
కాటేసిన పాముతోనే హాస్పిటల్‌కు..!
చిత్తూరు : పాము కాటేస్తే ఏం చేస్తాం? ఉరుకులు పరుగులతో బాధితుడిని హాస్పిటల్‌కు తీసుకెళ్తాం. కానీ ఓ నాగుపాము కాటుకు గురైన వ్యక్తి ఏకంగా ఆ పామునే ఒడిసి పట్టుకుని చికిత్స కోసం అర్ధరాత్రి వేళ హాస్పిటల్‌కు రావడంతో వైద్యసిబ్బంది హడలిపోయారు. నాలుగైదు అడుగుల పొడవున్న ఆ నాగును చూసేసరికి వైద్యసిబ్బంది గుండెలు జారిపోయాయి. భయం..భయంగానే అతడికి వైద్యం చేశారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం వేరే ఆస్పత్రికి వెళ్లాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం చిట్రెడ్డిపల్లెలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళఙతే.. మండలంలోని తెల్లనీళ్లపల్లెకు చెందిన రమణ (50) కూలిపనులతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అలాగే, ఇళ్లల్లో చొరబడిన పాములను పట్టి దూరంగా వదిలేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి 11.45 గంటల సమయంలో చిట్రెడ్డిపల్లెకు చెందిన రామకృష్ణ తమ ఇంటిలో నాగుపాము చొరబడిందని, దానిని పట్టాలంటూ రమణను తీసుకెళ్లాడు. పామును పట్టే క్రమంలో రమణ దాని కాటుకు గురయ్యాడు. అయినప్పటికీ అతను అధైర్యం పడలేదు. పాము తలను ఎడమచేతితో బలంగా అదిమి పట్టడంతో అది బలంగా చేతిని చుట్టుకుంది.
మోటార్ సైకిల్‌లో రెండు కిలోమీటర్ల దూరంలోని చౌడేపల్లె ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే అర్ధరాత్రి దాటింది. పామును ఒడిసిపట్టుకుని వచ్చిన రమణను చూసి డ్యూటీ నర్స్ అరుణ హడలిపోయి పరుగులు తీశారు. చివరకు భయపడుతూనే అరుణ అతడికి పాము విరుగుడుకు ఇంజెక్షన్ వేశారు. ఆ తర్వాత పామును రమణ చంపేశాడు.
ఆపై108లో పుంగనూరుకు చేరుకున్నాడు. అక్కడి నుంచి 45 కిలోమీటర్ల దూరంలో పాము కాటు చికిత్సకు పేరున్న శివాడికి ప్రైవేటు వాహనంలో రమణను రామకృష్ణ తరలించాడు. సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో అక్కడ నాటువైద్యం చేయించాడు. తాను ఇప్పటివరకు 300 పైచిలుకు పాములు పట్టానని, 15సార్లు పాముకు గురయ్యానని రమణ ‘సాక్షి’కి తెలిపాడు.