ఇరవై నెలల నుంచి మహోగ్రంగా మండుతున్న మణిపూర్‌లో తొలిసారి ఒక చల్లని సాంత్వన వాక్యం వినబడింది. రాష్ట్రంలో ఇంతవరకూ జరిగిన హింసాకాండకు క్షమాపణ కోరుతున్నానని నూతన సంవత్సర ఆగమనవేళ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ ప్రకటించారు. అనుకోనిది చోటు చేసుకున్నప్పుడు క్షమాపణ కోరటంవల్ల వెంటనే అంతా చక్కబడుతుందని అనుకోనవసరం లేదు. కానీ నేరగాళ్లపై చర్య తీసుకుంటారన్న విశ్వాసం కలిగినప్పుడు బాధిత పక్షంలో ప్రతీకార వాంఛ సన్నగిల్లుతుంది.
వారిని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకునేవారి ఆటలు సాగవు. కానీ ఇన్నాళ్లుగా మణిపూర్‌లో జరిగింది వేరు. 2023 మే నెలలో ఘర్షణలు రాజుకున్నప్పుడు బీరేన్ సింగ్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రెండు ప్రధాన తెగలు మొయితీ–కుకీలు ఘర్షణ పడుతున్నారన్న సంగతిని గుర్తించటానికే నిరాకరించారు. ‘ఇదంతా కుకీ ఉగ్రవాదులకూ, భద్రతా దళాలకూ సాగు తున్న ఘర్షణ’ అంటూ భాష్యం చెప్పారు. మొయితీకి చెందిన నేతగా కుకీల తీరుపై ఎలాంటి అభి ప్రాయాలైనా, అభ్యంతరాలైనా ఆయనకు ఉండొచ్చు.
కానీ సీఎం హోదాలో అలా మాట్లాడరాదన్న సంగతిని బీరేన్ గ్రహించలేకపోయారు. ఆ వెంటనే రక్షణ దళాల చీఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ ముఖ్యమంత్రి ప్రకటనను తోసిపుచ్చారు. అవి స్పష్టంగా తెగల ఘర్షణలేనని చెప్పారు. మణిపూర్ హింసకు ఇంతవరకూ 260 మంది బలి కాగా, 60,000 మంది ఇప్పటికీ రక్షణ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. రాష్ట్రం రెండు తెగలమధ్యా చీలిపోయింది. ఒకరి ప్రాంతాల్లోకి మరొకరు వెళ్లే పరిస్థితి లేదు.
రెండు రోజుల క్రితం కేంద్ర హోంశాఖ విడుదల చేసిన నివేదిక గమనిస్తే మణిపూర్ ఎంత అధ్వాన్నంగా ఉన్నదో తెలుస్తుంది. అక్కడ మొయితీ, కుకీ, జోమీ తెగల పరస్పర ఘర్షణలవల్ల హింసాకాండ రాజుకుందనీ, మిలిటెంట్ల ప్రాబల్యం పెరిగిందనీ నివేదిక సారాంశం. మొత్తంగా ఈశాన్య ప్రాంతంలో అశాంతికి 77 శాతం మణిపూర్ పరిణామాలే కారణమని తెలిపింది. మొయితీ తెగను కూడా ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ మణిపూర్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఈ సమస్యకు మూల కారణం.
2023 మే 3న ఆ తీర్పును వ్యతిరేకిస్తూ మణిపూర్‌లోని ఆల్ ట్రైబల్స్ స్టూడెంట్స్ యూని యన్ నిర్వహించిన ర్యాలీపై మొయితీల దాడి, దానికి ప్రతిగా కుకీలు రెచ్చిపోవటం పరిస్థితిని దిగజార్చింది. చివరకు మహిళలపై గుంపులు దాడిచేసి వారిని వివస్త్రలను చేయటం, నగ్నంగా ఊరే గించి అత్యాచారాలకు తెగబడటం యధేచ్ఛగా సాగాయి. ఇక గృహదహనాలు, ఇతర ఆస్తుల ధ్వంసం వంటివి సరేసరి.
పోలీస్ స్టేషన్లపై, సాయుధ రిజర్వ్ బెటాలియన్ స్థావరాలపై దాడులకు దిగి వేలాది తుపాకులు, రాకెట్ లాంచర్లు, లక్షల తూటాలు అపహరించారు. వేలాదిమంది కొంపా గోడూ వదిలి చెట్టుకొకరు పుట్టకొకరయ్యారు. ఆఖరికి ఇవి మత ఘర్షణలుగా కూడా పరిణమించాయి. వాస్తవానికి ఒక తెగవారంతా ఒకే మతంవారని చెప్పటానికి వీల్లేదు. అయితే కుకీల్లో అత్య ధికులు క్రైస్తవులుకాగా, హిందువులు కూడా ఉంటారు.
మొయితీల్లో కూడా క్రైస్తవ మతాన్ని అనుస రించేవారున్నా వారి సంఖ్య తక్కువ. అత్యధికులు హిందువులు. ఈ పరస్పర వైషమ్యాల పర్యవ సానంగా చర్చిలను ధ్వంసం చేసిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. నూతన సంవత్సర వేళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకూ, ప్రధాని నరేంద్ర మోదీకీ సమర్పించిన వినతిపత్రంలో 2023 నుంచి ఇంత వరకూ మణిపూర్‌లో 360 చర్చిలను ధ్వంసం చేశారని 400 మంది సీనియర్ క్రిస్టియన్ నాయకులు తెలియజేశారు. క్రైస్తవులపై దాడులు జరిగిన ఉదంతాలు 720 ఉన్నాయని వారంటున్నారు.
ఘర్షణలు అడపా దడపా ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అపహరించిన ఆయుధాలు అప్ప గించమని పోలీసులు చేసిన వినతి పెద్దగా పనిచేయలేదు. ఇప్పటికీ మొయితీ, కుకీ తెగలవద్ద కుప్ప లుగా ఆయుధాలున్నాయి. ఇందులో అపహరించిన వాటితోపాటు పొరుగునున్న మయన్మార్‌నుంచి వచ్చిపడుతున్న ఆయుధాలున్నాయని పోలీసులు చెబుతున్నారు. మణిపూర్‌తో పాటు ఇతర ఈశాన్య రాష్ట్రాలు ఎంతో వైవిధ్యభరితమైనవి. అక్కడ 400కు పైగా తెగలున్నాయి.
భిన్న సంస్కృతులు, విశ్వాసాలకు చెందిన వీరంతా కొన్ని మినహాయింపులతో శతాబ్దాలుగా కలిసిమెలిసి ఉంటున్నారు. అయితే పరిమిత వనరులను ఇంతమందితో పంచుకోవాల్సి రావటంవల్ల అందరిలోనూ భయాందోళనలున్నాయి. ఇది సాయుధ బృందాలకు ఊపిరిపోస్తోంది. తమకు స్వయం పాలిత ప్రాంతాలు కావాలన్న డిమాండ్ బయల్దేరుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎంతో జాగ్రత్తగా అడుగు లేయాల్సి వుండగా ఇన్నాళ్లూ మణిపూర్ నిర్లక్ష్యానికి గురైంది.
ఇప్పుడు బీరేన్ సింగ్ ప్రకటన తర్వాతైనా వాస్తవాల ఆధారంగా నిర్దిష్ట చర్యలు ప్రారంభం కావాలి. సమస్య బయల్దేరినప్పుడు కిందిస్థాయిలో తగిన చర్యలు తీసుకోవటంలో విఫలమైనప్పుడే అవి పెరిగి పెద్దవై పరిష్కారానికి అసాధ్యంగా పరిణమిస్తాయని అమెరికా మాజీ రక్షణమంత్రి రాబర్ట్ గేట్స్ ఒక సందర్భంలో అంటారు. మొన్న జూన్‌లో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సమస్య ఉగ్రరూపం దాల్చిందని చెప్పిన సంగతి మరిచిపోరాదు.
బాధిత పక్షాలకు భరోసా కల్పించే విధంగా అడుగులేస్తే, ఉపాధి కల్పనకు నడుం బిగిస్తే క్రమేపీ అంతా సర్దుకుంటుంది. ఏ తెగ హక్కులకూ భంగం కలగనీయబోమని, మారణకాండ కారకులను కఠినంగా శిక్షిస్తామని సంకేతాలు పంపితే ఉద్రిక్తతల ఉపశమనానికి ఆ వాగ్దానాలు తోడ్పడతాయి. రాజకీయ పక్షాలు సైతం ఈ సమయంలో బాధ్యతాయుతంగా మెలగాలి.
మణిపూర్ చల్లారుతుందా?
Published Thu, Jan 2 2025 5:40 AM | Last Updated on Thu, Jan 2 2025 5:40 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment