సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లాలో ప్రతీ గ్రామం, వార్డు ఇక నుంచి పచ్చని చెట్లతో కళకళలాడనుంది. ఏ ఇంటి ముందు కూడా చెత్తకుప్పలు ఇక మీదట కన్పించవు. ప్రతీ ఇంటికీ వ్యక్తిగత మరుగుదొడ్డి ఏర్పాటుకానుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన స్మార్ట్ విలేజ్/వార్డు కార్యక్రమం అమలు తీరుపై జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 18వ తేదీన డిప్యూటీ సీఎం, రెవెన్యూశాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి అధికారికంగా ప్రారంభించనున్నారు. తహశీల్దార్లు, ఎంపీడీవోలతో శనివారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
కోటి మొక్కలు నాటేందుకు ప్రణాళిక!
జిల్లాలోని అన్ని గ్రామాలు, వార్డుల్లో ఏకంగా 9,951 ఎకరాల్లో 99,33,112 మొక్కలను నాటాలనేది లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. మొక్కలు నాటడంపై ఫిబ్రవరి మొదటి వారంలో జిల్లా పరిషత్ తీర్మానం చేసి, పరిపాలన అనుమతి ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి రెండో వారంలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించి.. మార్చి నెలాఖరునాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేసింది.
ప్రతీ ఇంటికీ మరుగుదొడ్డి
స్మార్ట్ విలేజీ/వార్డు కార్యక్రమం కింద ప్రతీ కుటుంబానికి వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యం. జిల్లావ్యాప్తంగా వ్యక్తిగత మరుగుదొడ్డి లేని కుటుంబాల వివరాలను జన్మభూమి- మా ఊరు కార్యక్రమం సందర్భంగా జిల్లా యంత్రాంగం సేకరించింది. జిల్లావ్యాప్తంగా మొత్తం 44,832 వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించాల్సి ఉందని లెక్క తేల్చి, నిర్మాణానికి జిల్లా అధికార యంత్రాంగం అనుమతి మంజూరు చేసింది. వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి మొత్తం రూ. 12 వేల మేరకు మంజూరు చేస్తున్నారు. ఇందులో కేంద్రం రూ.9 వేలు కాగా... రాష్ట్ర ప్రభుత్వం రూ. 3 వేలు భరిస్తోంది.
భారీగా డంపింగ్‌యార్డులు
స్మార్ట్ విలేజ్/ గ్రామంలో భాగంగా ఎక్కడపడితే అక్కడ చెత్త ఉండకుండా, జిల్లావ్యాప్తంగా 898 డంపింగ్‌యార్డులను ఏర్పాటు చేయాల్సి ఉందని అధికారులు లెక్కలు తేల్చారు. ఇందులో అత్యధికంగా ఆదోనిలో 37, కర్నూలు, పాణ్యంలో చెరో 26, కౌతాళంలో 23, రుద్రవరం, ఓర్వకల్లు, నంద్యాలలో చెరో 20 చొప్పున, ఉయ్యాలవాడలో 17, అవుకులో 19.. ఇలా జిల్లావ్యాప్తంగా డంపింగ్ యార్డులను ఏర్పాటు చేయాల్సి ఉందని గుర్తించారు.
ప్రతీ ఇంటి నుంచీ చెత్త సేకరణ...
స్మార్టు వార్డు కార్యక్రమంలో భాగంగా కర్నూలు మునిసిపాలిటీ పరిధిలో అన్ని వార్డుల్లోనూ ప్రతీ ఇంటి నుంచి చెత్తను సేకరించేందుకు మునిసిపల్ యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇందుకోసం ఇప్పటికే అవసరమైన పరికరాల కోసం టెండర్లను కూడా పిలిచారు. ప్రస్తుతం జిల్లాలో సుమారు 450 గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం లేదు. ప్రతీ వర్షపు బొట్టును కాపాడుకునేందుకు వీలుగా వాటర్ హార్వెస్టింగ్ అండ్ కన్జర్వేషన్ కింద జిల్లావ్యాప్తంగా 8174 ఇంకుడు గుంతలు, నీటికుంటలు, చెక్‌డ్యామ్‌లను చేపడతారు. దీనితో పాటు పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకు ఖాతాలు లేవు. వీరందరికీ కూడా స్టార్ట్ విలేజ్/ వార్డు కింద బ్యాంకు ఖాతాలను ఏర్పాటు చేయనున్నారు.
వెంటనే కార్యాచరణ ప్రారంభం
స్మార్ట్ విలేజ్/ వార్డు కార్యక్రమాన్ని ఈ నెల 18వ తేదీన ప్రారంభిస్తాం. అయితే, ఎక్కడ అనేది ఇంకా నిర్ణయం కాలేదు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం. ఈ కార్యక్రమం కింద డంపింగ్ యార్డుల ఏర్పాటు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వంటి పనులు వెంటనే మొదలు పెడతాం. మూడు నెలల్లో కోటి మొక్కట నాటే కార్యక్రమం కూడా పూర్తి చేస్తాం. అయితే, వీటిపై శనివారం ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వస్తాయని భావిస్తున్నాం.
- సీహెచ్. విజయమోహన్, జిల్లా కలెక్టర్
‘స్మార్ట్’గా గ్రామాల అభివృద్ధి!
Published Sat, Jan 17 2015 3:24 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement
Advertisement