బందరులో ముగిసిన అంత్యక్రియలు
అంతిమ యాత్రలో పాల్గొన్న విద్యార్థులు, నేతలు, మతపెద్దలు
కొనసాగుతున్న కేసు దర్యాప్తు
సాక్షి, మచిలీపట్నం: ముంబైలో దారుణ హత్యకు గురైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఎస్తేర్ అనూహ్య (23) అంత్యక్రియలు శనివారం మచిలీపట్నంలో ముగిశాయి. సెయింట్ మేరీస్ (అరబెల్ల) చర్చిలో ప్రార్థనల అనంతరం అనూహ్య మృతదేహాన్ని క్రైస్తవ సంప్రదాయ ప్రకారం ఖననం చేశారు. వివిధ పార్టీల నేతలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మత పెద్దలు అంతిమ యాత్రలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. అనూహ్య హంతకులకు ఉరిశిక్ష విధించాలని, ఆమె ఆచూకీ కనుగొనడంలో నిర్లక్ష్యం వహించిన ముంబై పోలీసులను అరెస్టు చేయాలని నినదించారు. ముంబై పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే తన బిడ్డ దక్కేదని అనూహ్య తండ్రి ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. హ–{దోగంతో బాధపడుతున్న అనూహ్య తల్లి జ్యోత్స్నను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు అనూహ్య కుటుంబీకులకు ఫోన్ చేసి తమ సంతాపం తెలిపారు. అనూహ్య ఘటనకు నిరసనగా శనివారం బందరులో నిర్వహించిన బంద్ ప్రశాంతంగా జరిగింది.
డీజీపీ ఆరా..: అనూహ్య కేసులో ముంబై పోలీసుల తీరుపై నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ ప్రసాదరావు.. శనివారం అక్కడి పోలీసుల నుంచి వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో అనూహ్యకు భోజనం ప్యాకెట్ ఇచ్చిన హేమంత్, సహోద్యోగి రాజశేఖర్‌లపై పోలీసులు దృష్టి సారించారు. ముంబై రైల్వే స్టేషన్‌లో దిగిన తర్వాత ఆమె ప్రయాణించిన మ్యాక్సి క్యాబ్ డ్రైవర్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నట్టు సమాచారం. ముంబైకి రైల్వే సీఐని పంపించినట్టు విజయవాడ రైల్వే ఎస్పీ శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. మరోవైపు అనూహ్య తల్లి నుంచి డీఎన్‌ఏ నమూనాలను సేకరించేందుకు ముంబై పోలీసులు రెండ్రోజుల్లో మచిలీపట్నం రానున్నారు.
అన్నింటా ఫస్ట్..: ప్రసాద్, జ్యోత్స్న దంపతులకు అనూహ్య, లావణ్య ఇద్దరు కూతుళ్లు. అనూహ్య ఆటపాటలు, చదువుల్లో ఎప్పుడూ ముందుండేది. చిన్న వయసులోనే ఉద్యోగం సంపాదించి, జీవితంలో స్థిరపడుతున్న సమయంలో హత్యకు గురి కావడం ఆ కుటుంబాన్ని కలచివేస్తోంది. అనూహ్య ఒకటి నుంచి 8వ తరగతి వరకు మచిలీపట్నంలోని షారన్ స్కూలులో చదివింది. 9, 10 తరగతులు శ్రీ అమరేశ్వరి విద్యానికేతన్‌లో చదివింది. ఇంటర్ మచిలీపట్నంలోని శ్రీచైతన్య కాలేజీలో చదివింది. ఎంసెట్‌లో మంచి ర్యాంక్ సాధించి కాకినాడ జేఎన్‌టీయూలో బీటెక్ పూర్తి చేసింది. ఇంజనీరింగ్ ఆఖరి ఏడాది చదువుతుండగానే క్యాంపస్ సెలక్షన్స్‌లో టీసీఎస్‌లో ఉద్యోగానికి ఎంపికైంది. ఉద్యోగ నిమిత్తం ఆరునెలల పాటు కేరళలో టీసీఎస్ కంపెనీ శిక్షణ ఇచ్చారు. తన కూతురు కొత్త ప్రాంతంలో ఉద్యోగ శిక్షణకు ఇబ్బంది పడుతుందని భావించిన తండ్రి ప్రసాద్... తాను కూడా కేరళకు వెళ్లి తోడుగా ఉన్నారు.
అనూహ్యకు కన్నీటి వీడ్కోలు
Published Sun, Jan 19 2014 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM
Advertisement
Advertisement