రాష్ట్రంలో రూ.16 వేల కోట్లతో ఆరు లక్షల ఇళ్లను నిర్మించి పేదవారి సొంతింటి కలను నెరవేరుస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో రూ.16 వేల కోట్లతో ఆరు లక్షల ఇళ్లను నిర్మించి పేదవారి సొంతింటి కలను నెరవేరుస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. బి.ఆర్.అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా విజయవాడ రూరల్ మండలం జక్కంపూడిలో రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన పదివేల గృహాల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. అలాగే రాష్ట్రంలో నిర్మించనున్న ఆరులక్షల ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన పైలాన్‌ను కూడా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. 265 ఎకరాల స్థలంలో నిర్మించే ఈ గృహ సముదాయాన్ని వచ్చే ఏడాదిలోగా పూర్తి చేస్తామని చెప్పారు. ఈ గృహసముదాయానికి సమీపంలో పోలవరం కుడికాలువ, జాతీయ రహదారి, నగరానికి 15 కిలోమీటర్ల దూరం వంటి సదుపాయాలున్నాయని తెలిపారు. ఇక్కడ లక్షమంది నివసించేలాగా టౌన్‌షిప్ ఏర్పాటు చేస్తామని, అన్నిరకాల మౌలిక సదుపాయాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.