శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఊహించిన విధంగానే ఉందని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు.
హైదరాబాద్ : శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఊహించిన విధంగానే ఉందని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటుకు వ్యవసాయ భూములను వినియోగించొద్దని కమిటీ సూచిందన్నారు. తాము ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని నారాయణ తెలిపారు. నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా అందలేదన్నారు. నివేదిక వచ్చిన వెంటనే వచ్చే నెల 1న జరిగే కేబినెట్లో దీనిపై చర్చిస్తామని నారాయణ తెలిపారు.
కాగా ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని వికేంద్రీకరణే శరణ్యమని రాజధానిపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. రాజధానిని ఒకే చోట కేంద్రీకరించకుండా మూడు జోన్లలో విస్తరించాలని సిఫారసు చేసింది. ప్రత్యేకంగా ప్రాంతాలను నిర్దేశించకుండా.. వివిధ ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటుకు అనుకూలతలు, ప్రతికూలతలు, అక్కడి చారిత్రక నేపథ్యాన్ని వివరించింది. ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, రాయలసీమలను దృష్టిలో పెట్టుకుని రాజధానిని వికేంద్రీకరించాలని, ప్రధాన కేంద్రం ఈ మూడు ప్రాంతాలకూ కేంద్రంగా ఉండాలని సిఫారసు చేసింది.