గుంటూరు(ఎస్‌వీఎన్ కాలనీ): డక్ స్మైల్‌తో సోషల్ మీడియా ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టింది ఓ యువతి. వెంటనే హాయ్, యుఆర్ లుకింగ్ సో క్యూట్ అంటూ ఓ రిప్‌లై మెసేజ్. తరువాత లైకుల మీద లైకులు. ఫేవరబుల్ కామెంట్లు. ఇంకేముంది, కాసేపలా లోలోపల ఉబ్బితబ్బిబైపోయి. ధ్యాంక్యూ అటూ రిప్‌లై, అలా మొదలైన పరిచయం ఏ కాఫీ షాపులో మీట్ అయ్యేందుకో ఒకే అనిపిస్తుంది. అవును ఆన్‌లైన్ పరిచయాలు ఆన్‌లైన్ చాటింగ్‌తోనే ఆగిపోవట్లేదు. నేరుగా కలిసే వరకూ వెళ్తున్నాయి.
అటు నుంచి మరో సంఘటలకు దారి తీస్తున్నాయి. నిండా పదహారేళ్లు కూడా లేని పిల్లలు సైతం ఇలాంటి పరిచయాలు వైపు మొగ్గు చూపడం ఇపుడు తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తున్న విషయం. ఇంటెల్ సెక్యూరిటీ, నాస్కామ్ పలు పట్టణాల్లో నిర్వహించిన టీన్స్ ట్వీన్స్ అండ్ టెక్నాలజీ స్టడీలో ఇలాంటి ఆసక్తికరమైన విషయాలెన్నో వెలుగుచూశాయి. 8–14 ఏళ్లలోపు చిన్నారులు ఫేస్‌బుక్‌లో అకౌంట్ నిర్వహిస్తున్నారంటే యువతరం సోషల్ మీడియాకు ఎంతగా ఎడిక్ట్ అయిందో అర్థం చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ పరిచయాలు..
19 ఏళ్లలోపు చిన్నారులు సోషల్ మీడియా వినియోగించకూడదే నిబంధనలున్నా ఎవరూ ఖాతరు చేయడం లేదు. సోషల్ మీడియాలో 8 నుంచి 18 ఏళ్లలోపు బాలబాలికలు యాక్టివ్ కనిపిస్తున్నారు. 37 శాతం మందికిపైగా ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తుల్ని నేరుగా కలుసుకుంటున్నట్లు ఇంటెల్ సెక్యూరిటీ స్టడీలో వెల్లడైంది. అంతేకాదు.. 57 శాతం మంది తెలిసీతెలియనితనంతో తమ వ్యక్తిగత విషయాలనే కాదు. కుటుంబ, ఆర్థిక వ్యవహారాల వివరాలను సైతం సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేస్తున్నారు. దీన్ని కొందరు క్యాష్ చేసుకుంటూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. గుంటూరులోని ఒక పేరొందిన పాఠశాలలో ఉన్నత వర్గానికి చెందిన ఒక బాలిక ఇదే తరహా మోసానికి గురకావడం ఇందుకు నిదర్శనం.
గుంటూరు, విజయవాడ నగరాల్లో ఇలా
72 శాతం మేరకు 8–15 ఏళ్లలోపు పిల్లలు ఆన్‌లైన్‌లో యాక్టివ్‌గా వ్యవహరిస్తున్నారు. 16–18 ఏళ్లలోపు యువత 20 శాతం చాటింగ్‌లకు సమయం కేటాయిస్తున్నారు. 19– 21 ఏళ్ల వరకు 8 శాతం మందిమాత్రమే ఫేస్‌బుక్, ఇతర సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా ఉంటున్నారు. వీరందరూ రోజులో 2 నుంచి 4 గంటలపాటు నెట్‌తోనే గడిపేస్తున్నారు. మొత్తంగా 8–21 ఏళ్ల వయసు వారిలో 68 శాతం మంది ఫేస్‌బుక్ అకౌంట్‌లు కలిగి ఉన్నారని అధ్యయనం చెబుతోంది. సామాజిక మాధ్యమాల్లో 57 శాతం మంది పిల్లలు వ్యక్తిగత సమాచారంతోపాటు, ఫోన్ నంబర్లు పొందుపరుస్తున్నారు.
35 శాతం మంది పిల్లలు ఆన్‌లైన్‌లో పరిచయమైన అపరిచితుల్ని వ్యక్తిగతంగా కలుస్తున్నారు. 55 శాతం మంది పిల్లలు తమ ఆన్‌లైన్ కార్యకలాపాలను తల్లిదండ్రుల కంటపడకుండా జాగ్రత్త పడుతున్నారు. 19 శాతం మంది పిల్లలకు కుటుంబసభ్యులతోపాటు, స్నేహితుల, ఇతరుల పాస్‌వర్డ్‌లు తెలుసు. వారిలో 68 శాతం మంది ఇతరుల అకౌంట్‌లను తెరుస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉన్న పిల్లల్లో 22 శాతం మంది సైబర్ వేధింపులకు గురయ్యారు. ఇందులో ఎక్కువగా ఆడపిల్లలే ఉంటున్నారని తెలుస్తోంది. 51 శాతం మంది పిల్లలు ఇతరుల పాస్‌వర్డ్‌లు తెలుసుకుంటున్నారు.
తల్లిదండ్రులు
70 శాతం మంది తల్లిదండ్రులు సోషల్ మీడియా పిల్లలపై దుష్ప్రభావాలు చూపుతోందని ఆందోళన చెందుతున్నారు. 88 శాతం మంది తల్లిదండ్రులు పిల్లల ఆన్‌లైన్ యాక్టివిటీ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కనబరుస్తున్నారు. యువతలో అధికంగా 25 శాతం మంది అపరిచితులతో సంభాషణ చేస్తున్నారని, 16 శాతం వ్యక్తిగత వివరాల వెల్లడిస్తున్నారని, 14 శాతం ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌కు గురయ్యారని, 12 శాతం సైబర్ బబ్లింగ్‌తో సతమతమయ్యారని అధ్యయనాలు తేటతెల్లం చేస్తున్నాయి.
బ్రౌజింగ్ వివరాలు కనిపించకుండా..
ఇంటర్నెట్ బ్రౌజింగ్ హిస్టరీని, వాట్సాప్, మెసెంజర్ చాటింగ్ డిటైల్స్‌ని తల్లిదండ్రులకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. కాగా తల్లిదండ్రులు తరచుగా వ్యక్తిగత వివరాల తస్కరణ, ప్రైవసీ సెట్టింగ్స్, సైబర్ బబ్లింగ్, ఆన్‌లైన్ గుర్తింపు వంటి విషయాలపై పిల్లలతో చర్చిస్తుండడం గమనార్హం. 4.4 శాతం బాలలు పాస్‌వర్డ్‌లను తల్లిదండ్రులతో పంచుకుంటున్నారు. వేధింపుల కారణంగా 51 శాతం పిల్లలు ఇతరులను సోషల్ మీడియాలో బ్లాక్ చేస్తున్నారు. 78 శాతం తల్లిదండ్రులు పిల్లల ఆన్‌లైన్ వినియోగాన్ని నియంత్రింగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రతికూలతలు
ఫేస్‌బుక్, టెలిగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్, వాట్సాప్, ఐఎంవో వీడియో కాలింగ్, ఆన్‌లైన్ షేర్, గూగుల్ ప్లస్ వంటి సామాజిక మాధ్యమాలు వ్యక్తులు, సమూహాల మధ్య సమాచార మార్పిడికి ఉద్దేశించినవే. ప్రస్తుతం వీటితో మేలు కంటే దష్ఫ్రరిణామాలే అధికంగా తొంగి చూస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు పాఠశాల స్థాయి విద్యార్థులు ఇంటికి రాగానే టీవీలో కార్టూన్ కార్యక్రమాలకు అతుక్కుపోయేవారు. కానీ ఇప్పుడు అరచేతిలో ప్రపంచాన్ని చూపుతున్న పీసీలు, ఇంటర్నెట్‌లకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. అప్‌లోడ్, డౌన్‌లోడ్‌లతో కాలం గడిపేస్తున్నారు. ఇంటెల్ సెక్యూరిటీ చేసిన సర్వేలో నగరంలో 72 శాతం మంది 8–18 ఏళ్లలోపు పిల్లలు ఆన్‌లైన్‌లో చురుకుగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. పిల్లలు సోషల్ మీడియాలో తమ వ్యక్తిగత సమాచారాన్ని (ఫోటోలు, ఫోన్ నంబర్లు వంటివి) పొందు పరుస్తున్నారు.
పిల్లలపై తీవ్ర ప్రభావం
సెల్‌ఫోన్‌లో సోషల్ నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చింది. నిండా పదేళ్లు కూడా నిండని చిన్నారులు సోషల్‌నెట్ వర్క్‌లతో బిజీ అవుతున్నారు. ఇది ఒకింత విజ్ఞాన ప్రపంచాన్ని చేరువ చేస్తున్నట్లు కనిపిస్తున్నా చిన్నారుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయి. పిల్లలను ఇతర వ్యాపకాల వైపు మళ్లిస్తే అన్‌లైన్ దుష్ప్రభావాల నుంచి కాపాడుకోవచ్చు.
– ఎన్ రాజ్యలక్ష్మి, మనస్తత్వ నిపుణులు, చేతన మనో వికాస కేంద్రం
Comments
Please login to add a commentAdd a comment