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే చిక్కులు తప్పవని సైబర్ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆర్థిక అవసరాల్లో ఉండేవారి బలహీనతలను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు నకిలీ యాప్‌ల వల విసురుతున్నారని వారు పేర్కొంటున్నారు. ఈ యాప్‌లను ఇన్‌స్టాల్ చేయగానే ఫోన్‌లోని కాంటాక్ట్ నంబర్లు, ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఇటీవల గుర్తించిన కొన్ని నకిలీ లోన్‌యాప్‌లు..
ఇటీవల గుర్తించిన కొన్ని నకిలీ లోన్‌యాప్స్ వివరాలు కేంద్ర హోంశాఖ ఎక్స్‌లో వెల్లడించింది. వీటిలో కొన్ని శత్రుదేశాల నుంచి నడుపుతున్నారని, అనుమానాస్పద కదలికలు అందులో ఉన్నట్టు వెల్లడించింది. అలాంటి యాప్‌లను ఇన్‌స్టాల్ చేయగానే ఫోన్లు హ్యాక్ అవుతున్నాయని పేర్కొంది.
హోంశాఖ వెల్లడించిన ప్రకారం..క్రెడిట్ కార్డ్ మేనేజర్ (ఎర్లీ యాక్సెస్), సీసీ క్రెడిట్–ఫైనాన్షియల్ అసిస్టెన్స్ సిల్వర్ క్యాష్, ఈజీ రూపే, క్యాష్ పార్క్–పర్సనల్ లోన్, సింప్లీ రూపే, 3ఏ రూపీ, దానా క్రెడిట్, ప్రెఫర్డ్ వ్యాలెట్, టచ్ రూపీ–ఆన్‌లైన్ క్రెడిట్, టకామాల్, క్రేజీ మనీ: క్యాష్ అడ్వాన్స్, సింపుల్ క్యాష్, స్మాల్ క్రెడిట్–బడ్డీక్యాష్ యాప్‌లు ఉన్నాయి.
ఫేక్‌లోన్ యాప్‌లను ఎలా గుర్తించాలి..
» చట్టబద్ధమైన లోన్ యాప్‌లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)అనుమతి తప్పనిసరి. ఇది లేదంటే ఫేక్ లోన్‌యాప్‌గా గుర్తించాలి.
» యాప్ డిజైన్‌లో లోపాలు: నకిలీ రుణ యాప్‌లలో పేలవమైన వినియోగదారు ఇంటర్‌ఫేస్‌లు, అనేక స్పెల్లింగ్ లేదా వ్యాకరణ దోషాలు గమనించవచ్చు.
» రుణం తీసుకోవాలనుకునే వ్యక్తులను త్వరగా వివరాలు పంపాలని, వెంటనే మేం చెప్పిన లింక్‌లపై క్లిక్ చేసి వివరాలు నమోదు చేయాలని.. త్వరగా చేయకపోతే సమయం అయిపోతుందని..ఇలా తీవ్రమైన ఒత్తిడి పెడతారు.
» ఫేక్ లోన్‌యాప్‌లలో సదరు సంస్థ చిరునామా, కస్టమర్ సర్వీస్ నంబర్, ఈ మెయిల్ వంటివి ఉండవు. ఉన్నా..
తప్పుడు వివరాలు నమోదు చేస్తారు.
» వాస్తవంలో సాధ్యం కాని ఆఫర్లు ఉన్నా అనుమానించాలి. అత్యల్ప వడ్డీ రేట్లు, ఎలాంటి తప్పనిసరైన డాక్యుమెంట్లు సైతం అవసరం లేదనడం. ఆఫర్ అసాధారణంగా ఆకర్షణీయంగా కనిపిస్తే, అది స్కామ్ కావచ్చు.
నకిలీల నుంచి ఇలా కాపాడుకోవచ్చు..
» ఎలాంటి పత్రాలు లేకుండా లోన్ ఇస్తామంటే తొందరపడి లోన్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవద్దు.
» లోన్‌యాప్ గురించిన వివరాలు పూర్తిగా ఆరా తీయాలి. ఆన్‌లైన్‌లో ఆ యాప్ రేటింగ్, రివ్యూలు చదివి తెలుసుకోవాలి.
» సమయం అయిపోతుందని పదేపదే ఫోన్‌లు చేసి తొందరపెడుతున్నట్లయితే అది కచ్చితంగా ఫేక్ లోన్‌యాప్ అని గుర్తించాలి.
Comments
Please login to add a commentAdd a comment