- వైద్యులు లేరు.. రోగులు రారు..
- ఉద్యోగులకు మాత్రం ప్రతినెలా జీతాలు
- పని లేకుండానే శిథిల భవనాల్లో 84 మంది కాలక్షేపం
- మంగళగిరి ప్రభుత్వాస్పత్రిలో విచిత్రం
సాక్షి, విజయవాడ బ్యూరో : అది ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి. కానీ అందులో ఒక్క వైద్యుడు కూడా లేడు. రోగులు వచ్చే పరిస్థితి లేనే లేదు. అయినా 84 మంది ఉద్యోగులు మాత్రం అక్కడ పనిచేస్తున్నారు. అది కూడా ఆరేళ్లుగా. ప్రతి నెలా వీరికి జీతాలు పంపుతున్న వైద్యవిద్య శాఖ ఉన్నతాధికారులు మాత్రం ఈ విషయం గురించి పట్టించుకోలేదు. ఉద్యోగులు పనిదినాల్లో కాలక్షేపానికి ఇక్కడికి వస్తున్నారు. ఈ విడ్డూరం మంగళగిరి ప్రభుత్వాస్పత్రిలో ఆరేళ్లుగా నిరాఘాటంగా జరుగుతోంది.
స్టే ఆర్డర్‌తో నిలిచిన బదిలీలు
మంగళగిరికి రెండు పక్కలా ఉన్న గుంటూరు, విజయవాడ ప్రభుత్వాస్పత్రులు నిరంతరం రోగులతో కిటకిటలాడుతున్నా అక్కడ అవసరమైన నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర సిబ్బంది లేరు. మంగళగిరి ప్రభుత్వాస్పత్రికి రోగులెవరూ రాకపోయినా 84 మంది ఉద్యోగం చేస్తున్నారు. ఖాళీగా ఉన్న వారిని ఈ రెండు ఆస్పత్రుల్లో సర్దుబాటు చేయాలని గతంలో అధికారులు ప్రయత్నించినా సాధ్యపడలేదు.
కొందరు ఉద్యోగుల సహకారంతో స్థానికులు కోర్టుకెళ్లి ఆస్పత్రిని వేరే ప్రాంతానికి మార్చకుండా స్టే ఆర్డర్ తెచ్చారు. దీన్ని ఎత్తివేయించడానికి ఉన్నతాధికారులెవరూ ప్రయత్నించకపోవడంతో ఉద్యోగులు ఆరేళ్ల నుంచి పని లేకుండా జీతాలు తీసుకుని గడిపేస్తుండడం విశేషం.
అసలు కథ ఇదీ
మంగళగిరిలో 50 ఏళ్ల కిందట కుష్టు రోగుల కోసం టీబీ శానిటోరియాన్ని ఏర్పాటు చేశారు. 1987లో దీన్ని 180 పడకల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిగా మార్చారు. అప్పట్లో 2,247 మంది ఇన్‌పేషెంట్లు, 45,436 మంది అవుట్‌పేషెంట్లు ఇక్కడ చికిత్స పొందారు. 2004 సంవత్సరానికి ఈ ఆస్పత్రిలో అవుట్ పేషెంట్ల సంఖ్య లక్షా 64 వేలకుపైగా పెరిగింది. పట్టణంలో వైద్య సదుపాయాలు పెరగడం, ఊరికి దూరంగా ఉండడంతో రోగుల సంఖ్య క్రమేపీ తగ్గింది.
ఈ నేపథ్యంలో 2008లో 180 పడకల ఈ ఆస్పత్రిని ఎంసీఐ సిఫారసు మేరకు విజయవాడ సిద్ధార్ధ వైద్య కళాశాలకు అనుబంధంగా మార్చారు. అప్పుడే ఆస్పత్రిలో పనిచేస్తున్న సుమారు 30 మంది వైద్యులు కూడా విజయవాడకు వచ్చారు. కానీ స్టాఫ్‌నర్సులు, నర్సులు, ఇతర సిబ్బంది 150 మంది రాలేదు. గుంటూరు జోన్‌లో ఉన్న తాము రాజమండ్రి జోన్ పరిధిలోని విజయవాడ వెళితే సర్వీసు కోల్పోవాల్సివస్తుందని, తామంతా జూనియర్లమవుతామనే కారణంతో వారు అభ్యంతరం వ్యక్తం చేసి అక్కడే ఉండిపోయారు. విజయవాడ కాకపోతే గుంటూరు జిల్లాలోని గుంటూరు, పరిసర ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో పనిచేయడానికీ వారు ఒప్పుకోలేదు. దీంతో ఆ సమస్య అప్పటి నుంచి పెండింగ్‌లోనే ఉంది.
డీఎంఈ పరిశీలనలో వెలుగులోకి..
2008లో 150 మంది సిబ్బంది ఉండగా కొందరు రిటైర్ కావడంతో వారి సంఖ్య ప్రస్తుతం 107కి తగ్గింది. ప్రస్తుతం 84 మంది మాత్రమే ఈ ఆస్పత్రిలో పనిచేస్తున్నట్లు రికార్డుల్లో నమోదై ఉంది. ఇటీవలే 24 మంది సిబ్బందిని ఉన్నతాధికారులు బలవంతంగా గుంటూరు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి బదిలీ చేశారు.
మిగిలినవారు పనీ పాటా లేకుండా అక్కడే కాలక్షేపం చేస్తున్నారు. సీఎస్ ఆర్‌ఎంవోగా పనిచేస్తున్న వైద్యురాలు ప్రస్తుతం ఈ ఆస్పత్రికి సూపరింటెండెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాంగణంలో ఎయిమ్స్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉన్న నేపథ్యంలో మెడికల్ ఎడ్యుకేషన్ డెరైక్టర్ శాంతారామ్ ఇటీవల అక్కడికెళ్లినప్పుడు ఆస్పత్రిని చూసి అవాక్కయ్యారు. 2008 నుంచి వైద్యులు, రోగులు లేకుండా ఆస్పత్రిని ఎలా కొనసాగిస్తున్నారో తెలియక విస్మయానికి లోనయ్యారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.