ఈ చిత్రంలో కనిస్తున్న వ్యక్తి పేరు మహ్మద్ అలీ. మచిలీపట్నంలోని 29వ వార్డు శివారు నూరినగర్ నివాసి. ప్రమాదవశాత్తు ఒక కాలు కోల్పోయాడు. ప్రస్తుతం చంక కర్రల సాయంతోనే నడవగలడు. ఎక్కడికైనా వెళ్లాలంటే మూడు చక్రాల సైకిలే ఆధారం. 2013 నవంబరు నుంచి వస్తున్న వికలాంగుల పింఛనును ఇటీవలి సర్వేలో నిలిపివేశారు. అప్పటినుంచీ అధికారుల చుట్టూ తిరుగుతున్నా భరోసా ఇచ్చే నాథుడే కనిపించడం లేదు.
ఈమె పేరు వల్లూరి వెంకటరత్నమ్మ. బందరు మండలం శ్రీనివాసనగర్ నివాసి. వయస్సు 90 సంవత్సరాలు. గత ఏడేళ్లుగా వృద్ధాప్య పింఛను తీసుకుంటోంది. గత నెల పింఛన్ల జాబితాలో ఆమె పేరు తొలగించారు. ఈ వయసులో తనకు పింఛను తొలగించడంపై స్థానిక పెద్దల వద్ద గోడు వెళ్లబోసుకుంది. వాళ్లు వస్తుందని చెప్పడమే తప్ప ఇప్పటివరకు ఇవ్వలేదని ఆమె వాపోతోంది.
ఈమె పేరు అమ్మనాతి బేగం. మచిలీపట్నం 29వ వార్డు నివాసి. గత ఏడేళ్లుగా వితంతు పింఛను తీసుకుంటోంది. ఇటీవలి సర్వేలో ఆమె పేరును పింఛృు జాబితా నుంచి తొలగించారు. అనారోగ్యంతో బాధపడుతున్న తనకు పింఛను సొమ్ము మందులకు ఉపయోగపడేదని, దానిని నిలిపివేయడంతో ఇప్పుడు ఇక్కట్ల పాలవుతున్నానని కన్నీటి పర్యంతమవుతోంది. అధికారులకు తన గోడు చెప్పుకొన్నా పింఛను సొమ్ము ఇంకా చేతికందలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది.
...ఇలాపింఛన్లు రద్దయి.. ఆసరా కోల్పోయి.. దిక్కుతోచని స్థితిలో ఉన్నవారు జిల్లా వ్యాప్తంగా వేలాదిమంది ఉన్నారు. అందరూ తమకు నిలిపివేసిన పింఛన్లు ఇప్పించాలని వేడుకుంటున్నారు. పింఛన్ల కోసం కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు.
పండుటాకులకు కష్టం వచ్చి పడింది. ముదిమి వయసులో ఆసరాగా ఉన్న పింఛను ఒక్కసారిగా రద్దవడంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో, ఎవరిని సంప్రదించాలో తెలియక ఇక్కట్ల పాలవుతున్నారు. పింఛను సొమ్ము ఐదు రెట్లు పెంచి ఇస్తున్నామని ఆర్భాటంగా ప్రకటించిన పాలకులు అన్ని అర్హతలూ ఉన్న తమకు వస్తున్న సొమ్ము కూడా రద్దు చేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అధికారులను, స్థానిక ప్రజాప్రతినిధులను కలిసి తిరిగి పింఛను ఇప్పించాలని కోరుతున్నా ఇదిగో అదిగో అనడమే తప్ప స్పష్టమైన హామీ ఇవ్వడం లేదు. పింఛన్ల సర్వే పేరుతో గ్రామ, వార్డు కమిటీల సభ్యులు తీసుకున్న నిర్ణయాలు పలువురికి చేటు తెచ్చి పెట్టాయి. నెలనెలా వచ్చే పింఛను రాకుండా చేశాయి. జిల్లాలో 3.13 లక్షల మందికి వివిధ రకాల పింఛన్లు ఆగస్టు వరకు అందాయి. సెప్టెంబరులో చేపట్టిన సర్వే కారణంగా ఈ సంఖ్యను 2.77 లక్షలకు కుదించారు. 16 వేల మందిని అనర్హులుగా గుర్తించి వారి పింఛన్లు రద్దు చేశారు. మిగిలిన 34 వేల మంది వివరాలు సక్రమంగా లేవని, ఆధార్ నంబరు సమర్పించలేదని పింఛను నిలిపివేశారు. సెప్టెంబరు నెల పింఛను సొమ్మును నవంబరు 12 వరకు అందజేశారు. అక్టోబరు నెలకు సంబంధించి పింఛన్ల జాబితాలను తయారు చేశామని డీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి పింఛన్లు అందజేయాలని ఇంకా ఉత్తర్వులు రాలేదని పేర్కొంటున్నారు. అర్హత ఉండి పింఛను రద్దయిన వారి పూర్తిస్థాయి వివరాలు తమ వద్ద లేవని వారు స్పష్టం చేస్తున్నారు. అన్ని అర్హతలూ ఉండి పింఛను రద్దయిన వారు మున్సిపాలిటీ, మండల అధికారులను సంప్రదించాలని, వారు విచారణ చేసి పింఛను మంజూరు చేయవచ్చని పేర్కొంటున్నారు. ఇటీవల జరిగిన జన్మభూమిలో నూతనంగా పింఛన్లు మంజూరు చేయాలని కోరుతూ 42 వేల 220 దరఖాస్తులు వచ్చాయి. వీటిన్నింటినీ ఆన్‌లైన్‌లో పొందుపరిచి, అర్హులను నిర్ధారించి వారికి పింఛను మంజూరుకు ఎంత సమయం పడుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
- మచిలీపట్నం
పండుటాకులకు ఎన్ని కష్టాలో..
Published Fri, Nov 21 2014 1:07 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 PM
Advertisement