
పారిశుద్ధ్య పనుల్లో మున్సిపల్ సిబ్బంది
విజయనగరం మున్సిపాలిటీ: చెత్తపై పర్యవేక్షణ ఆధునిక పుంతలు తొక్కనుంది. కొన్నేళ్ల వరకు కేవలం ప్రజారోగ్య సిబ్బంది నేరుగా ఈ పనులను పర్యవేక్షించగా, రెండేళ్ల క్రితం నుంచి అండ్రాయిడ్ ఫోన్ల ద్వారా పర్యవేక్షణ చేపడుతున్నారు. తాజాగా ఈ విధానంలో మరింత సాంకేతికను జోడించే దిశగా అడుగులు పడుతున్నాయి. మరి కొద్ది రోజుల్లో డ్రోన్ కెమెరాల ద్వారా పారిశుద్ధ్య నిర్వహణ తీరుపై నిశితంగా పరిశీలించనున్నారు. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు రెండేళ్ల క్రితం బ్లాక్‌స్పాట్ నిర్మూలన కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. దీనికోసం ప్రత్యేకంగా మున్సిపాలిటీలకు సెల్‌ఫోన్లను సమకూర్చింది. ఈ సెల్‌ఫోన్ల ద్వారా పారిశుద్ధ్య పరిస్థితిని అమరావతిలో ఏర్పాటు చేసిన స్క్రీన్‌వాల్స్ ద్వారా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. వీటితో పాటు ప్రస్తుతం డ్రోన్లు కూడా వినియోగంలోకి రానున్నాయి.
సిబ్బందికి ప్రత్యేక శిక్షణ..
డ్రోన్ కెమెరాల వినియోగంపై ప్రతీ మున్సిపాలిటీ నుంచి ఇద్దరు వ్యక్తుల చొప్పున ఎంపిక చేసి వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తోంది ప్రభుత్వం. గతంలో వారం రోజుల పాటు గుంటూరులో శిక్షణ ఇవ్వగా, గత నెలలో 15 రోజుల పాటు అమరావతిలో శిక్షణ ఇచ్చారు. త్వరలో పురపాలక సంఘాలకు డ్రోన్‌లు, ప్లెయిన్‌లను అందజేయనున్నారు. మున్సిపాలిటీలకు అందజేసే డ్రోన్‌లు జీపీఎస్ విధానంతో పనిచేస్తాయి. వీటి ద్వారా తీసే వీడియోలు నేరుగా మున్సిపల్ కార్యాలయం సిబ్బందే కాకుండా అమరావతిలో ఏర్పాటు చేసిన స్క్రీన్‌వాల్స్ ద్వారా పర్యవేక్షిస్తుంటారు. బ్లాక్‌స్పాట్‌లుగా గుర్తించిన ప్రదేశాల్లో పరిస్థితి ఎలా ఉంది. రహదారులు, కాలువల్లో చెత్త వేస్తున్నారా..? చెత్తకుప్పలు ఎక్కడ ఉన్నాయి అనేవి చూస్తారు. అలాగే పట్టణంలో భవన నిర్మాణాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి. అనుమతి తీసుకుని నిర్మిస్తున్నారా..? లేదా తదితర విషయాలను పరిశీలించనున్నారు. వీటితో మ్యాపింగ్ ప్రక్రియను కూడా నిర్వహించనున్నారు. డ్రోన్ ద్వారా తీసిన వీడియోలను పరిశీలించి అక్కడ నుంచి అధికారులు పారిశుద్ధ్య ంపై సూచనలు, ఆదేశాలు జారీ చేస్తారు. ఈ విధంగా పట్టణాలను పరిశుభ్రంగా మార్చేందుకు ఉపకరిస్తుంది.
బ్లాక్‌స్పాట్‌ల నిర్మూలనలో ఫలితం..
మున్సిపాలిటీల్లో తరుచూ రోడ్డు పక్కన చెత్త పేరుకుపోయి కనిపిస్తే ఆ ప్రదేశాలను బ్లాక్‌స్పాట్‌లుగా గుర్తిస్తారు. ఇలా గుర్తించిన స్థలాలను చరవాణీలో ప్రతీ రోజు ఫొటోలు తీసి సిబ్బంది పంపించాల్సి ఉంటుంది. జీపీఎస్ విధానంతో ఫొటోలు అమరావతికి చేరుతాయి. బ్లాక్‌స్పాట్‌గా గుర్తించిన స్థలంలో 30 రోజులు పరిశీలించి చెత్త లేని ప్రాంతాన్ని గ్రీ¯న్ స్పాట్‌గా గుర్తిస్తారు. జిల్లాలో ప్రతీ మున్సిపాలిటీలో బ్లాక్‌స్పాట్‌లు గుర్తించారు. విజయనగరం మున్సిపాలిటీలో గతంలో 212 వరకు ఉండగా, ప్రస్తుతం 167 వరకు బ్లాక్‌స్పాట్‌లు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. పలుచోట్ల పారిశుద్ధ్య పనులు చేస్తుంటే ఏ విధంగా జరుగుతున్నాయో అమరావతిలో ఉన్న అధికారులు స్పాంటేనియా యాప్ ద్వారా వీడియోను నేరుగా చూసేలా ఏర్పాట్లు చేశారు. జీఓ 279 అమలులోకి వచ్చాక ఇంటింటీకి చెత్త సేకరణపైన సాంకేతికతను వినియోగిస్తుంది. చెత్త సేకరించిన ప్రతీ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన లేబుల్‌ను స్కాన్ చేయాలి. స్కాన్ చేస్తేనే ఆ రోజు వారు చెత్త ఇచ్చినట్లు లెక్క. పారిశుద్ధ్యంలో సాంకేతికతను తీసుకురావడం ద్వారా స్వచ్ఛత సాధనకు చర్యలు చేపడుతున్నారు. ఏ మేరకు ఫలితాలు సాధిస్తారన్నది వేచి చూడాల్సిందే.
బ్లాక్ స్పాట్‌ల నిర్మూలనకు బాగుంటుంది..
మున్సిపాలిటీలో పారిశుద్ధ్యంపై స్థానిక అధికారుల పర్యవేక్షణ మాత్రమే ఉండేది. స్వచ్ఛభారత్ అమలుతో మార్పులు వచ్చాయి. ప్రతీ మున్సిపాలిటీలో రాష్ట్రస్థాయిలో అధికారులు పర్యవేక్షించే పరిస్థితి వచ్చింది. బ్లాక్‌స్పాట్స్ నిర్మూలన కార్యక్రమం కొనసాగుతుంది. గతంలో 212 వరకు డ్రోన్లు ఉండగా, ఇటీవల వాటి సంఖ్య 167కు తగ్గింది. చాలా వరకు బ్లాక్‌స్పాట్‌లను గ్రీన్ స్పాట్‌లుగా మార్పు చేశాం. పారిశుద్ధ్య నిర్వహణలో లోపాల పర్యవేక్షణకు డ్రోన్ కెమెరాలు ఉపయోగిస్తే మరింత మంచి ఫలితాలు సాధించవచ్చు. – వెంకట్, మున్సిపల్ ఎన్విరాన్‌మెంట్ ఇంజినీర్.
Comments
Please login to add a commentAdd a comment