
సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అదృశ్యం
ఆఫీసుకు క్యాబ్‌లో వెళ్తున్నానంటూ భర్తకు మెసేజ్ పంపిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆ క్షణం నుంచి ఆచూకీ లేకుండా పోయింది.
రెండు రోజులు గడిచినా తేలని ఆచూకీ కేపీహెచ్‌బీలో ఘటన దర్యాప్తు చేస్తున్న పోలీసులు
హైదరాబాద్: ఆఫీసుకు క్యాబ్‌లో వెళ్తున్నానంటూ భర్తకు మెసేజ్ పంపిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆ క్షణం నుంచి ఆచూకీ లేకుండా పోయింది. రెండు రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఆమె జాడ తెలియరాలేదు. ఈ ఘటన గురువారం ఉదయం హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన మధు, హరిచందనల కుమార్తె భవ్యశ్రీచరిత(22) నగ రంలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. రెండేళ్ల కిందట పెద్దల అంగీకారంతో కొల్లిపార కార్తికేయచైతన్య (27)ను ప్రేమవివాహం చేసుకుంది. కార్తికేయ కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ప్రస్తుతం దంపతులిద్దరూ కేపీహెచ్‌బీ కాలనీ ఏడవ ఫేజ్‌లో నివాసం ఉంటున్నారు. కాగా, నాలుగు రోజులుగా ఆఫీసుకు వెళ్లని భవ్యశ్రీ గురువారం ఉదయం 9 గంటలకు ఆఫీసుకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయల్దేరింది. అయితే కంపెనీ క్యాబ్ రాకపోవడంతో ప్రైవేట్ క్యాబ్‌లో వెళ్తున్నానని భర్త చైతన్యకు మెసేజ్ పంపింది. గంట తరువాత ఆఫీసుకు చేరుకున్నావా.. అని చైతన్య తిరిగి భవ్యశ్రీకి మెసేజ్ చేశాడు. అయితే ఆమె నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.
తిరిగి రాత్రి 7 గంటలకు డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చిన చైతన్య.. తన భార్య ఇంకా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెంది ఆమెకు ఫోన్ చేశాడు. కానీ, ఆమె ఫోన్ స్విచ్‌ఆఫ్ అని రావడంతో భవ్యశ్రీ పనిచేస్తున్న కంపెనీ వద్దకు వెళ్లి వాకబు చేశాడు. అయితే భవ్యశ్రీ ఆఫీస్‌కు రాలేదని అక్కడి ఉద్యోగులు తెలిపారు. దీంతో బంధువులు,స్నేహితులను ఆరా తీశాడు. అయినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో గురువారం రాత్రి కేపీహెచ్‌బీ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. భవ్యశ్రీ ఆచూకీ కనిపెట్టేందుకు పోలీసుఅధికారులు ఐదు బృందాలను రంగంలోకి దింపారు.
ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు...
హైదరాబాద్‌లో భవ్యశ్రీ ప్రయాణించిన మార్గంలో సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పోలీసు లు పరిశీలిస్తున్నారు. అలాగే, ఆమె సెల్‌ఫోన్ ఆధారంగా ఎక్కడుందో గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. భవ్యశ్రీ చివరిసారిగా ‘క్యాబ్‌లో ఉన్నాను’ అంటూ భర్తకు మెసేజ్ చేసింది. ఆ తరువాత 30 నిమిషాలకే ఆమె సెల్‌ఫోన్ స్విచ్‌ఆఫ్ అయ్యింది. శుక్రవారం సాయంత్రం ఆమె ఫోన్ సిగ్నల్స్ అన్నవరం పరిసరాల్లోని సెల్‌టవర్ పరిధిని సూచించడంతో అక్కడి పోలీసులు అన్నవరంలో అన్ని లాడ్జీలు, దేవస్థాన వసతి గృహాల్లో తనిఖీ చేశారు. అయినా ఆమె ఆచూకీ తెలియరాలేదు. కాగా, భవ్యశ్రీ గోవాలో ఉన్నట్లు శుక్రవారం రాత్రి సమాచారం అందడంతో ఆ దిశగా కూడా పోలీసు లు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు రెండు రోజులైనా భవ్యశ్రీ ఆచూకీ లభించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆం దోళన చెందుతున్నారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు, మనస్పర్థలు లేవని ఆమె తల్లిదండ్రులు, భర్త చైతన్య మీడియాకు తెలిపారు.