గిరిజన ఆవాసాల్లో పని చేస్తున్న సామాజిక ఆరోగ్య కార్యకర్తలు
ఎప్పటికైనా న్యాయం జరగకపోతుందా... తమ గోడు వినే నాథుడు రాకపోతాడా... తమ బతుకులు బాగుపడే రోజు రాకపోతుందా... అని పాతికేళ్లుగా ఎదురు చూసిన వారికి సరైన న్యాయమే జరిగింది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, గిరిజన శాఖ మంత్రి ప్రయత్నం ఫలించింది. ముఖ్యమంత్రి జగనన్న మనసు కరిగింది. పది రెట్లు వేతనం పెంచుతూ నిర్ణయం వెలువడటంతో ఆ చిరుద్యోగుల మోములో ఆనందం వెల్లివిరిసింది. ఇప్పటివరకూ కేవలం నాలుగు వందల వేతనానికి పనిచేస్తున్న గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తల వేతనం నాలుగు వేలకు పెరగడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
సాక్షి ప్రతినిధి. విజయనగరం: నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో నెలకు కేవలం 400 రూపాయలతో ఎవరూ పని చేయరు. కానీ వారు చేశారు. అది కూడా ఒకటి రెండు నెలలో, సంవత్సరాలో కాదు, ఏకంగా పాతికేళ్లుగా చేస్తూనే ఉన్నారు. ఎంతమందికి చెప్పుకున్నా వారి సమస్య పరిష్కారం కాలేదు. ఇక మా బతుకులింతే అని వారు ఆవేదన చెందుతున్న తరుణంలోనే ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి వారి దీనస్థితిని గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లారు. సీఎం సానుకూలంగా స్పందించడంతో వారి పాతికేళ్ల కష్టానికి తెరపడింది. రాష్ట్రంలో గిరిజనాభివృద్ధి కోసం ఐఎఫ్‌ఏడీ ఆధ్వర్యంలో 1995లో చేపట్టిన ప్రత్యేక ప్రాజెక్టులో భాగంగా ఐటీడీఏల పరిధిలోని గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో సామాజిక ఆరోగ్య కార్యకర్తలను ప్రభుత్వం నియమించింది. గిరిజన ఆవాసాలలో స్థానికంగా ఉండే గిరిజన మహిళలనే సామాజిక ఆరోగ్య కార్యకర్తలుగా నియమించారు.
ఆశా వర్కర్ల తరహాలోనే గిరిజన ఆవాసాల్లో ఉండే గిరిజనుల ఆరోగ్య స్థితిగతులను ప్రభుత్వానికి చేరవేయడం, ప్రభుత్వం ద్వారా వచ్చే ఆరోగ్య పథకాలను అమలు చేయడం, ప్రత్యేకించి పసిపిల్లలు, బాలింతల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం, అవసరమైన సర్వేలు చేయడం, గ్రామాల్లో పారిశుద్ధ్యం, వ్యక్తిగత శుభ్రతలపై అవగాహన కలిగించడం లాంటి పనులన్నింటినీ వారు చేస్తున్నారు. వారి ఎంపికలో విద్యార్హతలు, స్థానికతలకు సంబంధించిన రెండు తేడాలు మినహా, ఆశ వర్కర్లు చేసే పనులే వీరూ చేస్తున్నారు. కొండ కోనల్లో పని చేసే గిరిజనులు కావడం, వారి సమస్యలపై అధికారులు ఎవరూ స్పందించకపోవడంతో సుమారు రెండున్నర దశాబ్దాలుగా వారి బతుకులు మెరుగుపడలేదు. 1995లో వారిని ఆరోగ్య కార్యకర్తలుగా నియమించినప్పుడు రూ.300లు గౌరవ వేతనం ఇచ్చేవారు. తరువాత కేవలం వంద మాత్రమే పెంచారు. నెలకు రూ.400లతో బతకడం అసాధ్యం. కనిపించిన ప్రతి నాయకుడికీ తమ కష్టాన్ని చెప్పుకున్నా... వారి బతుకులు మారలేదు.
కదిలించిన ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి:
టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగిన ప్రస్తుత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఒక గిరిజనబిడ్డగా గతంలో కూడా గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తల వేతన సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించారు. ఆమె ప్రతిపక్ష పార్టీకి చెందిన శాసనసభ్యురాలు కావడంతో అప్పటి ప్రభుత్వం ఈమె విన్నపాన్ని పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే వై,ఎస్. జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, పుష్ప శ్రీవాణి ఉప ముఖ్యమంత్రి కావడం వారికి కలిసొచ్చింది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో ఆశ వర్కర్ల వేతనాలను రూ.3000 నుంచి రూ.10 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న తరుణంలో గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తల పరిస్థితిని పుష్ప శ్రీవాణి ముఖ్యమంత్రికి వివరించారు. వారి వేతనాలను కూడా పెంచాలంటూ సీఎంను కోరారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించడంతో అప్పటిదాకా ఎవరూ పట్టించుకోని గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తల వేతనాల పెంపునకు సంబంధించిన ప్రక్రియను అధికారులు ప్రారంభించారు.
నవంబర్ 27న జరిగిన కేబినెట్ సమావేశంలో వీరి వేతనాలను రూ.400ల నుంచి రూ.4000లకు పెంచారు. డిసెంబర్ నుంచే పెరిగిన వేతనాలు అందనున్నాయి. ఇంతవరకూ ఎవరూ తమ గోడు పట్టించుకోలేదని, తమ సేవలను వినియోగించుకోవడమే మినహా ఏ ప్రభుత్వమూ తమను ఆదుకోలేదని అయితే ప్రస్తుత ప్రభుత్వం తమ సేవలను గుర్తించి తమ వేతనాన్ని పది రెట్లు పెంచడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను పరిష్కరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికీ, ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి ధన్యవాదాలు చెబుతున్నారు.
గత ప్రభుత్వం నిర్లక్ష్యం
రాష్ట్రం మొత్తం మీద 7 ఐటీడీఏల పరిధిలో 2651 మంది గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తలు పని చేస్తుండగా వీరిలో సీతంపేట ఐటీడీఏ పరిధిలో 498 మంది, పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 1184 మంది, పాడేరు ఐటీడీఏ పరిధిలో 752 మంది, చింతూరు ఐటీడీఏ పరిధిలో 40 మంది, కేఆర్ పురం ఐటీడీఏ పరిధిలో 14 మంది, శ్రీశైలం ఐటీడీఏ పరిధిలో 163 మంది పని చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆశవర్కర్లకు సంబంధించిన వేతనాలను రూ.1000 నుంచి రూ.3 వేలకు పెంచారు. అదే సమయంలో గిరిజన ఐటీడీఏ ప్రాంతాల్లో ఆశ వర్కర్ల తరహాలోనే పని చేస్తున్న వీరి వేతనాలు మాత్రం పెంచలేదు. దీనిపై వారు ఆందోళన చేసినా ఎవరూ పట్టించుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment