సమాజం కోసం పరితపించిన బసిరెడ్డి
జయంతి సభలో ఏపీ శాసనమండలి చైర్మన్ చక్రపాణి
కడప: స్వాతంత్య్ర సమరయోధుడు, రాజకీయ దురంధరుడు పెంచికల బసిరెడ్డి అసమానతలు లేని ఆదర్శ సమాజం కోసం కృషి చేశారని ఏపీ శాసనమండలి చైర్మన్ డాక్టర్ ఎ.చక్రపాణి అన్నారు. బసిరెడ్డి 105వ జయంత్యుత్సవం ఆదివారం వైఎస్సార్ జిల్లా కడప నగరంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చక్రపాణి.. మాట్లాడుతూ బసిరెడ్డి ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేసి ప్రజా సేవకే జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి బసిరెడ్డిపై రూపొందించిన ప్రత్యేక సంచికను విడుదల చేసి మాట్లాడారు.
బసిరెడ్డి స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహించే వారిని ప్రోత్సహిస్తూ ట్రస్టు ఏర్పాటు చేయాలని కోరారు. అందుకు తనవంతుగా రూ. లక్ష చెక్కును హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి. లక్ష్మణ్‌రెడ్డికి అందజేశారు. సభకు అధ్యక్షత వహించిన జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడుతూ నమ్మిన సిద్ధాంతం కోసం బసిరెడ్డి ఎవరినైనా ఎదిరించగలిగిన ధీశాలిగా పేరు గాంచారన్నారు. జిల్లాకు చెందిన డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి బసిరెడ్డితో గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. డాక్టర్ కేతు విశ్వనాథరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడినారాయణరెడ్డి, సతీష్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.