అతుక్కుపోతే అంతే | social media attract the teenagers | Sakshi
Sakshi News home page

అతుక్కుపోతే అంతే

Published Sat, Dec 20 2014 3:22 AM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM

అతుక్కుపోతే అంతే - Sakshi

అతుక్కుపోతే అంతే

- అంతర్జాలంతో నిండా ప్రయోజనాలే
- మితిమీరితే అదో విష వలయం
- లైక్స్, కామెంట్స్ కోసం పరితపిస్తే మానసిక సమస్యలు తప్పవ్

 ఏలూరు సిటీ/ఏలూరు (వన్‌టౌన్)/ఏలూరు (బిర్లాభవన్ సెంటర్) : ‘వాట్ బ్రో. ఎఫ్‌బీలో పోస్టింగ్ చూశా. అదిరిందిలే..’ ఫేస్‌బుక్‌లో మిత్రుడి నుంచి వచ్చిన కామెంట్ ఇది. ఆ మరుక్షణమే ‘ఎస్ డ్యూడ్. మూడురోజుల టూర్‌ను ఎంజాయ్ చేశా’నంటూ అటువైపు నుంచి సమాధానం. ‘ఏంట్రా.. ఈ మధ్య బయటకు రావడం మానేశావ్’ అని అడిగితే.. ‘ఆ.. ఏముంది వీడెప్పుడూ సోషల్ మీడియూలోనే మునిగి తేలుతున్నాడ’ంటూ సెటైర్లూ వినిపిస్తున్నారు. ఏ సమాచారం పంచుకోవాలన్నా వాట్స్ యాప్, ట్విట్టర్, ఫేస్‌బుక్, వుయ్‌చాట్ ఇలా ఏదో దానిలో కలుద్దామనే ధ్యాసలోనే ఉంటోంది యువత. ఫేస్‌బుక్‌లో కామెంట్లు, లైక్‌లు, పోస్టింగ్‌లతో రోజులో సగానికిపైగా కాలాన్ని వెచ్చించే పరిస్థితులు వచ్చాయి. ప్రతి చిన్న పనినీ సోషల్ మీడియాలో చూపించేందుకే యువత తాపత్రయపడుతోంది. తమ పిల్లలు చాటింగ్‌లు చేస్తుంటే అదేమిటో తెలియక.. ఇబ్బందులు పడతారనే ఆందోళనతో సతమతమవుతున్నారు వారి తల్లిదండ్రులు. ఈ పరిస్థితులపై నేటి యువత, నిపుణులు ఏమంటున్నారంటే...
 
జాగ్రత్తలు పాటించాలి
సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎక్కువగా ఉందనే చెప్పాలి. ప్రొఫెషనల్ కోర్సులు చేసే విద్యార్థులకు ఇంటర్నెట్‌తో చాలా ఉపయోగం ఉంది. స్టడీ మెటీరియల్ కావాలన్నా.. తెలియని విషయాలు తెలుసుకోవాలన్నా ఇంటర్నెట్ వినియోగించాలి. కానీ సోషల్ మీడియా వినియోగించే వారు జాగ్రత్తలు పాటించాల్సి ఉంది. లేకుంటే సమస్యలు తప్పవు.
- కల్యాణి, స్టూడెంట్
 
వ్యసనం కాకూడదు
 సోషల్ మీడియాను వినోదం కోసం వినియోగించటంలో తప్పులేదు. నేడు ఎక్కువమంది ఎక్కువ సమయం సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు. అవసరం ఉన్నంత మేరకే ఉపయోగిస్తే ఏ విధమైన సమస్యా ఉండదు. చాలామందికి సోషల్ మీడియా వ్యసనంలా మారింది. అది వారికి, వారి కుటుంబానికి, సమాజానికి కూడా మంచిది కాదు.
- శ్రావణ జ్యోతి, స్టూడెంట్
 
యువతులకు ఇబ్బందులు
సోషల్ మీడియా పెడదారి పట్టడం కారణంగా యువతులు నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. విద్య, సమాచారం కోసం మాత్రమే ఇంటర్నెట్‌ను వినియోగిస్తే మంచిది. పరిమితులు లేకుండా సోషల్ మీడియాలో చొచ్చుకుపోతే యువతులకు ఇబ్బందులు తప్పవు. మితిమీరి దేనినీ వినియోగించకూడదు. మంచి విషయాలపై ఎప్పుడూ స్పందించాలి.   - వల్లి, స్టూడెంట్
 
అవసరం మేరకు ఉపయోగించుకోవాలి
బంధువులు, స్నేహితులు దూరంగా ఉన్నారనే భావన ఉండకుండా ఎఫ్‌బీ, వాట్స్‌యాప్ ఉపయోగపడుతున్నాయి. అయితే సోషల్ మీడియాను అవసరానికి మించి వాడటం కూడా తప్పే. మనకు అందివచ్చిన అవకాశాలను అవసరం మేరకు మాత్రమే ఉపయోగించుకుంటే లాభం ఉంటుంది.
- బి.పూజిత, స్టూడెంట్
 
వరంగా భావించాలి కానీ..
పూర్వ ఒక సమాచారాన్ని చేరవేయాలంటే ఎన్నో రోజులు పట్టేది. ఇతర దేశాల్లోని బంధువులు ఎలా ఉన్నారో తెలుసుకోవాలన్నా చాలా కష్టంగా ఉండేది. చాలా డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చేది. ఆధునిక కాలంలో సాంకేతిక పరిజ్ఞానంతో సోషల్ మీడియా అందుబాటులోకి రావటం వరంలా భావించాలి. కానీ.. అవసరం మేరకే వినియోగించుకోవలి.
- వై.రామన్, స్టూడెంట్
 
మంచిచెడుల కలయిక
సమాజంలో మంచి, చెడూ రెండూ ఉంటాయి. యువత మంచిని తీసుకుని చెడును విస్మరిస్తే బాగుంటుంది. తల్లి.. తండ్రి.. గురువు.. దైవం ఇలా పూర్వీకులు పాటించిన సంప్రదాయాలను అనుసరిస్తే ఏదిచేసినా మంచిదే. సోషల్ మీడియాతో చెడు ఉన్నా.. మంచి చాలానే ఉంది. అందుకే యువత సోషల్ మీడియాను మంచికే వినియోగించాలని నా సూచన. - వారణాశి సౌమ్య, స్టూడెంట్
 
సెల్ఫ్ కంట్రోల్ తప్పుతుంది
నేటి యువత ఇంటర్నెట్‌ను అధికంగా వినియోగిస్తోంది. ఎక్కువ సమయూన్ని చాటింగ్, పోస్టింగ్స్‌తోనే గడపటం వల్ల యువతో ఆత్మ నిగ్రహం (సెల్ఫ్ కంట్రోల్) తప్పుతోంది. విలువైన సమయం వృథా అవుతోంది. ఇంటర్నెట్‌ను మితిమీరి వాడటం వల్ల సహజంగానే చికాకు, ఆగ్రహం కలుగుతారుు. క్రోధం పెరిగిపోతుంది. ఇంట్లో తల్లిదండ్రుల్ని, తరగతి గదుల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకులను లక్ష్యపెట్టే పరిస్థితి ఉండటం లేదు. అవసరం లేని విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ అవసరమైన వాటిని తేలిగ్గా తీసుకోవటం చేస్తున్నారు. తప్పొప్పులు తెలియని 13నుంచి 19 ఏళ్ల వయస్కుల జీవితాలపై జీవితాలపై చెడు ప్రభావం చూపుతోంది. పరీక్షల్లో వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆత్మహత్యలూ పెరిగిపోతున్నాయి.         
-  డాక్టర్ సీహెచ్ వంశీకృష్ణ, మానసిక వైద్య నిపుణులు
 
మెదడు, నరాలపై తీవ్ర ప్రభావం
కంప్యూటర్, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ల వినియోగంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంది. వాటినుంచే వచ్చే కిరణాలు కంటిచూపుపై ప్రభావం చూపిస్తాయి. పైగా ఎక్కువ సమయం వాటిపై దృష్టి కేంద్రీకరించటం వల్ల మెదడుపై దుష్ర్పభావం పడుతుంది. మెదడు మొద్దుబారే ప్రమాదమూ ఉంది. సోషల్ మీడియాకు బానిసలుగా మారటంతో చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. అందువల్ల యువతే కాదు ఎవరైనా సరే ఇంటర్నెట్‌కు అతుక్కుపోకుండా అవసరం మేరకే వినియోగించడం మంచిది.
- బోగరాజు ప్రసాద్, కంప్యూటర్ నిపుణులు
 
ప్రమాదాలూ ఉంటాయి
నెటిజన్ల విషయంలో చేసిన అధ్యయనాలను పరిశీలిస్తే.. మద్యం, మత్తు పదార్థాలకు బానిసలైన వారి తర్వాత స్థానంలో నెటిజన్లు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. సోషల్ మీడియా ఓ వ్యసనంలా మారిపోవటంతో యువత పెడదారిలో పయనిస్తోందనేది నిపుణులు అభిప్రాయం. మెదడు, నరాలకు సంబంధించిన వ్యాధులకు ఇదే కారణమవు తోంది. ఎఫ్‌బీ, ట్విట్టర్, మైస్పేస్, వాట్స్‌యాప్, వుయ్ చాట్ వంటి సోషల్ సైట్లలో 80శాతం మంది యువత బిజీగా ఉంటున్నారని సర్వేలు చెబుతున్నాయి. సంఘవిద్రోహ శక్తులకూ ఈ సైట్లు ఆయుధాలుగా మారుతున్నాయి. కంప్యూటర్ కంటే ఎంతో శక్తివంతమైన మానవ మెదడు వీటి కారణంగా నిరుపయోగంగా మారి నిర్వీర్యం అయిపోతోంది. ఇక అశ్లీల సైట్ల ప్రభావంతో మహిళలు, యువతులపై అఘాయిత్యాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. మానవ మేధస్సుకు ప్రతీకలుగా నిలుస్తున్న ఈ సాంకేతిక పరిజ్ఞానం వారినే బలి కోరుతుందనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement