అనుకున్నదే అయింది...! | smart city ongole | Sakshi
Sakshi News home page

అనుకున్నదే అయింది...!

Published Fri, Sep 5 2014 3:53 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 PM

అనుకున్నదే అయింది...!

అనుకున్నదే అయింది...!

నివేదిక బుట్టదాఖలు
ప్రకాశం జిల్లాకు అన్యాయం
మొక్కుబడి ప్రకటన
శివరామకృష్ణన్ సూచనలకు మంగళం
స్మార్ట్ సిటీగా ఒంగోలు
విమానాశ్రయం, రామాయపట్నం పోర్టు
పారిశ్రామిక వాడగా దొనకొండ
పైవన్నీ కేంద్రం చేయాల్సిందే
తన ఖాతాలో వేసుకొని హామీలు
 సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అనుకున్నదే అయింది. మొదటి నుంచి ప్రకాశం జిల్లా రాజధానిగా చేయడానికి ఇష్టపడని చంద్రబాబు ఈ జిల్లాపై తన సవతిప్రేమను మరోసారి చూపించారు. మిగిలిన జిల్లాలకు పెద్ద ఎత్తున వరాలు ప్రకటించిన చంద్రబాబునాయుడు ప్రకాశం జిల్లాపై చిన్నచూపు చూశారు. దొనకొండ - మార్టూరు - వినుకొండ మధ్య రాజధానికి అనుకూలమని ఇక్కడ భూసేకరణకు పెద్దగా ఖర్చు కాదని, వ్యవసాయేతర భూములున్నాయని శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తుంగలో తొక్కారు.

విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన అసెంబ్లీలో గురువారం ప్రకటించారు. ఈ ప్రకటన పట్ల జిల్లా ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అధికార పక్షానికి చెందిన ఐదుగురు శాసనసభ్యులు ఉండి కూడా దీన్ని కనీసం వ్యతిరేకించకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా జిల్లా మంత్రిని ఈ విషయంలో ముఖ్యమంత్రి పొగిడిన తీరును కూడా వారు తప్పు పడుతున్నారు. జిల్లా మంత్రి శిద్దా రాఘవరావు ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారని, అందుకే రాజధాని బదులుగా పారిశ్రామిక అభివృద్ధి చేయాలంటూ కోరారని ముఖ్యమంత్రి ప్రకటించడం ద్వారా జిల్లాలోని తెలుగుదేశం ప్రజాప్రతినిధులకు కూడా ప్రకాశం జిల్లా రాజధాని కావడం ఇష్టం లేదని చెప్పకనే చెప్పారు.

జిల్లాలో ఎయిర్‌పోర్టు, రామాయపట్నం పోర్టు అభివృద్ధి, కనిగిరిలో జాతీయ పెట్టుబడులు, ఉత్పత్తుల జోన్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఎయిర్‌పోర్టు, రామాయపట్నం పోర్టులను అభివృద్ధి చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. అయినా ఇవి తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు. ఒకపక్క కేంద్రం దుగరాజపట్నం పోర్టు అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ పునర్‌విభజన బిల్లులో ప్రకటించింది. అటువంటప్పుడు దగ్గరలోనే రామాయపట్నం పోర్టును కేంద్రం ఏ విధంగా అంగీకరిస్తుందనే విషయంపై స్పష్టత లేదు.

ఒంగోలును స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని, ఫుడ్‌పార్క్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.జిల్లాలో ముఖ్యమైన వెలుగొండ ప్రాజెక్టును ఏడాదిలోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది కూడా సాధ్యమయ్యేట్టు కనిపించడంలేదు.  ఒకపక్కన ఆర్థికలోటు ఉన్న బడ్జెట్‌లో ఏ కేటాయింపులూ చేయకుండా ప్రస్తుతం ప్రకటించిన ప్రాజెక్టులు ఏ విధంగా చేస్తారనేదానిపై స్పష్టత లేకుండా హామీలు ఇవ్వడం వల్ల ఉపయోగం లేదని రాజకీయపార్టీల నేతలు విమర్శిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement