చీపురుపల్లిలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న నాయకులు
ఎట్టకేలకు వారి కష్టాలు తీరనున్నాయి. ఎన్నాళ్లుగానో ఎదురు చూసిన సమయం రానే వచ్చింది. వారి శ్రమ ఫలించింది. నమ్మకమైన నాయకుడి చలువతో వారి డబ్బు తిరిగి సొంతం కానుంది. రూ. పదివేల లోపు డిపాజిట్ చేసిన అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారులకు చెల్లించేనిమిత్తం నిధులు విడుదలయ్యాయి. ఇప్పుడు ఆ కుటుంబాల్లో నిజమైన దీపావళి వచ్చినట్టయింది.
విజయనగరం పూల్‌బాగ్: అగ్రిగోల్డ్ బాధితులకు ఎన్నికల ముందు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీని ముఖ్యమంత్రిగా ఇప్పుడు నెరవేరుస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.36,97,96,900లు విడుదల చేస్తూ ప్రభుత్వం శుక్రవారం పరిపాలనా పరమైన అనుమతి ఇచ్చింది. ఈ మొత్తాన్ని జిల్లాలోని 34 మండలాల్లో ఉన్న రూ.10వేలు లోపు డిపాజిట్టు కలిగిన 57,941 మందికి పంపిణీ చేయనున్నారు. రూ.20వేల వరకూ డిపాజిట్ చేసినవారికి రావాల్సిన మొత్తం అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అగ్రిగోల్డ్ బాధితులకు రూ.1150 కోట్లు కేటాయించి అందులో తొలి విడతగా శుక్రవారం రూ.264.99 కోట్లు విడుదల చేశారు. దీనిపై అగ్రిగోల్డ్ బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మోసపోయిన తమను దేవుడిలా జగన్ ఆదుకున్నారని వారంతా సంబరపడుతున్నారు. నాటి ప్రభుత్వ నిర్వాకంతో దాచుకున్న డబ్బులు రావనే భయంలో జిల్లా వ్యాప్తంగా 16 మంది బాధితులు చనిపోయారు. ఐదేళ్లపాటు బాధితులు ఎన్నో పోరాటాలు చేశారు. అప్పటినుంచీ వీరికి వైఎస్సార్‌సీపీ బాసటగా నిలిచింది. జిల్లా వ్యాప్తంగా 1,08,470 మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. వీరు సుమారుగా రూ.765 కోట్లు డిపాజిట్ చేశారు. అందులో రూ.10వేలు లోపు డిపాజిట్ ఉన్న ఖాతాలకు తొలివిడతగా చెల్లిస్తామని చెప్పడం ద్వారా 57,941 మందికి లబ్ధి చేకూరనుంది.
చీపురుపల్లి: అగ్రిగోల్డ్ బాధితులకు తొలి విడతలో రూ.260 కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ఎంతో రుణపడి ఉంటామని అగ్రిగోల్డ్ డిపాజిట్ దారులు తెలిపారు. అగ్రిగోల్డ్‌లో రూ.10 వేలు లోపు డిపాజిట్‌దారులకు చెల్లించేలా సీఎం నిధులు విడుదల చేయడాన్ని స్వాగతిస్తూ స్థానిక మేజర్ పంచాయతీ కార్యాలయం వద్ద శనివారం సాయంత్రం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల పార్టీ నాయకులు ఇప్పిలి అనంతం మాట్లాడుతూ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అగ్రిగోల్డ్ బాధితులకు తొలివిడతలో చెల్లించేలా నిధులు విడుదల చేశారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబునాయుడు ఐదేళ్లు అగ్రిగోల్డ్ బాధితులను మోసం చేశారు తప్ప న్యాయం చేయలేదన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, ఇప్పిలి తిరుమల, పతివాడ రాజారావు, మల్లెంపూడి శ్రీను, అప్పికొండ ఆదిబాబు, బి.టి.ఆర్ యాదవ్, కుప్పిలి సురేష్, మహంతి రవి, సతివాడ అప్పారావు, కింతలి మధు తదితరులు పాల్గొన్నారు.
ఫలించిన పోరాటం..
రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులకు రూ.10వేలలోపు డిపాజిట్ చేసిన వారికి చెల్లించేలా తొలివిడతగా రాష్ట్ర ప్రభుత్వం రూ.265 కోట్లు విడుదల చేయడం హర్షణీయం. నాలుగున్నరేళ్లుగా అవిశ్రాంత పోరాట పలితమే ఇది. బాధితులకు న్యాయం చేసేందుకు కృషి చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. మిగిలిన బాధితులందరికీ సత్వరమే చెల్లించేలా చూడాలి.
– పి కామేశ్వరరావు, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్ ,ఉత్తరాంధ్ర గౌరవాధ్యక్షుడు.
ఆనందంగా ఉంది..
ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మేనిఫెస్టోలో పేర్కొన్నట్టే రూ.10వేల లోపు డిపాజిట్‌దారులందరికీ జిల్లా కలక్టర్ ద్వారా పంపిణీ చేయటానికి ఉత్తర్వులు జారీ చేయటం హర్షణీయం. డబ్బులు విడుదల చేసిన ముఖ్యమంత్రికి, మంత్రి బొత్స సత్యనారాయణకు, జిల్లా అగ్రిగోల్డ్ కస్టమర్స్, అండ్ ఏజెంట్స్ అసోసియేషన్, బాధితుల బాసట కమిటీ తరఫున ధన్యవాదాలు. ప్రతి బాధితుడికీ న్యాయం చేయాలని కోరుతున్నాను.
– మజ్జి సూరప్పడు, అగ్రిగోల్డ్ బాసట కమిటీ, విజయనగరం పార్లమెంటు నియోజకవర్గం.
కనీసం స్పందించని గత ప్రభుత్వం..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఐదేళ్లుగా ఎన్నో పోరాటాలు చేశాం. అయినా గత టీడీపీ ప్రభుత్వం కనీసం స్పందించలేదు. అప్పటికే చాలా మంది బాధితులు చనిపోయారు. ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ముదావహం.
– మజ్జి బంగార్రాజు, అగ్రిగోల్డ్ ఏజెంట్, డెంకాడ మండలం, విజయనగరం.
Comments
Please login to add a commentAdd a comment